వైద్యం కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలు

14 Jun, 2017 00:19 IST|Sakshi
  • రోడ్డు ప్రమాదంలో రోగి, ఆర్‌ఎంపీ వైద్యుడి మృతి
  • బుర్రిలంక వద్ద హైవేపై బైక్‌కు ఢీకొన్న వ్యాన్‌
  • మూలస్థానం అగ్రహారానికి ఆయన వైద్యపరంగా మూలస్తంభం.. ఆర్‌ఎంపీగా గ్రామస్తుల ఆరోగ్యాలను కాపాడడంలో గోవిందరాజులు బంధువుగా వ్యవహరిస్తుంటారు. రోగికి మెరుగైన ఆరోగ్యం కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రిలో డాక్టర్లకు చూపించడానికి అతడు వెంటపెట్టుకుని తీసుకువెళ్లాడు. తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురై ఆ రోగి అక్కడికక్కడే మృతి చెందితే.. ఆ ఆర్‌ఎంపీ తీవ్ర గాయాలతో మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనకు మూలస్థానం అగ్రహారం కన్నీరుమున్నీరు విలపించింది. 
     
    కడియం (రాజమహేంద్రవరం రూరల్‌) :
    మండలంలోని బుర్రిలంక వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీస్‌ల కథనం ప్రకారం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహానికి చెందిన నల్లా రమేష్‌ (20)కి జ్వరంతో బాధ పడుతుంటే.. అదే గ్రామంలోని ఆర్‌ఎంపీ మేడిశెట్టి గోవిందరాజు (30) రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి మంగళవారం తన బైక్‌పై తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులకు చూపించి తిరుగు ప్రయాణమయ్యారు. బుర్రిలంక ఇసుక ర్యాంపు వంతెన సమీపంలో వెనుక నుంచి రొయ్యల మేత లోడుతో వస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐషర్‌ వ్యాన్‌ వీరిని బలంగా ఢీకొట్టింది. రమేష్‌ మీదుగా వ్యాన్‌ వెళ్లడంతో తల భాగం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయాడు. గోవిందరాజు కాలు, చేయి, భాగాలతో పాటు శరీరంలోని పలు భాగాలు తెగిపడిపోయాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, కొనఊపిరితో ఉన్న గోవిందరాజును ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రికి వెళ్లేసరికి అతడు మృతి చెందాడు. కడియం ఎస్సై కె.సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 
     
    వెంటనే ఇంటికి సమాచారం..
    ఈ ప్రమాదం సంభవించిన సమయంలో ఇసుక ర్యాంపులో నుంచి మృతుడు రమేష్‌ బంధువులకు చెందిన వాహనం బైటకు వస్తోంది. ఆ వాహనంలోని వారు రమేష్‌ను గుర్తు పట్టి వెంటనే సమాచారానికి అతడి ఇంటికి తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వ్యాన్‌ కింద పడి ఉన్న రమేష్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 
     
    ప్రమాదంపై భిన్న కథనాలు.. 
    మృతులు వెళుతున్న మోటారు సైకిల్‌ను వెనుక నుంచి వ్యాన్‌ ఢీకొట్టిందా? లేక మోటార్‌ సైకిల్‌ ఆగే ప్రయత్నంలో ప్రమాదం సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో అంతకుముందు ఆటో, మోటార్‌ సైకిల్‌ ఢీకొనడంతో ఘర్షణ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో హైవేపై వెళుతున్న గోవిందరాజు, రమేష్‌ అక్కడ ఆగేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టిందని తెలిపారు. దీంతో అంతవరకూ ఘర్షణ పడుతున్న వారు అక్కడినుంచి ఉడాయించారు.
     
    మూలస్థాన అగ్రహారంలో విషాద ఛాయలు
    ఆలమూరు : బుర్రిలంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలస్థాన అగ్రహారానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు మేడిశెట్టి గోవిందరాజు, వ్యవసాయ కూలీ నల్లా రమేష్‌ మృత్యువాత పడటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో సుమారు 20 ఏళ్లుగా గోవిందరాజులు గ్రామస్తులతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకుని అనేక మందికి వైద్యం చేశారు. రోగులకు అప్యాయతతో వైద్యం చేసే అతడు అందరి మన్ననలను పొందాడు. అనేకమంది ప్రాణాలను నిలిపిన వైద్యుడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ కూలీ రమేష్‌ మృతి అతని కుటుంబంలో తీరిన వేదనను మిగిల్చింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్‌ తండ్రి శ్రీనివాస్‌ దుర్మరణం పాలయ్యాడు. ఇప్పుడు రమేష్‌ మృతి చెందడం వారి కుటుంబ సభ్యుల్లో తీరని వేదనను మిగిల్చింది. కుటుంబ నిర్వహణలో చేదోడువాదోడుగా ఉంటున్న రమేష్‌ మృతి చెందాడనే వార్తను కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు.  
మరిన్ని వార్తలు