అత్యంత ప్రాముఖ్యమైన రోజు యౌమె ఆషూరా

8 Nov, 2013 00:31 IST|Sakshi
అత్యంత ప్రాముఖ్యమైన రోజు యౌమె ఆషూరా

ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు దుస్తులు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు.
 
ముహర్రం మాసం పదవతేదీని ‘యౌమె ఆషూరా’ అంటారు. ఇస్లామీ ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోజు ముస్లింలు రోజా ((ఉపవాసం) పాటిస్తారు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త (స) రమజాన్ రోజాల  తర్వాత మళ్లీ అంత శ్రద్ధగా ‘ఆషూరా’ రోజానే పాటించేవారు. ప్రజాస్వామ్య ప్రేమికుడైన ఇమా మె హుసైన్ (రజి) ధర్మపోరాటంలో అమరులైంది ఈ రోజే. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యమే ఉంది.

ఆరోజు దైవం ఆదిమానవుడైన హ . ఆదం(అ)పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. హ. ఇద్రీస్ (అ)కు ఆకాశంలో ఉన్నతస్థానాన్ని అదే రోజు దైవం హ. మూసా(అ)తో సంభాషించాడు. ఆయనకు ‘తౌరాత్’ గ్రంథాన్ని బహూకరించాడు. హ.అయ్యూబ్ (అ), హ. యూసుఫ్ (అ) లు కలుసుకున్నది ఈరోజే. హ. యూనుస్ (అ)ను దైవం చేప కడుపు నుండి రక్షించింది కూడా ఈ రోజే. ఫిరౌన్ బారినుండి హ.మూసా(అ) జాతి జనులను నీల్ సముద్రంలో ప్రత్యేకమార్గం ఏర్పాటుచేసి రక్షించింది కూడా ఈ రోజే. ఇదే రోజు దైవం హ. దావూద్ (అ)ను కనికరించి క్షమించి వేశాడు. ఇదేరోజు హ. సులైమాన్ (అ) కు మరోసారి అధికార పీఠం అప్పగించాడు. ఈ రోజే హ. ఈసా (అ)ను దైవం ఆకాశం పైకి ఎత్తుకున్నాడు. హ. జిబ్రీల్ (అ) దైవ కారుణ్యాన్ని తీసుకుని దివినుంచి భువికి దిగివచ్చింది కూడా ఈ రోజే.
 
ఇదేరోజు ముహమ్మద్ ప్రవక్త (స) ముద్దుల మన వడు హ. ఇమామె హుసైన్ (రజి)తోపాటు, ఆయన సహచరులు, కుటుంబీకులు మొత్తం సుమారు డెబ్భయి రెండుమంది అమరులయ్యారు. ఈ ఆషూరా రోజునే దైవం ఈ సృష్టిని సృజించాడు. మొట్టమొదటిసారి ఆకాశం నుండి వర్షం కురిసింది కూడా ఈ రోజే. దైవకారుణ్యం భూమిపై అవతరించింది కూడా ఈరోజునే.
 
ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు వస్త్రాలు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. స్వర్గ దస్తర్‌ఖాన్ దృష్ట్యా ముహర్రం మాసం పదవ తేదీని యౌమె ఆషూరా అంటారు.
 
అసలు ముహర్రం అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేర్లు హసన్, హుసైన్. (ర). ముస్లింలకే కాదు, ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారికుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతి, సామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామిక పరిరక్షణకు వారు చేసిన అవిరళ కృషి, వేలాది శతృసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీర ఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టులు, దుర్మార్గులు అయిన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది.
 
ఎప్పుడైతే, ఎక్కడైతే న్యాయం, ధర్మం అనేది కాలు మోపుతుందో అప్పుడే, అక్కడే అన్యాయం, అధర్మం కూడా రంగప్రవేశం చేస్తుంది. న్యాయాన్ని, ధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రయత్నిస్తుంది. కుయుక్తిని, కుటిలబుద్ధిని ప్రయోగిస్తుంది. ఇది మనకు చరిత్ర చెప్పే సత్యం. మంచీ చెడుల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. ముందు ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది నిప్పులాంటి నిజం. ఈ విధంగా సత్యాసత్యాలకు, ధర్మాధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణా ఫలితమే కర్బలా దుర్ఘటన.

 - యండీ ఉస్మాన్ ఖాన్
 

మరిన్ని వార్తలు