జీయర్‌ స్వామివారి  తిరుప్పావై యజ్ఞం సన్నిధి

13 Jan, 2019 01:59 IST|Sakshi

సన్నిధి

రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా భాగ్యనగరంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి అధ్వర్యాన తిరుప్పావై యజ్ఞం ప్రతి ధనుర్మాసంలోనూ అద్భుతంగా సాగుతూ ఉంటుంది. తిరుప్పావై అంటే శ్రీ నోము అని సిరినోము అని అర్థం. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నమ్మే శ్రీవైష్ణవ మతానువర్తులు ఏటేటా అనుసరించే ఈ వ్రతాన్ని కాత్యాయనీ వ్రతం అని కూడా అంటారు. పన్నెండుగురు వైష్ణవ ఆళ్వార్‌ (భగవత్‌ దార్శనికులు, దారి చూపిన వారు) లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌ వటపత్రశాయి ఆలయంలో పెరియాళ్వార్‌ పెంచిన తులసితోటలో దొరికిన పాప గోదాదేవి. ఆయన మనసులో ఎప్పడికీ విష్ణువే కనుక విష్ణుచిత్తుడనే పేరు వచ్చింది. గోదాదేవి తండ్రి పెంపకంలో  పరమభక్తురాలిగా ఎదిగింది.

ఆమె రచించిన ముఫ్ఫయ్‌ తమిళ పాశురాలు (ఎనిమిది పాదాల పద్యాలు)– నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవత గ్రంథాల సారాంశాన్ని రంగరించినవి. నిష్కల్మషమైన భక్తిని అక్షరక్షరంలో ప్రత్యక్షం చేసే గోవింద గీతా ప్రబంధం తిరుప్పావై అని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి వివరిస్తున్నారు. ఈసారి ధనుర్మాసోత్సవాన్ని ఆధ్యాత్మికులు శ్రీ రామేశ్వరరావు నివాస గృహంలో ఉదయం, సాయంత్రం జీయర్‌ స్వామి స్వయంగా తిరుప్పావై పాశురాన్ని అందరిచేత చదివించి ఆ పాశుర ప్రతిపదార్థాన్ని, సారాంశాన్ని విశేష అర్థాన్ని వివరిస్తూ నెలరోజులుగా నిర్వహిస్తున్నారు. అలతి పదాలలో అపురూపమైన అర్థాన్ని సామాన్యులకు సైతం అవగాహన అయ్యే విధంగా సంస్కృత, తమిళ, తెలుగు, ఆంగ్ల భాషలలో జీయర్‌ స్వామి ప్రబోధిస్తున్నారు.

ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షలాది మంది వింటున్నారు, చూస్తున్నారు.గోదాదేవికి విల్లిపుత్తూరే రేపల్లె. చెలులే గోపికలు. కావేరీ నది యమున. వటపత్రశాయే క్రిష్ణయ్య. గోపికలను తెల్లవారుజామునే నిద్రలేపి, నందగోప రాజు ఇంట నందకిశోరుడైన శ్రీ కృష్ణుని లేచి రమ్మని, నడిచి వస్తే ఆ నడకను వర్ణించి, సింహాసనంపై ఆసీనుడు కాగానే మంగళహారతులు పాడి, తమ వ్రత విధానం, సాధనం, గమ్యం లక్ష్యం అన్నీ నారాయణుడే అని విన్నవించి, తమకు ఏమీ తెలియదని, భక్తి అంటే ఏమిటో కూడా అర్థం కాదని, అయినా అందరితో కలిసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామని, మాకేం కావాలో మీరే నిర్ణయించి మీ బంధువులుగా మమ్ము భావించి ఆ సంబంధంతో మాకు ఆనందాన్నివ్వాలని, కనుక మిమ్మల్నే మేము కోరుకుంటున్నామని గోపికలద్వారా గోవిందునికి విన్నవించడమే తిరుప్పావై అని జీయర్‌ స్వామి అరటి పండు ఒలిచి పెట్టినంత సులభంగా విప్పి చెప్పారు.

తిరుమల, శ్రీరంగం నుంచి మన ఊళ్లో చిన్న గుడి దాకా దేశం మొత్తంమీద విష్ణ్వాలయాలలో నెలరోజుల పాటు ఉదయం వేళ పాశురగానం, సాయంత్రం పాశుర సారాంశ వివరణా ప్రసంగాలు కొన్ని వందల సంవత్సరాలుగా సాగున్నాయి. జీయర్‌ స్వామి మార్గదర్శకత్వంలో అనేకమంది రచయితలు తిరుప్పావైని వివరించే పుస్తకాలు రచించారు. వేలాది ప్రవచన కర్తలు రూపొందారు. జీయర్‌ తిరుప్పావై భక్తి సాగర తరంగాలతో భక్తుల అంతరంగాలను ముంచెత్తుతున్నారు. అర్థం చేసుకున్నవారిని పరమాత్మ వైపు నడిపించే పరమార్థమే జీయర్‌ సాగించే ఈ యజ్ఞ లక్ష్యం. 
–డాక్టర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్య

మరిన్ని వార్తలు