మద్యంపై క‌న్నెర‌

6 Jul, 2017 23:54 IST|Sakshi
మద్యంపై క‌న్నెర‌
- జిల్లాలో కొనసాగుతున్న మహిళల నిరసనలు 
సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా జిల్లాలో మహిళలు, విద్యార్థులు, స్థానికుల నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. గురువారం పలుచోట్ల మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ మహిళలు ఆందోళనలు చేశారు. శంఖవరం మండలంలో ఇళ్ల మధ్య ఉన్న బ్రాందీషాపును తొలగించాలని మహిళలు, విద్యార్థులు షాపు ఎదుట ధర్నా చేశారు. మండపేటలోని గొల్లపుంత రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్ద కాలనీకి చెందిన మహిళలు ధర్నా చేశారు. మందుబాబుల ఆగడాలతో చీకటిపడిందంటే కాలనీకి వెళ్ళేందుకు భయబ్రాంతులకు గురికావాల్సి వస్తుందని, ఆడపిల్లల వెంటపడి అల్లరిస్తున్నారని వాపోయారు. మందుబాబుల తీరుతో బడికి వెళ్లే ఆడపిల్లలను స్కూల్‌ మాన్పించేస్తామని పోలీసులకు, ఎక్సైజ్‌ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కడియం మండలం వేమగరి, దుళ్ళలో మద్యంషాపులు తీసేయాలని మహిళలు మద్యంషాపుల గోడలను పడగొట్టారు. కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు, స్థానికులు ఆందోళన చేశారు. రాజమహేంద్రవరంలో మద్యం విధానాన్ని నిరసిస్తూ జాంపేటలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలా రెడ్డి,  వైఎస్సార్‌ సీపీ సిటీ కో–ఆర్డినేటర్‌ రౌతు సూర్య ప్రకాశరావులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందికరంగా మద్యం షాపులు నిర్వహిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.పెద్దాపురంలో ఐద్వా ఆధ్వర్యంలో, సామర్లకోటలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. 
 
మరిన్ని వార్తలు