వెంకయ్యకు పోటీచేసే నైతిక హక్కులేదు

2 May, 2016 02:57 IST|Sakshi
వెంకయ్యకు పోటీచేసే నైతిక హక్కులేదు

♦ ‘ప్రత్యేక హోదా’పై ఆయన మాట తప్పారు
♦ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీచేసే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వెంకయ్యనాయుడును రాజ్యసభకు బలపరిచినపక్షంలో సీఎం చంద్రబాబు కూడా మోసగాడిగానే మిగిలిపోతారని హెచ్చరించారు. రామకృష్ణ ఆదివారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్య రాజ్యసభలో డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్ర విభజన తరువాత వెంకయ్యనాయుడు ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందని, తానే రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి పుస్తకాలు ముద్రించుకుని సన్మానాలు చేయించుకున్నారని ఆయన విమర్శించారు. అయితే ఇంతవరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీల ప్రస్తావన కూడా లేదని దుయ్యబట్టారు. ఇప్పుడు నీతిఆయోగ్‌లో పెట్టలేదు కాబట్టి ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం చేతులెత్తేసిందని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రజల్ని దగా చేయడమేనన్నారు.

రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండడంతో ఏపీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, మిగిలిన ఓట్లు టీడీపీ వారితో వేయించి ఆయన్ను రాజ్యసభకు పంపేలా చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని రామకృష్ణ చెప్పారు. అదే జరిగితే ఇద్దరు నాయుడ్లూ రాష్ట్రప్రజల్ని మోసగించినట్టేనన్నారు. ఇప్పటికే రాష్ట్రప్రజలకు ద్రోహం చేసిన మోసగాడిగా వెంకయ్య ముద్రవేసుకున్నారని, ఆయన్ను బలపరిస్తే చంద్రబాబు కూడా అంతే మోసగాడవుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లులో కేంద్రమిచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్‌చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రామకృష్ణ కోరారు.

>
మరిన్ని వార్తలు