అసంపూర్ణ ‘ఆధార్’

15 Mar, 2016 02:13 IST|Sakshi
అసంపూర్ణ ‘ఆధార్’

ఎలాంటి చట్టబద్ధతా లేకుండా దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతూ ఇప్పటికి 99 కోట్లమంది పౌరుల వ్యక్తిగత వివరాల సేకరణ కూడా పూర్తయిన తర్వాత ఆధార్ కార్డు పథకానికి సాధికారత కల్పించే పని మొదలైంది. ఆధార్‌కు చట్టబద్ధ ప్రాతిపదికను కల్పించడానికి సంకల్పించామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఇచ్చిన హామీకి అనుగుణంగా బిల్లు శనివారం లోక్‌సభకు రావడం, దానికి ఆమోదం లభించడం కూడా పూర్తయింది.

 

దీన్ని ప్రభుత్వం ద్రవ్య బిల్లుగా పరిగణించినందువల్ల విపక్షం ఆధిక్యత ఉన్న రాజ్యసభలో బిల్లుకు సవరణలు ప్రతిపాదించడం సాధ్యపడదు. అది కేవలం కొన్ని సూచనలు చేస్తూ లోక్‌సభకు తిప్పిపంపడం వీలవుతుంది. ఆ సూచనలను లోక్‌సభ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.  ఆధార్ పథకం తీరుతెన్నులపైనా, దాని ఉద్దేశాలపైనా వచ్చినన్ని అనుమానాలూ, సందేహాలూ మరే ఇతర పథకంపైనా రాలేదు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి రూ. 75,000 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేసిన ఒక బృహత్తర పథకాన్ని నిర్దిష్టమైన ప్రాతిపదిక లేకుండా మొదలుపెట్టిందీ, కొనసాగించిందీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే.

 

2009లో కేవలం ఒక పాలనాపరమైన ఉత్తర్వు ద్వారా దీన్ని ఉనికిలోకి తెచ్చిన ఘనత ఆ ప్రభుత్వానిదే. ఎన్నో విమర్శలు వచ్చాకా, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాకా ఆదరా బాదరాగా 2010లో జాతీయ గుర్తింపు ప్రాధికార సంస్థ బిల్లు పేరిట దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పథకం తీరుతెన్నులను సభ్యులంతా తూర్పారబట్టారు. చివరకు విపక్షాల ఒత్తిడితో ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడం...బిల్లును టోకుగా ఆ కమిటీ తిరస్కరించడం చరిత్ర. బీజేపీ సీనియర్ సభ్యుడు యశ్వంత్‌సిన్హా నేతృత్వంలోని ఆ కమిటీ బిల్లులోని వైరుధ్యాలనూ, అస్పష్టతలనూ నిశితంగా విమర్శించింది.

 

ఆ తర్వాత దాని స్థానంలో బిల్లు తెస్తామని చెప్పడం తప్ప...అలా తెచ్చేందుకు యూపీఏ సర్కారు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మరోపక్క పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉన్న ఇలాంటి పథకాన్ని తుది తీర్పు వెలువరించేవరకూ అమలు పరచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మొదట్లో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏ పథకానికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడానికి వీల్లేదని చెప్పింది. అయితే అనంతరకాలంలో కేంద్ర ప్రభుత్వం వినతి మేరకు జాతీయ ఉపాధి హామీ పథకంవంటి కొన్ని పథకాలకు వర్తింపజేసేందుకు అనుమతినిచ్చింది.

 

ఇంత నేపథ్యాన్ని మూటగట్టుకున్న ఆధార్ పథకంపై ఇన్నాళ్ల తర్వాత చట్టసభ ముందుకు ఒక బిల్లు రావడం, దానిపై చర్చ జరిగి ఆమోదం పొందడం మెచ్చదగిందే. అయితే ఈ మొత్తం క్రమం చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. తనకు మెజారిటీ లేని రాజ్యసభలో ఈ బిల్లుకు ఆటంకం ఎదురుకాకుండా చూడటానికి వీలుగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. పోనీ లోక్‌సభలోనైనా దానిపై సమగ్ర చర్చ జరిగేలా చూసి, అందులోని లోపాలేమిటో చెబుదామన్న ధ్యాస విపక్షానికి లేకపోయింది. 545మంది సభ్యులుండే సభలో ఆధార్‌పై చర్చ జరిగిన రోజున కేవలం 73మంది సభ్యులు మాత్రమే హాజరుకావడం, 3 గంటల్లోనే చర్చంతా ముగిసిపోవడం అత్యంత ఆశ్చర్యకరం.

 

సభలో అధికార పక్షం బలం 336 అయితే...విపక్షం బలం 205. ఇప్పుడు ద్రవ్య బిల్లుగా దీన్ని తీసుకురావడంపై విమర్శలు చేస్తున్న విపక్షాలు చర్చ సందర్భంగా లోక్‌సభలో తాము ఎంత బాధ్యతగా వ్యవహరించాయో సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఈ బిల్లుకు కొందరు విపక్ష సభ్యులు చేసిన సవరణలు మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురయ్యాయి. సవరణలు ప్రతిపాదించిన కొందరు సభ్యులు అసలు సభకే హాజరుకాలేదు.  ఆధార్‌పై అటు సుప్రీంకోర్టు ముందు వ్యక్తమైన భయాందోళనలకుగానీ...పార్లమెంటులోనూ, వెలుపలా తలెత్తిన ప్రశ్నలకుగానీ ఎలాంటి జవాబూ లభించకుండానే ఆధార్ పథకానికి ఇప్పుడు చట్టబద్ధత లభించబోతున్నది.

 

ఈ సందర్భంగా ఆధార్‌పై ఉన్న అభ్యంతరాలేమిటో గుర్తుచేసుకోవాలి. నేరస్తుల దగ్గర్నుంచి సేకరించినట్టుగా పౌరుల వేలిముద్రల్ని తీసుకోవడం... ఐరిస్ గుర్తింపు, బ్యాంకు ఖాతాలు, ఈ మెయిల్, సెల్‌ఫోన్ నంబర్ వగైరా వివరాలు రాబట్టడంవంటివి ఎందుకన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ వివరాలను దుర్వినియోగం చేయబోమని, అవి ఎవరికీ చేరకుండా పటిష్టమైన డేటా బేస్‌లో నిక్షిప్తం చేసి ఉంచుతామని హామీ ఇవ్వడం మినహా ఆనాటి యూపీఏ ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. అయితే శత్రు దుర్భేద్యమైన సర్వర్‌లను ఉపయోగిస్తున్నామని భావించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌కే హ్యాకింగ్ తప్పలేదు.

 

ఇందిర హత్యానంతరం 1984లో ఢిల్లీలో ఓటర్ల జాబితా ఆధారంగా సిక్కుల ఇళ్లను గుర్తించి, ఆ మతానికి చెందిన పౌరులను ఊచకోత కోశారని గుర్తుంచుకుంటే ఇలాంటి డేటా అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే ఎంత ప్రమాదమో అర్ధమవుతుంది. పౌరుల బయోమెట్రిక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ వెల్లడించబోమని చర్చ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. కానీ ‘జాతీయ భద్రతా కారణాలరీత్యా’ అవసరమైతే ఈ డేటాను కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారికి అందించవచ్చునని బిల్లు చెబుతోంది. ఏది జాతీయ భద్రత అన్న సంగతిని నిర్ణయించేది పాలకులే గనుక సారాంశంలో వారనుకున్నదే అవుతుందని వేరే చెప్పనవసరం లేదు.

 

అలాంటప్పుడు పౌరుల హక్కులను కాపాడేందుకు అనువైన రక్షణలు ఇందులో ఏమున్నట్టు? పౌరులకు సంబంధించిన ఇలాంటి డేటా సేకరణ వృధా ప్రయాసేగాక, దాన్ని రక్షించడం కూడా అసాధ్యమని గుర్తించాక బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటివి అలాంటి ప్రయత్నాన్ని మధ్యలో విరమించుకున్నాయి. మన దేశంలో మాత్రం ఆధార్ నమోదు స్వచ్ఛందం అని చెబుతూనే దాన్ని అన్ని పథకాలతో ముడిపెట్టి తప్పనిసరిగా మారుస్తున్నారు. ఈ తరహా విధానాలు అప్రజాస్వామికమేగాక పౌరుల వ్యక్తిగత గోప్యతకు కూడా ముప్పు కలిగించేవి. బిల్లుపై సమగ్రమైన చర్చ జరగకపోవడంవల్ల ఇలాంటివన్నీ ప్రస్తావనకు రాకుండానే...తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే ఆధార్ చట్టం కాబోతున్నది. ఇది దురదృష్టకరమైన విషయం.

>
మరిన్ని వార్తలు