‘మగధీర’ దెబ్బకు చెయ్యి మడత పడింది!

5 Apr, 2014 22:44 IST|Sakshi

పావలా ఇస్తే బిందెలు మోసిన బాహుబలి...
 ఎన్నోసార్లు మృత్యువుని ముద్దాడి వచ్చిన మగధీర...
 ఆకలి చేసిన మరమ్మత్తులతో రాటుదేలిన రోబో...
 కష్టాల్ని కూడా ఇష్టంగా తీసుకునే డార్లింగ్...
 పీటర్ హెయిన్ గురించి ఇంకా ఏం చెప్పాలి?
 ప్రతి క్షణం ఓ పోరాటం.. ప్రతి మలుపు ఓ పోరాటంపాణాలకు తెగించి మృత్యువుతో పోరాడడమే పీటర్ జీవితం!
 ఫైట్‌మాస్టర్ అంటే తనను తక్కువ చేసినట్టే!
 అతని సాహసం... అంకితభావం... మనుషుల పట్ల ఆరాటం...
 ఇవన్నీ తెలుసుకుంటే...
 అతను ఓ పోరాటయోధుడని ఎవరైనా ఇట్టే ఒప్పుకుంటారు.
 ఊహించని మలుపులతో సాగుతున్న ఆ జీవితం వెంట పీటర్ హెయిన్ మాటల్లోనే పయనిద్దాం... రండి...

 
చెన్నయ్‌లోని వడపళనిలో మాదో చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లోనే అమ్మా, నాన్న, నానమ్మ, నేను, అక్క, చెల్లి... ఇంతమందిమి ఉండేవాళ్లం. మా నాన్న పేరు పెరుమాళ్. ఊరు తమిళనాడు. అమ్మది వియత్నామ్. నేను పుట్టి, పెరిగింది మాత్రం చెన్నయ్‌లోనే. రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున.. ఇలా స్టార్ హీరోల సినిమాలకు నాన్న ‘స్టంట్ మేన్’గా పనిచేసేవారు. షూటింగ్ ఉంటే డబ్బులొచ్చేవి. అది కూడా మా కుటుంబానికి సరిపడేంత వచ్చేవి కాదు. పైగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. అమ్మ బ్యూటీషియన్‌గా చేసేది. ఆమె నెల జీతం 300 రూపాయలు.
 
జీవితమే నా పాఠశాల!

చాలామందిలా నా బాల్యం పూలబాట కాదు. మంచి బట్టలుండేవి కాదు. ఆకలి బాధైతే ఎప్పుడూ ఉండేదే. ఒక్కోసారైతే నూకలతో చేసిన గంజి మాత్రమే తాగేవాళ్లం.  ఆదివారం వస్తే, రెండే రెండు గుడ్లు వండేవాళ్లు. తలా ఓ ముక్క తినేవాళ్లం. కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితుల్లో నన్ను బడికి ఎలా పంపించగలుగుతారు? అలా నాకు పదేళ్లు వచ్చేశాయ్. కానీ, జీవితమే నాకు బోలెడన్ని పాఠాలు నేర్పించింది. చదవడం, రాయడం అన్నీ నాకు నేనుగా నేర్చుకున్నాను. చదివించకపోయినా, ‘బతకడం ఎలాగో’ నేర్పించిన మా అమ్మా నాన్న నా దృష్టిలో దేవుళ్లు. చిన్నప్పుడు నాకేదో ఆపరేషన్ జరిగింది. మా ఇంటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి 8 కిలోమీటర్లు. అప్పట్లో బస్సు టిక్కెట్‌కయ్యే 60 పైసలు కూడా మా దగ్గరుండేవి కాదు. దాంతో, ఉదయాన్నే ఇంటి దగ్గర నీళ్లు తాగేసి, ఎనిమిది కిలోమీటర్లూ నడుచుకుంటూ వెళ్లి, చెకప్ చేయించుకుని వచ్చేవాణ్ణి.
 
పావలా కోసం బిందెడు నీళ్ళు మోసేవాణ్ణి!

మా ఇంటి పక్కన ఓ టీ షాప్ ఉండేది. ఒక రోజు ‘రెండు బిందెలు నీళ్లు తెచ్చిపెడతావా?’ అని అడిగాడు టీ కొట్టు యజమాని. అప్పుడు నా దగ్గర పావలా కూడా లేదు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఎవరెవరికి నీళ్లు కావాలో వాళ్ల దగ్గర బిందెకు పావలా చొప్పున తీసుకుని, నీళ్లు మోసుకెళ్లడం మొదలుపెట్టాను. సైకిల్ మీద నాలుగైదు బిందెలు పెట్టుకుని మెల్లిగా నెట్టుకుంటూ వెళ్లేవాణ్ణి. బతుకు తెరువు కోసం నీళ్లు మోయడంతో పాటు సర్వర్‌గా, మెకానిక్‌గా, వెల్డర్‌గా, టైలర్‌గా, వంట మనిషికి సాయం చేసే కుర్రాడిగా... ఇలా రకరకాల పనులతో బిజీగా ఉండేవాణ్ణి.
 
చైనీస్ లుక్కే వరమైంది!

మరోవైపు మా నాన్న దగ్గర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ మా నాన్నగారి స్టూడెంట్స్‌కి  ఫైట్స్ నేర్పించేవాణ్ణి. అదృష్టం కొద్దీ ఓ సినిమాకి చైనా వాడిలా కనిపించే స్టంట్ మేన్ కావాల్సి వస్తే, నన్ను తీసుకెళ్లారు. నేను చేసిన ఫైట్స్‌కి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో స్టంట్ మేన్‌గా యూనియన్‌లో సభ్యత్వ కార్డ్ తీసుకున్నాను. సినిమాల్లోకి వచ్చిన ఏడాదికే కనల్ కణ్ణన్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ ఫైట్ మాస్టర్‌గా పని చేయడం మొదలుపెట్టాను. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. ‘మురారి’తో ఫైట్ మాస్టర్‌నై, తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలెన్నో చేశా.
 
అంగ వికలాంగురాల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా!

 
సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాకు వేరే జీవితం ఉంటుందనే విషయాన్నే మర్చిపోయా. అప్పటికి షూటింగ్‌లో చాలాసార్లు ప్రమాదాలకు గురయ్యా. ఓ రోజు నాన్న నన్ను పిలిచి, ‘ఇప్పటికే చాలాసార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నావ్. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే నీకు నలభై వచ్చేటప్పటికి పిల్లలు చిన్నవాళ్లవుతారు. నీకు జరగకూడనిది ఏదైనా జరిగితే, వాళ్లేమవుతారు’ అన్నారు. దాంతో, పెళ్లి చేసుకోవడానికి ఓకే కానీ.. అంటూ ఓ కండిషన్ పెట్టా. అందంగా ఉన్న అమ్మాయిలనూ, డబ్బున్నవాళ్లనూ ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. అందుకే, అంగ వైకల్యం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ, మా నాన్న గారు నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. కనీసం పేదింటి అమ్మాయినైనా పెళ్లాడతా అని చెప్పా.
 
నన్ను కూడా ప్రేమిస్తారా?
 
ఈ ప్రపంచంలో అందంగా ఉన్నవాళ్లని ఓ రకంగా, నాలా అందవిహీనంగా ఉన్నవాళ్లని మరో రకంగా చూస్తారు. ఇక, నన్నెవరు ప్రేమిస్తారు? ‘కావ్య తలైవన్’ అనే తమిళ సినిమా కోసం స్టంట్ మేన్‌గా చేస్తున్నప్పుడు ఓ వ్యక్తితో పరిచయం అయింది. ఓ సారి మా ఇంటికి తీసుకెళితే, తనకో చెల్లెలుందని తెలిసి, మా అమ్మ ఆరా తీసింది. వాళ్లూ మా లాంటివాళ్లే. వాళ్ళ నాన్న భారతీయుడు. వృత్తి రీత్యా వియత్నామ్ వెళ్లినప్పుడు అక్కడి అమ్మాయిని ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నయ్‌లో స్థిరపడ్డారు. సాదాసీదా కుటుంబం. అందుకని వాళ్లతో సంబంధం కలుపుకుందామని అమ్మ అంటే, ఓకే అన్నా. వాళ్లు తమిళనాడులోని కారైక్కాల్‌లో ఉండేవాళ్లు. చెన్నయ్ నుంచి 390 కిలోమీటర్ల దూరం. నా ఫ్రెండ్‌ని తీసుకుని మోటార్‌బైక్‌లో ఆ ఊరెళ్లాను.
 
దేవుడు ఇద్దరు దేవతలనిచ్చాడు!
 
అప్పటికి తెల్లవారుజామున ఐదున్నర గంటలైంది. చిన్న గుడిసెలో నుంచి ఆ అమ్మాయి బయటికొచ్చి వాకిలి ఊడ్చి, అందంగా ముగ్గులేసింది. ఇంటిని సరిగ్గా చూసుకోగలదనే నమ్మకం కుదిరి, జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నా. ఆమె పేరు పార్వతి. చాలా మంచిది. ఆ దేవుడు నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇద్దరు దేవతలను ఈ భూలోకానికి పంపించాడేమో. ఒకరు మా అమ్మ.. మరొకరు నా శ్రీమతి. నా భార్యకు నేను తాజ్‌మహల్ కట్టించకపోయినా ఫర్వాలేదు.. నాలా ఆస్పత్రికి నడిచి వెళ్లే స్థితి మాత్రం తనకు, మా పిల్లలకు రాకూడదని, ఆర్థికంగా నేనో స్థాయికి వచ్చాకే పెళ్లి చేసుకున్నా.
 
జాకీచాన్ వీరాభిమానిని!
 
యాక్షన్ సన్నివేశాలను జాకీచాన్ చేసే తీరు నాకు చాలా ఇష్టం. ఓ రకంగా నేను ఆయనకు వీరాభిమానిననొచ్చు. కానీ ఆయనను అనుకరించడానికి యత్నించను. నేను ఆదర్శంగా తీసుకునేది కరాటే వీరుడు బ్రూస్‌లీనే. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. బ్రూస్‌లీ ఫైట్స్ చూసి చాలా నేర్చుకున్నా.
 
బాత్రూమ్‌లో తనివి తీరి ఏడ్చా!
 
శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా రూపొందిన ‘ముదల్‌వన్’ (తెలుగులో ‘ఒకే ఒక్కడు’) సినిమాకి నేను స్టంట్ మేన్‌ని. అప్పటికి నాకు పెళ్లయి ఓ రెండేళ్లు అవుతుందేమో! ఆ సినిమా కోసం ఒంటి మీద నూలు పోగు లేకుండా వీపుకు జెల్ రాసుకుని, పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని పై నుంచి కిందకు దూకే సీన్ తీయాలి. చాలా రిస్క్. ధైర్యం చేశాను. తీశాం కానీ, తృప్తికరంగా అనిపించలేదు. ‘మళ్లీ తీద్దాం సార్’ అని శంకర్ గారితో, ఫైట్‌మాస్టర్ కనల్ కణ్ణన్‌గారితో అన్నా. రిస్క్ కాబట్టి, ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. నాకు కూడూ గుడ్డా ఇచ్చిన వృత్తికి న్యాయం చేయాలంటే మళ్లీ తీయాల్సిందేనని పట్టుబట్టా. మర్నాడు తెల్లవారుజామున 2 గంటలకు ఆ సీన్ ప్లాన్ చేశాం. తీరా ముందు రోజు రాత్రి 12 గంటలకు ఇంటికెళ్లాను. నా భార్యను చూస్తే ఏడుపు ఆగలేదు. కానీ, తన ముందు ఏడిస్తే, కంగారుపడుతుందని దిగమింగుకున్నా. కాఫీ కావాలనడిగి, తను అటెళ్లగానే మా ఆరు నెలల బాబును గుండెలకు హత్తుకున్నా. బాత్రూమ్‌లోకెళ్లి, షవర్ ఓపెన్ చేసుకుని, తనివి తీరా ఏడ్చా. బయటికొచ్చిన తర్వాత నా కళ్లు చూసి, ‘ఏంట’ని నా భార్య అడిగితే, సబ్బు నురుగ పడిందన్నాను.
 
ఇంట్లోనే హెల్మెట్ పెట్టుకున్నా!
 
అర్ధరాత్రి రెండింటికి షూటింగైతే, ఇంట్లో ఉన్న ఆ రెండు గంటలూ నా మనసు మనసులో లేదు. రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికొస్తుంటే ఏడుపొచ్చేసింది. అది కనిపించకూడదని ఇంట్లోనే హెల్మెట్ పెట్టేసుకున్నా. మా ఆవిడ విచిత్రంగా చూసింది. బయటకు అడుగుపెట్టేటప్పుడు, ‘దేవుడా... నేను బతికితే ఓకే. ఒకవేళ ఏదైనా జరిగితే నా భార్యను, బిడ్డను నా అంతగా ప్రేమించే ఓ తోడునివ్వు. నేనిప్పటివరకు అన్నీ మంచి పనులే చేశాను కాబట్టి, స్వర్గానికి పంపించు. పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత నా భార్యను నా వద్దకు పంపించు’ అని వేడుకున్నాను. లొకేషన్‌కి వెళ్లిన తర్వాత నా భార్యకు ఫోన్ చేసి, ‘షూటింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళతా. అక్కడికెళ్లిన తర్వాత కాల్ చేస్తా. లేకపోతే నా నుంచి కాల్ రాదు. నువ్వే చెయ్యాలి’ అని చెప్పా. దానర్థం నాకు మాత్రమే తెలుసు.
 
ఇక ప్రాణాలకు తెగించకూడదనుకున్నా!
 
షూటింగ్‌కి రెడీ అయి... గుండె దిటవు చేసుకుని మేడ పెకైక్కా. ఒంటి మీద బట్టలు తీసి, వీపుకు జెల్ రాయించుకుని, పెట్రోల్ పొయ్యమన్నాను. నిప్పంటించగానే కిందకు ఒక బాక్సులోకి దూకాలన్నమాట. దూకాను... ఆ పెట్టెలో నుంచి నన్ను తీసి, మంటలార్పడానికి బెడ్‌షీట్‌తో నా వీపు మీద రుద్దారు. దాంతో చర్మం ఊడొచ్చింది. కానీ, బతికాం కదా అని సంబరపడిపోయా. ఆ తరువాత పాన్‌కేక్‌తో వీపు మీద మేకప్ చేశాక, మరో షాట్ కోసం అలాగే మంటలతో కిందే పరిగెత్తా. ఏదైనా రిస్కే కదా! అయినా చేశా. ఆ రోజుకు నా పారితోషికం ఎంతో తెలుసా? మూడు వేలు. అందులో కొంత యూనియన్‌కి వెళ్లిపోతుంది. ఏమైనా.. ప్రాణాలను పణంగా పెట్టకూడదనీ, లేనిపోని వాగ్దానాలు చేయకూడదనీ ఆ రోజు నిర్ణయించుకున్నా.
 
‘మగధీర’ దెబ్బకు చెయ్యి మడతపడిపోయింది!

 
ఇలా మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన సంఘటనలు ఇంకా ఉన్నాయి. ‘మగధీర’లో బైక్‌తో పోటీ సన్నివేశం తీసేటప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ తప్పడంతో పడ్డాను. గడ్డం దగ్గర బాగా దెబ్బ తగిలింది. చెయ్యి వెనక్కి మడతపడిపోయింది. ఎముక అటూ ఇటూ అవడంతో చెయ్యి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తే, వెనక్కి వెళ్లేది. ఆస్పత్రికి వెళ్లేవరకు నా మనసు మనసులో లేదు. అంతకుముందు రెండు, మూడుసార్లు వెన్నెముకకు దెబ్బ తగిలింది. దాంతో ఆస్పత్రికి వెళ్లగానే, ‘నా వెన్నెముక బాగానే ఉంది కదా. ముందు అది చూడండి. ఆ తర్వాత చికిత్స చేయొచ్చు’ అన్నా. డాక్టర్లు స్కానింగ్ తీసి, బాగానే ఉందన్నాక, ఊపిరి పీల్చుకున్నాను.
 
స్నానం చేస్తుంటే పక్షవాతంతో కుప్పకూలా!

 
పెద్ద పెద్ద ప్రమాదాలు ఎన్ని జరిగినా వెనకడుగు వేయలేదు. ఒకసారైతే ఓ షూటింగ్‌లో దెబ్బ తగిలింది. నేనేం పట్టించుకోలేదు. ఇంటికి రాగానే స్నానం చేద్దామని, షవర్ కింద నిలబడ్డా. తల మీద నీళ్లు పడగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయా. ఒక కాలు, చెయ్యి పని చేయలేదు. పక్షవాతం వచ్చింది. మరో కాలితో శరీరాన్ని ఈడ్చుకుంటూ ఎలాగోలా బయటికొచ్చాను. డాక్టర్లు లాభం లేదన్నారు. అన్నం తినిపించడం, స్నానం చేయించడం అంతా మా ఆవిడే. ఇక జీవితం అంతేనేమో అనుకున్నా. రెండు, మూడుసార్లు నడవడానికి ప్రయత్నించి, కిందపడేసరికి పళ్లు ఊడాయి. అలా 18 రోజులు విశ్వప్రయత్నాలు చేశాక కానీ,  కాలూ చెయ్యి స్వాధీనంలోకి రాలేదు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. దేవుడే నన్ను కాపాడాడనుకున్నా.
 
నేనంతే.. అదో టైప్!

 
ఇవాళ కొంతమంది దర్శకుల కన్నా నా పారితోషికం ఎక్కువే. అంత మాత్రాన నా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయనుకుంటే పొరపాటే. పావలా కోసం పని చేసినవాణ్ణి. చెత్త నుంచి పైకొచ్చినవాణ్ణి. ఇవాళ చేతిలో రూపాయి లేకపోయినా బతకగలను. నాదో చిత్రమైన శైలి. ఒక్కోసారి 30 రూపాయల భోజనం తింటా. కొన్నిసార్లు అందుకు భిన్నంగా విమానంలో వియత్నామ్ వెళ్లిపోయి, భోజనం కోసం రెండు, మూడు లక్షలు ఖర్చు చేస్తా. కంపోజ్ చేసే ఫైట్స్‌లానే నేనూ కొత్తగా, విచిత్రంగా కనిపించాలనుకుంటా. అందుకే, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటుంటా. ఒకసారి రింగుల జుట్టు, మరోసారి పొడవాటి జుట్టు... ఇలా స్టయిల్ మార్చేస్తుంటా.
 
సంపాదనలో పావు భాగం వృద్ధులకు, పిల్లలకు..!
 
ఇవాళ నేనో లక్ష రూపాయలు సంపాదిస్తే, అందులో పావు వంతు వృద్ధాశ్రమాలకూ, అనాథాశ్రమాలకూ ఇచ్చేస్తా. వృద్ధాశ్రమానికి ఇవ్వడానికి కారణం మా నాన్నమ్మ. నాకు పదమూడేళ్లప్పుడు ఆమె  చనిపోయింది. మూడేళ్లు పక్షవాతంతో బాధపడింది. తనకు స్నానం చేయించేవాణ్ణి. అన్నం తినిపించేవాణ్ణి. నాన్నమ్మ పక్కన ఎవరో ఒకళ్లు ఉంటే మంచిదనిపించి, ఆ మూడేళ్లు నేను పెద్దగా బయటకు వెళ్లేవాణ్ణి కాదు. మా అమ్మా నాన్నల కన్నా నాకు నాన్నమ్మే ఎక్కువ. తనలాంటివాళ్లు వృద్ధాశ్రమాల్లో ఉంటారు కాబట్టే, విరాళం ఇస్తుంటాను. అలాగే, చిన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డప్పటికీ, అమ్మానాన్న, అక్కాచెల్లెళ్ల ప్రేమ నాకు లభించింది. ఇక, వాళ్లు కూడా లేనివాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో? అందుకే అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తుంటా. లక్ష సంపాదించినప్పుడు నా అవసరాలకు 80 వేలు కావాలనుకోండి.. అప్పుడు కూడా 75 వేలే ఉంచుకుని, 25 వేలు ఆశ్రమాలకు ఇచ్చేస్తా. తదుపరి పారితోషికంలో ఆ 5 వేలు తీసుకుంటా.     
 
ఇవాళ అందరూ నన్ను ‘స్టార్ ఫైట్ మాస్టర్’ అని అంటూ ఉంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా నాన్న గారు నా కన్నా గొప్ప. నేనీ స్థాయిలో ఫైట్స్ చేస్తున్నానంటే, నాకు శిక్షణనిచ్చిన మా నాన్న ఏ స్థాయిలో చేసి ఉండేవారో ఊహించవచ్చు. మంచి అవకాశాలొచ్చాయి కాబట్టి నేను నిలదొక్కుకున్నా. ఇలాంటి అవకాశాలు వచ్చి ఉంటే మా నాన్న గారు ‘తిరుగులేని ఫైట్ మాస్టర్’ అనిపించుకుని ఉండేవారు.  
 
మా పిల్లలు ఫైట్స్ మానేయమంటారు!

 
నాకు ఓ బాబు, పాప. ప్రస్తుతం బాబు ప్లస్ టూ, పాప ఆరో తరగతి చదువుతున్నారు. సినిమాలు, కుటుంబం మినహా నాకు మరో యావ లేదు. నాది రిస్కీ లైఫ్. ఏ క్షణాన ఏం జరుగుతుందో నాకే తెలియదు కాబట్టి, నా పేరు మీద ఆస్తులు కూడా ఉంచుకోను. అన్నీ నా భార్య పేరు మీదే పెట్టేశా. షూటింగ్‌లో నాకు బాగా దెబ్బలు తగిలినప్పుడు నా భార్య, పిల్లలు నన్ను తాకడానికి కూడా చాలా భయపడతారు. నాకు నొప్పి కలుగుతుందేమోనని వారి భయం. కానీ, ఆ సమయంలో వాళ్లు ముగ్గురూ నా బుగ్గ మీద ఇచ్చే ముద్దు... కాసేపు నా నొప్పిని మాయం చేసేస్తుంది. అందుకే అంటాను... ముద్దు విలువ నొప్పి కన్నా ఎక్కువ అని!

 ‘మా డాడీ గొప్ప ఫైట్‌మాస్టర్’ అని మా పిల్లలు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ, షూటింగ్‌లో నాకయ్యే గాయాలు చూసి, పిల్లలు ‘డాడీ.. ఫైట్స్ మానేయవా..’ అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు.  మా అబ్బాయి పెద్దయిన తర్వాత ఫైట్ మాస్టర్‌గా చేస్తానంటే నేనొప్పుకోను. వాస్తవానికి యాక్షన్ అనేది నాకు తగిన వృత్తి కాదు. బతకడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఈ రంగంలోకి వచ్చాను. కానీ, నా బిడ్డలకు ఆ అవసరం లేదు. వాళ్లకి నేను మంచి జీవితమిచ్చా. (ఒకింత ఉద్వేగానికి గురవుతూ.....) నేను ఎన్ని కష్టాలైనా అనుభవించగలను కానీ, నా బిడ్డల కష్టాలు చూసి, తట్టుకునేంత ఆత్మస్థయిర్యం మాత్రం నాకు లేదు.
 - డి.జి. భవాని
 
మేమూ మనుషులమే!

ఫైటర్లూ మనుషులే అని కొంతమంది దర్శక, నిర్మాతలు అనుకోరు. ప్రమాదభరితమైన ఫైట్లను హీరోలకు బదులుగా ఫెటర్లే చేస్తుంటారు. అలాంటి సమయంలో ఫైటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా దర్శక, నిర్మాతలు సమయం ఇవ్వరు. స్టార్లకేమో మామూలుగా కూడా ఎలాంటి నిబంధనలూ ఉండవు. వాళ్లు మేకప్ చేసుకునేవరకు ఆగుతారు. కాఫీలు, టీలు తాగడానికి కోరినంత టైమ్ ఇస్తారు. కానీ, ఒక జీవితం క్షేమంగా ఉండటం కోసం మాకు మాత్రం టైమ్ ఇవ్వరు. నాకిలాంటివి బోలెడన్ని ఎదురయ్యాయి. అందుకే, నా అసిస్టెంట్ల విషయంలో అలా జరగకుండా చూసుకుంటా. ఎంత సమయమైనా సరే జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే షాట్ తీద్దామని చెబుతా.
 
ఆ 24 గంటలు నేనెవరో నాకే తెలియదు!

 
నేను స్టంట్ మేన్‌గా చేస్తున్న రోజులవి. ఓ షూటింగ్‌లో వేగంగా వెళుతున్న కారులో నుంచి అమాంతంగా దూకాలి. కానీ, నేను దూకిన చోట రాయి ఉండటంతో అది నా తలకు తగిలింది. అయితే పెద్దగా నొప్పి లేకపోవడంతో పట్టించుకోలేదు. కాసేపు బాగానే ఉన్నాను. కానీ, ఆ తర్వాత యూనిట్ సభ్యులతో ‘నేనెక్కడున్నాను’ అని అడగడంతో షాకయ్యారట. నా బైక్ దగ్గరే నిలబడి ‘నా బండి ఎక్కడుంది?’ అని అడగడంతో ఏదో తేడా జరిగిందని గ్రహించారట. ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి అడ్రసడిగితే.. ఏవేవో పేర్లు చెప్పానట. ఇంటికెళ్లిన తర్వాత కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడటంతో అమ్మకు భయమేసి హాస్పటల్‌కి తీసుకెళ్లిందట. అప్పుడు మెదడులో ఓ చోట రక్తం గడ్డ కట్టుకుపోయిందని చెప్పి, డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత నేను మామూలు మనిషిని అయ్యానని అమ్మ చెప్పింది. ఆ 24 గంటలు నేనెవరో నాకే తెలియదు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా