పక్షవాతాన్ని ఎలా తగ్గించవచ్చు?

28 Oct, 2013 23:58 IST|Sakshi
పక్షవాతాన్ని ఎలా తగ్గించవచ్చు?

మా నాన్నగారి వయసు 73 ఏళ్లు. గత ఆరునెలలుగా పక్షవాతంతో (కుడివైపున) బాధపడుతున్నారు. మాట కూడా అస్పష్టంగానే ఉంది. డాక్టర్లు ఫిజియోథెరపీ చేయమని సలహా ఇచ్చారు. దీనికి ఆయుర్వేద చికిత్స తెలియజేయగలరు. నా వయసు 51 సంవత్సరాలు. ఇది వారసత్వంగా వస్తుందా? నివారణ మార్గాలను కూడా తెలియజేయండి.
 - ఐ. కిశోర్‌కుమార్, బెంగళూరు

 
అందరూ పక్షవాతంగా వ్యవహరించే ఈ వ్యాధిని ఆయుర్వేదంలో ‘పక్షాఘాతం’ లేదా ‘పక్షవధ’ అనే పేర్లతో వర్ణించారు. ఆయుర్వేద సూత్రాలైన వాత, పిత్త, కఫాలలో... ఇది వాత ప్రధానమైన వ్యాధి కనుకనే వ్యావహారికంగా పక్షవాతం అంటారు. మొత్తం శరీర భాగాల్ని కుడి, ఎడమలుగా మనం విభజిస్తుంటాం. అవే వామపక్షం, దక్షిణపక్షం. ‘ఘాత, ఆఘాత, వధ’ శబ్దాలకు దారుణంగా కొట్టటం, చచ్చుబడటం లనే అర్థాలున్నాయి. సాధారణంగా ఈ వ్యాధి శరీరంలో ఒక పక్షానికి వస్తుంది కాబట్టి పక్షాఘాతం లేదా పక్షవధం అనే జబ్బుగా గుర్తించారు.

ఇదే ఒక్క అంగానికి (కాలు లేక చెయ్యి) వస్తే ఏకాంగవాతమని, మొత్తం శరీరానికి వస్తే సర్వాంగవాతమనీ పేర్లు మారుతుంటాయి. వాతప్రకోపకర అంశాలను కట్టడి చేయకపోతే ఈ వ్యాధి కలుగుతుంది. అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు, శక్తికి మించిన శ్రమ, ప్రమాదవశాత్తు దెబ్బలు తగలటం, క్షమత్వం తగ్గి శరీరం శుష్కించిపోవటం, మితిమీరిన ఉపవాసాలు, స్థౌల్యరోగం, ధూమపాన, మద్యపానాల వంటి మాదకద్రవ్యసేవన, అధిక మానసిక ఒత్తిడి మొదలగునవన్నీ వాత ప్రకోపకారకాలు.

కాబట్టి, వాటిపై నియంత్రణ కావాలని గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు వారసత్వం కూడా కారణంగా కన్పించినా, పైన చెప్పిన కారణాలు; ఆహారవిహారాలపై అవగాహన పెంచుకొని, క్రమశిక్షణ పాటిస్తే ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. అంటే మెదడుకు సంబంధించి రక్తనాళాలు, నాడీకణాలకు సంబంధించిన రుగ్మతలు, ప్రమాదాలు రాకుండా ఉంటాయి.
 
ఆహారం: తీపి, ఉప్పు, పులుపు తగినంత ప్రమాణంలోనే సేవించాలి. ప్రత్యేకమైన నూనె వంటకాలు, ఊరగాయలు, అధికంగా ఉప్పు సేవించడం వంటివి పూర్తిగా మానేయాలి. ద్రవాహారం బాగా తీసుకోవాలి. పోషక విలువలుండే సహజంగా లభించే ఆహార సేవనం ఆరోగ్యకరం. సమీకృత, మితాహారం అలవాటు చేసుకోవాలి. ఆవుపాలు, ఆవునెయ్యి, నువ్వుల నూనె తగు ప్రమాణాలలో సేవిస్తే ఈ వ్యాధి దూరమవుతుంది.
 
 విహారం: వయసుకు, వృత్తికి అనుగుణంగా పరిమితమైన వ్యాయామం (నడక, ఆటలు, యోగాసనాలు మొదలగునవి) చిన్నప్పట్నుంచి పాటిస్తూ జీవితాంతం సాధన చేయడం మంచిది. ప్రాణాయామం అత్యంత ప్రయోజనకరం.
 
 ఔషధాలు :  బృహత్‌వాత చింతామణిరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 చొప్పున పదిహేను రోజులు మాత్రమే వాడాలి.
 
 మహావాతవిధ్వంసినీరస, వాతరాక్షస, వాతగజాంకుశ, వాతకులాంతకరస (మాత్రలు) వంటి మందులలో ఏది ఎంత మోతాదులో ఎంతకాలం అవసరమో ఆయుర్వేద నిపుణులు నిర్ణయిస్తారు.  
 
 మహారాస్నాది, దశమూల కషాయాలు ఉపయోగకరం.  
 
 అశ్వగంధ, బలా, శతావరీ చూర్ణాలు కూడా లాభదాయకం.
 
 బాహ్యచికిత్స  
 తైలమర్దనం: ‘బలా, ధన్వంతరి, మహామాష, క్షీరబలాతైల’ వంటి వాటిలో దేనితోనైనా ఈ మసాజ్ చేస్తారు.  
 
 స్వేదకర్మ: వ్యాధిగ్రస్తమైన భాగాలకు మసాజ్ చేసిన పిదప, ప్రత్యేక ఔషధ పదార్థాలను వేడిచేసి, వాటితో స్వేదకర్మ (చెమట పట్టించే ప్రక్రియ) చేస్తారు.
 
 వ్యాయామం: కొంత విరామం తర్వాత, ప్రత్యేకమైన ఫిజియోథెరపీలు చేయిస్తారు.
 
 పంచకర్మలు
 వస్తికర్మ: కొన్ని తైలాలను లేదా కషాయాలను మలమార్గం ద్వారా లోనికి ప్రవేశపెట్టే ప్రత్యేక సాంకేతిక ప్రక్రియే ఈ ‘వస్తికర్మ’. వ్యాధి స్వభావాన్ని బట్టి శిరస్సుపై చేస్తే దానిని శిరోవస్తి అంటారు. అలాగే ధారాచికిత్స, సస్యకర్మలను కూడా ఆయుర్వేదంలో వివరించారు.
 
 గమనిక: ఈ ప్రక్రియలన్నీ... వ్యాధి చికిత్సకు గాను ఒక పద్ధతిలోనూ, రోగాన్ని నివారించి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఇంకొక తీరులోనూ ఔషధాలను మారుస్తూ చెయ్యవలసి ఉంటుంది. కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే ఇవి జరగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలోని నిపుణుని సంప్రదించండి.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

 
 

మరిన్ని వార్తలు