‘టెస్టు’ పాసయ్యాడు | Sakshi
Sakshi News home page

‘టెస్టు’ పాసయ్యాడు

Published Fri, Nov 8 2013 12:36 AM

‘టెస్టు’ పాసయ్యాడు

వన్డేల్లో భీకరమైన ఫామ్... కానీ టెస్టు జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్న అనుమానం... దక్కినా తుది జట్టులో ఉంటాడో లేదోనన్న సందిగ్ధం... ఒకవేళ ఆడించినా టెస్టుల్లో నిలబడగలడా అనే సందేహం... సచిన్ వీడ్కోలు సిరీస్ కావడంతో ఎన్నో సవాళ్లు... అంతకుమించిన ఒత్తిడి... మాస్టర్ కెరీర్ ఆఖరి అంకానికి చేరుకున్న వేళ... జట్టులోకి వచ్చిన యువ రోహిత్ ఒకే ఒక్క మ్యాచ్‌తో ‘టెస్టు’ పాసయ్యాడు. అటు సచిన్ వెళ్లిపోతున్న లోటును కనిపించకుండా... ఇటు మిడిలార్డర్‌కు ఓ నాణ్యమైన బ్యాట్స్‌మన్ దొరికాడన్న సంతృప్తిని కలిగించాడు.
 
  గింగరాలు తిరుగుతున్న ఈడెన్ వికెట్‌పై భారత కీలక బ్యాట్స్‌మెన్ అందరూ అవుటైనా... చివరి వరుస బ్యాట్స్‌మన్ అశ్విన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతమైన శతకంతో భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. దీంతో తొలి టెస్టులో ధోనిసేన పట్టుబిగించింది. కరీబియన్లు ఆరంభంలో చెలరేగినా... చివర్లో ‘రోహిత్’ తంత్రానికి చేతులెత్తేశారు.
 
 కోల్‌కతా: ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో చెలరేగిన హేమాహేమీలు చతికిలపడిన వేళ... గింగరాలు తిరుగుతున్న వికెట్‌పై బంతిని ముట్టుకునేందుకే బ్యాట్స్‌మెన్ భయపడుతున్న తరుణంలో... భారత్ 83 పరుగులకే సగం జట్టును కోల్పోయిన కష్టంలో... కెరీర్ తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ శర్మ (228 బంతుల్లో 127 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్సర్)తో పాటు అప్పుడప్పుడు మెరిసే అశ్విన్ (148 బంతుల్లో 92 బ్యాటింగ్; 10 ఫోర్లు) అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
 
  కష్టాల్లో పడిన జట్టును తమ బ్యాట్లు అడ్డేసి కాపాడారు. దాదాపు రెండు సెషన్ల పాటు కరీబియన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీ భాగస్వామ్యంతో ధోనిసేనను గట్టెక్కించారు. దీంతో విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 120 పరుగుల ఆధిక్యంలో ఉంది. ధోని (42) ఓ మోస్తరుగా ఆడినా టాప్ ఆర్డర్ విఫలమైంది. రోహిత్, అశ్విన్‌లు ఏడో వికెట్‌కు అజేయంగా 198 పరుగులు జోడించారు. ఆరంభం నుంచే స్పిన్ మ్యాజిక్‌ను చూపిన షిల్లింగ్‌ఫోర్డ్ 4 వికెట్లతో చెలరేగగా, బెస్ట్, కొట్రీల్‌కు చెరో వికెట్ దక్కింది.  అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. పిచ్ పరిస్థితిని గమనిస్తే... తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇప్పటికే 120 పరుగుల మంచి ఆధిక్యం దొరికినట్టయింది. ఇక మూడో రోజు కూడా రోహిత్ జోరు కొనసాగితే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్లే.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 234 ఆలౌట్
 భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 23; విజయ్ (స్టంప్డ్) రామ్‌దిన్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 26; పుజారా (సి) రామ్‌దిన్ (బి) కొట్రీల్ 17; సచిన్ ఎల్బీడబ్ల్యూ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 10; కోహ్లి (సి) పావెల్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 3; రోహిత్ బ్యాటింగ్ 127; ధోని (సి) రామ్‌దిన్ (బి) బెస్ట్ 42; అశ్విన్ బ్యాటింగ్ 92; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (102 ఓవర్లలో 6 వికెట్లకు) 354.
 
 వికెట్లపతనం: 1-42; 2-57; 3-79; 4-82; 5-83; 6-156
 బౌలింగ్: బెస్ట్ 14-0-53-1; కొట్రీల్ 15-3-53-1; షిల్లింగ్‌ఫోర్డ్ 41-8-130-4; పెరుమాల్ 20-1-54-0; స్యామీ 12-1-52-0
 
 
 సెషన్-1 ఓవర్లు: 27    పరుగులు: 83    వికెట్లు: 5
ఆరంభంలో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధావన్ (23), విజయ్ (26)లు పరుగులు చేయలేకపోయారు వికెట్ మీద పగుళ్లు ఎక్కువగా కనిపించడంతో స్యామీ... స్పిన్నర్ షిల్లింగ్‌ఫోర్డ్‌ను రంగంలోకి దించాడు. తన రెండో, ఐదో ఓవర్‌లో షిల్లింగ్ ఫోర్డ్... ధావన్, విజయ్‌లను బోల్తా కొట్టించాడు. పుజారా (17) కాస్త ఇబ్బందిపడినా.... అప్పుడే క్రీజులోకి వచ్చిన సచిన్ (10) బ్యాట్‌ను ఝుళిపించే ప్రయత్నం చేశాడు.
 
 
  షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి ఒత్తిడిని తగ్గించాడు. 28వ ఓవర్‌లో కొట్రీల్ వేసిన ఓ వేగవంతమైన బంతికి పుజారా అవుట్‌కాగా... ఆ తర్వాతి ఓవర్‌లోనే షిల్లింగ్‌ఫోర్డ్ దూస్రాతో సచిన్‌ను అవుట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ నిలకడకు ప్రాధాన్యమిచ్చాడు. అయితే తన తర్వాతి ఓవర్‌లో షిల్లింగ్‌ఫోర్డ్.... కోహ్లి (3)ని వెనక్కిపంపడంతో భారత్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని... రోహిత్‌తో కలిసి నిలకడగా ఆడాడు. దీంతో భారత్ 120/5 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. మొత్తానికి ఈ సెషన్‌లో షిల్లింగ్‌ఫోర్డ్ హవా నడిచింది.
 
 సెషన్-2 ఓవర్లు: 29    పరుగులు: 109    వికెట్లు: 1
 ఈ సెషన్‌లో వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసిన ధోని, రోహిత్ స్ట్రయిక్‌ను రొటేట్ చేశారు. దీంతో సింగిల్స్, డబుల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విండీస్ బౌలర్ బెస్ట్... నిలకడగా ఆడుతున్న ఈ జోడీని విడగొట్టాడు.
 
 
 ఓ పేలవమైన షాట్‌ను కొట్టిన కెప్టెన్... రామ్‌దిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 73 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి భారత్ స్కోరు 156/6. అయినా రోహిత్ ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్‌కు సూచనలు చేస్తూ కీలక ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. పెరుమాల్ బౌలింగ్‌లో అశ్విన్ రెండు బౌండరీలు కొట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. వీరిద్దరు నికలడగా ఆడటంతో టీ విరామానికి భారత్ 6 వికెట్లకు 229 పరుగులు చేసింది.
 
 సెషన్-3 ఓవర్లు: 34    పరుగులు: 125    వికెట్లు: 0
 టీ తర్వాత ఎదుర్కొన్న తొలి ఓవర్‌లో రోహిత్ ఫోర్ కొట్టడంతో విండీస్ స్కోరుతో సమమైంది. బౌన్స్‌ను ఎదుర్కోవడంలో అతను కాస్త ఇబ్బందిపడ్డా.. స్పిన్నర్లను మాత్రం సమర్థంగా ఆడాడు. అశ్విన్ కూడా చక్కని సహకారం అందిస్తూ 71 బంతుల్లో టెస్టుల్లో నాలుగో అర్ధసెంచరీ సాధించాడు.
 
  షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా ఓ భారీ సిక్సర్ బాదిన రోహిత్... సెంచరీ దిశగా అడుగులు వేశాడు. కొట్రీల్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి కెరీర్‌లో తొలి చిరస్మరణీయ శతకాన్ని (194 బంతుల్లో) అందుకున్నాడు. ఓవరాల్‌గా అరంగేట్రం టెస్టుల్లో సెంచరీ చేసిన 98వ క్రికెటర్ అయ్యాడు. ఈ జోడిని విడదీసేందుకు విండీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారత్ ఆధిపత్యం కొనసాగిన ఈ సెషన్‌లో కరీబియన్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మొత్తానికి చేతిలోకి వచ్చిందనుకున్న మ్యాచ్‌పై విండీస్ పట్టు వదిలేసుకుంది.
 
 ‘30 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన మైక్ హస్సీ నాకు స్ఫూర్తి. టెస్టు అవకాశం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇందుకు నేను భిన్నమేమీ కాదు. ఒక్కసారి అవకాశం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించా. మనలో నైపుణ్యం ఉంటే ఏ అంశానికీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. టెస్టులు ఆడే సమయం నాకూ వస్తుందని తెలుసు. 2010లో అవకాశం చేజారినందుకు కాస్త బాధపడ్డా. తొలి టెస్టులోనే సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మ్యాచ్ మా ఆధీనంలోకి వచ్చింది. ఈడెన్‌లో ఆడటం నాకు చాలా ప్రత్యేకం’ -రోహిత్‌శర్మ
 
 1 విండీస్‌పై అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ రోహిత్.
 
 3 కెరీర్ తొలి టెస్టులో ఈడెన్‌లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్ రోహిత్.
 
 14 అరంగేట్రం టెస్టులో సెంచరీ కొట్టిన 14వ భారత బ్యాట్స్‌మన్ రోహిత్.
 
 63 టెస్టుల్లో సచిన్ ఎల్బీడబ్ల్యూల సంఖ్య. ఈ ఫార్మాట్‌లో ఇదే అత్యధికం
 
 92 టెస్టుల్లో అశ్విన్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.
 
 11 షిల్లింగ్‌ఫోర్డ్ 11 టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
 

Advertisement
Advertisement