వదలని సాంకేతిక సమస్యలు

30 Jul, 2017 00:56 IST|Sakshi
వదలని సాంకేతిక సమస్యలు
ఎట్టకేలకు ఎస్జీటీల కౌన్సెలింగ్‌ ప్రారంభం
 నత్తనడకగా ప్రక్రియ
 గడువులోపే ముగించే పనిలో అధికారులు 
 ఉపాధ్యాయులకు తప్పని ఇబ్బందులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట):
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ ముగింపు దశకు చేరినా సాంకేతిక లోపాలు కొనసాగుతుండడంతో ఉపాధ్యాయుల్లో తీవక్ర అసహనం వ్యక్తమౌతోంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ నెల 22న హడావుడిగా ప్రారంభించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదినుంచీ సాంకేతిక లోపాలతో నత్తనడకగా సాగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌లు ఉదయం 10 గంటలలోపు ఏనాడూ ప్రారంభం కాలేదు. వాయిదాలు పడుతూ వస్తున్న స్పెషల్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,200 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తులు చేసుకోగా వీరిలో సుమారు 1,546 మంది ఒకే కేంద్రంలో ఎనిమిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు ఉన్నారు. వీరుగాక 1,510 మంది గిరిజనేతర ప్రాంతానికి, మరో 36 మంది ఏజెన్సీ ఏరియాకు బదిలీలు కావాల్సిన వారూ ఉన్నారు. 
మూడు గంటల ఆలస్యం
శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌ లింకేజిని తెరవకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. 250 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించేటప్పటికి మరో సారి వెబ్‌సైట్‌ లింక్‌ కట్టయింది. దీంతో అరగంట పాటు కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. డీఈఓ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు 400 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా సాయంత్రం 5 గంటల సమయానికి 335 మందికి మాత్రమే కౌన్సెలింగ్‌ పూర్తయింది. గడువులోపు కౌన్సెలింగ్‌ పూర్తికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రణాళిక లేదు
 గెడ్డం సుధీర్, వైఎసార్‌ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక లేకపోవడమే కౌన్సెలింగ్‌ ఆలస్యమౌతోంది. ఎప్పటికప్పుడు జీఓలు మార్చుతూ సవరణ ఉత్తర్వులిస్తూ ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ప్రారంభించిన తరువాత సాంకేతిక లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించింది. భవిష్యత్‌లో ఇటువంటివి జరుగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలి
 
ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో జాప్యం
 బీఏ సాల్మన్‌ రాజు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
బదిలీల కౌన్సెలింగ్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ విద్యాశాఖ జిల్లా అధికారులకు ఇవ్వక పోవడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల్లోనే కౌన్సిలింగ్‌ నిర్వహించి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కావు.
 
 
 
>
మరిన్ని వార్తలు