విద్యార్థులను చితకబాదిన టీచర్‌

1 Mar, 2017 23:31 IST|Sakshi

గుంతకల్లు రూరల్‌ : గుంతకల్లు మండలం గొల్లలదొడ్డి గ్రామంలోని చైతన్య ప్రైవేటు పాఠశాల  ఉపాధ్యాయురాలు కళ్యాణి విద్యార్థులను చితకబాదారు. ఈమె రెండు నుంచి ఆరో తరగతి వరకు గణితం సబ్జెక్టు బోధిస్తారు. రెండు రోజుల క్రితం ఒకే ప్రశ్నకు మూడుసార్లు జవాబు రాసుకురావాలంటూ ఆయా తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇచ్చారు. మరుసటి రోజు హోం వర్క్‌ను పరిశీలించారు. మూడుసార్లు జవాబు రాసినప్పటికీ ప్రశ్న ఒక్కసారే రాసి ఉండటంతో ఆగ్రహించారు.

దాదాపు 20 మంది విద్యార్థులను బెత్తంతో చితకబాదారు. వారికి శరీరంపై ఎర్రటి బొబ్బలు ఏర్పడ్డాయి. ఇంటికొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు విషయం తెలిసింది.  కళ్యాణి నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు పాఠశాలకు వెళ్లగా.. ఆమె సెలవుపై వెళ్లిపోయారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌, మరికొంతమంది నాయకులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని, ఉపాధ్యాయురాలి తీరుపై నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పాఠశాల నిర్వాహకులు సర్దిచెప్పడంతో వారు వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు