మోదీ సాహస ప్రతిపాదన

2 Dec, 2014 00:23 IST|Sakshi
నరేంద్ర మోదీ

సంపాదకీయం

 ఈశాన్య ప్రాంతానికి సంబంధించి అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన రెండు అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ గువాహటిలో ఆదివారం అస్సాం బీజేపీ కార్యకర్తలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత-బంగ్లాదేశ్‌ల మధ్య దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా ఉన్న భూభాగం సమస్యను పరిష్కరించడం అందులో ఒకటైతే... అస్సాంలోకి బంగ్లాదేశ్‌ నుంచి సాగుతున్న అక్రమ వలసలను అరికట్టడం రెండోది. సరిహద్దు ప్రాంతంలో భూభాగాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారానే అక్రమ వలసలను సమర్థంగా అరికట్టడం సాధ్యమవుతుందన్నది మోదీ ఆలోచన. నిజానికి అస్సాం చరిత్రనూ...అక్కడ ఈ రెండు అంశాలూ తరచు సృష్టించే దుమారాన్ని దృష్టిలో ఉంచుకుంటే మోదీ చేసిన ఈ ప్రతిపాదన సాహసమైనదేనని చెప్పవచ్చు. 1974లో భూభాగాలను ఇచ్చిపుచ్చు కోవడంపై భారత-బంగ్లాదేశ్‌ల మధ్య ఒప్పందం కుదిరినా అందుకు అనుగుణంగా జరగాల్సిన ఇతరత్రా లాంఛనాలు పూర్తికాలేదు. దేశ సరిహద్దుల్ని మార్చడమనే సమస్య ఇమిడి ఉన్నది గనుక ఇందుకు రాజ్యాంగాన్ని సవరించడం తప్పనిసరి. మూడేళ్లక్రితం అప్పటి యూపీఏ సర్కారు ఈ దిశగా కొంత ప్రయత్నం చేసింది. ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ బంగ్లాతో ఈ విషయంలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. దానికి కొనసాగింపుగా నిరుడు రాజ్యసభలో 119వ రాజ్యాంగ సవరణ బిల్లుకూడా ప్రవేశపెట్టారు. సభ సరిగా సాగకపోవడంతో అదింకా పెండింగ్‌లోనే ఉన్నది. అన్ని సరిహద్దు వివాదాల మాదిరే ఇది కూడా వలస పాలన వారసత్వమే. బంగ్లాలో కొంత భూభాగం మనదని మనమూ, మీ అధీనంలో ఉన్న భూభాగంలో కొంత మాదని బంగ్లా వాదించుకోవడమే తప్ప 1947నుంచీ ఎవరి సరిహద్దు ఎక్కడి వరకూ అనే అంశంలో స్పష్టత లేదు.


 రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలు వచ్చినప్పుడు ఏం జరుగుతున్నదో, ఉద్రిక్తతలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలియనిది కాదు. అటువంటిది ఒక పొరుగు దేశంతో భూభాగాన్ని ఇచ్చి పుచ్చుకోవడమంటే అది ఎలాంటి సమస్యలను సృష్టిస్తుందో సులభంగానే అంచనా వేయొచ్చు. అయితే, ఈ ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన వివరాల జోలికి మోదీ వెళ్లలేదు. గత యూపీఏ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆయన నేరుగా అంగీకరించదల్చుకున్నారా లేక ఈ విషయంలో కొత్త ఒప్పందమేమైనా చేసుకుంటే మంచిదని భావిస్తున్నారా అన్న సంగతి చెప్పలేదు. ఆనాటి ఒప్పందం ప్రకారమైతే ప్రస్తుతం బంగ్లా అధీనంలో ఉన్న 7,110 ఎకరాల (51 పరగణాలు) భూమి మనకొస్తుంది. మననుంచి 17,160 ఎకరాల (111 పరగణాలు) భూమి బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. పర్యవసానంగా అస్సాం, త్రిపుర, మేఘాలయ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కొత్త సరిహద్దు రేఖలు ఏర్పడతాయి. ఈ రాష్ట్రాలన్నీ ఎంతో కొంత భూభాగాన్ని కోల్పోవలసి వస్తుంది. అస్సాంకు సంబంధించినంతవరకూ అది బంగ్లాకు 267.5 ఎకరాలు ఇచ్చి... దాన్నుంచి 397.5 ఎకరాలను పొందవలసి ఉంటుంది. ఇలా పరస్పరం మార్పిడయ్యేది భూభాగం మాత్రమే అయితే ‘తీవ్ర దేశభక్తుల’కు తప్ప మిగిలినవారికి పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ, అలా మార్పిడి జరిగే భూభాగంలో మనుషులున్నారు. ఒప్పందం ప్రకారం మననుంచి బంగ్లాకు వెళ్లే  భూభాగంలో 37,334మంది జనాభా ఉన్నారు. బంగ్లానుంచి మనకొచ్చే భూభాగంలో 14,215మంది నివసిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా తమను ‘అవతలి’ దేశానికి పంపొద్దని రెండు ప్రాంతాల వాసులూ వేడుకుంటున్నారు. ఆ ప్రాంతంతో, అక్కడివారితో ఏర్పడిన అనుబంధంవల్ల కావొచ్చు ...దాన్ని బంగ్లాకు ఇస్తామంటే ఒప్పుకునేది లేదని అసోం గణపరిషత్, బీజేపీ అస్సాం విభాగం ఇదివరకే తేల్చిచెప్పాయి. నిరసనలు, ఆందోళనలు జరిపాయి. బెంగాల్‌లో తృణమూల్ సైతం ఆ ఒప్పందాన్ని తప్పుబట్టింది. దాన్ని అంగీకరించబోమన్నది. ఇక కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకూ ఇప్పుడు కేంద్రంలో తమ పార్టీ అధికారంలో లేదు గనుక ఆ పార్టీ తాజా వైఖరేమిటో చూడాల్సి ఉంది. 2016లో అస్సాం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బంగ్లాతో ఒప్పందం కుదుర్చుకుంటామని మోదీ చేసిన ప్రకటన సహజంగానే అస్సాం బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. పొరుగునున్న బంగ్లానుంచి అస్సాంకు అక్రమ వలసలు సాగుతున్నాయని అస్సాం బీజేపీ ఆరోపిస్తున్నా సరిహద్దుల్లో ఏర్పడ్డ అనిశ్చితే ఇందుకు కారణమని భావించడంలేదు. అయితే, ఈ భూభాగాలపై రెండు దేశాలకూ అసలైన అర్థంలో అజ్మాయిషీ లేదని, పర్యవసానంగా అక్రమ చొరబాట్లకు అవి అడ్డాగా మారాయని ప్రభుత్వం వాదన. సరిహద్దులు ఏర్పడితే పటిష్టమైన గస్తీతో చొరబాట్లను ఆపొచ్చని చెబుతున్నది.


 అక్రమ వలసల సమస్య మరో కోణంలో వివాదాస్పదమైనది. మైనారిటీలంతా బంగ్లాదేశ్‌నుంచి వలసవచ్చినవారేనని బీజేపీ, అసోం గణపరిషత్‌లు వాదిస్తాయి. తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి కాంగ్రెస్ వీటిని ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తాయి. మైనారిటీలందరూ విదేశీలయులే అనడం ఎంత తప్పో...అసలు అక్రమ వలసలు లేనేలేవనడం కూడా అంతే తప్పు. ఏళ్లతరబడి ఎటూ తేలకుండా, ఎన్నికల సమయంలో మాత్రం ఆనవాయితీగా చర్చనీయాంశమవుతున్న ఈ సమస్య నిజానికి కొందరికి ప్రాణాంతకమవుతున్నది. 150 ఏళ్లక్రితం తేయాకు తోటల్లో పనిచేయడానికి అవిభక్త బెంగాల్‌నుంచి ఈస్టిండియా కంపెనీ తరలించినవారిలో చాలామంది ఇప్పటికీ ‘చొరబాటుదార్ల’ ముద్రతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి స్థిరమైన ఉద్యోగాలుగానీ, రేషన్ కార్డులుగానీ ఉండవు. పైగా బోడోలు, ఇతర తెగలూ వీరిపై దాడులు చేస్తాయి. సరిహద్దులు ఏర్పడితే అక్రమ చొరబాట్లు ఆగుతాయన్న ప్రభుత్వం వాదన ఒప్పుకున్నా ఇప్పుడు చొరబాటుదార్లుగా ముద్రపడినవారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో...భూభాగాన్ని వదులుకోవడానికి ససేమిరా అంటున్నవారిని మోదీ ఎలా ఒప్పిస్తారో చూడాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు