ఓపెన్‌కాస్టు సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

2 Aug, 2016 23:52 IST|Sakshi
ఓపెన్‌కాస్టు సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
  • ఏం ఇస్తారో చెప్పి సర్వేలు చేయాలి
  • దుబ్బగూడెం గ్రామస్తులు
  • కాసిపేట : మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తులు మంగళవారం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కోసం గ్రామంలో చేస్తున్న సర్వేను అడ్డుకుని అధికారులను తిప్పి పంపారు. సింగరేణి యాజమాన్యం కేకే ఓపెన్‌కాస్టు కోసం దుబ్బగూడెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వైశాల్యం సర్వే అనంతరం ఇంటి విలువ లెక్కించేందుకు తిరిగి సర్వే చేయాల్సి ఉంది.
    దీంతో సర్వే చేసేందుకు ఏంఆర్‌ఐ కమల్‌సింగ్‌ ఆధ్వర్యంలో సర్వేయర్లు సర్వే చేస్తుండగా ముందు ఏం ఇస్తారో చెప్పి సర్వేలు చేయాలని అప్పటి వరకు నిలిపివేయాలని  గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ప్రజల ఒప్పందం లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.
    ఒకపక్క ఓసీ వద్దని ప్రజలు ఆందోళనలు చేస్తుంటే కనీసం వారికి ఏం ఇస్తారో, ఎక్కడ స్థలం ఇస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సర్వేలు పూర్తి అవుతున్నాయని ప్రకటించడం దారుణమన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారులు నడుచుకోవాలని సూచించారు. అధికారులతో వాదనకు దిగిన గ్రామస్తులు సర్వే నిలిపివేసి అధికారులను అక్కడి నుంచి పంపించారు.
    నాలుగు రోజులు గడువు ఇవ్వాలి
    – జెడ్పీటీసీ సత్తయ్య
    సర్వేలకు నాలుగు రోజులు గడువు ఇవ్వాలని జెడ్పీటీసీ రౌతు సత్తయ్య కోరారు. సర్వే అడ్డగించిన అనంతరం అక్కడకు చేరుకున్న జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజలు ఏం ఇస్తారో చెప్పాలని కోరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రజల సూచన మేరకు నాలుగు రోజులు గడువు ఇచ్చి అనంతరం సర్వేలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట ప్రజలకు పునరావాసంపై అవగహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు.
     
>
మరిన్ని వార్తలు