రక్తపోటు మందుతో దీర్ఘాయుష్షు?

22 Dec, 2017 10:00 IST|Sakshi

రక్తపోటుకు వేసే మాత్రతో వయసు పెరుగుతుందా? మనుషుల సంగతి ఏమో తెలియదుగానీ.. సీ– ఎలిగాన్స్‌ (రౌండ్‌ వర్మ్‌) అనే సూక్ష్మజీవుల విషయంలో మాత్రం ఇది నిజమే అంటున్నారు యూటీ సౌత్‌ వెస్ట్రర్న్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ మందు పేరు హైడ్రాలజీన్‌. కణాలకు తక్కువ కేలరీలు అందినట్టుగా భ్రమింప జేసే వ్యవస్థ ద్వారా ఈ మందు సీ–ఎలిగాన్స్‌ ఆయుష్షును 25 శాతం వరకూ పెంచిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ హమీద్‌ మిర్‌జాయి తెలిపారు. రెండు రకాల సూక్ష్మజీవులపై తాము ప్రయోగాలు జరిపామని, పసుపులోని కర్‌క్యుమిన్, మధుమేహ చికిత్సలకు వాడే మెట్‌ఫార్మిన్‌ కంటే మెరుగ్గా ఇది ఆయువు పెంపునకు కృషి చేస్తుందని ఆయన అన్నారు.

హైడ్రాలజీన్‌ను వాడుతున్నంత కాలం రౌండ్‌ వర్మ్‌లలో చురుకుదనం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. మన కణాల్లోని ఎన్‌ఆర్‌ఎఫ్‌2 అనే వ్యవస్థ శరీరానికి హాని చేసే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి రక్షణ కల్పిస్తూంటుందని, వయసు పెరిగే కొద్దీ ఈ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల అల్జైమర్స్, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు వస్తూంటాయని ఆయన వివరించారు. ఈ వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా హైడ్రాలజీన్‌ పనిచేస్తూందని.. మానవుల్లోనూ ఎస్‌కేఎన్‌–1 రూపంలో ఇలాంటి వ్యవస్థ ఉన్న కారణంగా తమ పరిశోధన ఆయా వ్యాధుల నివారణతోపాటు ఆయుష్షు పెంపునకూ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు