డీఎన్‌ఏ పోగు తగ్గితే... వృద్ధాప్య లక్షణాలు!

25 Jul, 2018 00:12 IST|Sakshi

వయసు ఎంత పెరిగినా.. చర్మం ముడుతలు పడకుండా.. వెంట్రుకలు రాలిపోకుండా చేయవచ్చా? అవునంటున్నారు అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును సరిచేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరు మందగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ పొడవు తగ్గుతున్న కొద్దీ మధుమేహం, వృద్ధులకు వచ్చే నాడీ సంబంధ సమస్యలు, కేన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా దశాబ్ద కాలంలో మనిషి మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏలో నాలుగు కాపీలు తగ్గిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలపై ప్రయోగాలు చేశారు.

యాంటీబయాటిక్‌ల ద్వారా వాటి మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ తగ్గిపోయేలా చేసినప్పుడు కొన్ని వారాల్లోనే వెంట్రుకలు రాలిపోవడంతోపాటు, చర్మం ముడుతలు పడటం మొదలైంది. ఇవన్నీ వృద్ధాప్యంతో వచ్చే లక్షణాలే. కాకపోతే వేగంగా చోటు చేసుకున్నాయి. యాంటీబయాటిక్‌లను నిలిపివేసిన వెంటనే పరిస్థితి చక్కదిద్దుకుంటున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్య లక్షణాలకు, మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ తగ్గుదలకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ద్వారా వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేశవ్‌సింగ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.  

మరిన్ని వార్తలు