నాలుగు ఫిర్యాదులు

18 Jan, 2019 01:32 IST|Sakshi

చెట్టు నీడ

ఖలీఫా ఉమర్‌ (రజి) పరిపాలనా కాలమది. అరబ్బు సామ్రాజ్యంలోని ఒక ప్రాంతానికి సయీద్‌ ఆమిర్‌ను గవర్నర్‌గా నియమించారాయన. కొన్ని నెలల తరువాత గవర్నర్ల పాలనా తీరును పరిశీలించే క్రమంలో ఖలీఫా ఉమర్‌ (రజి) సయీద్‌ ఆమిర్‌ (రజి) ప్రాంతానికి వెళ్లారు. ఖలీఫా తనిఖీ చేయడానికి వచ్చారని తెలిసి ప్రజలంతా మస్జిదులో హాజరయ్యారు. ఖలీఫా... పక్కనే ఉన్న గవర్నర్‌ సయీద్‌ బిన్‌ ఆమిర్‌ గురించి ఏమైనా ఫిర్యాదులున్నాయా? అని ప్రజలనుద్దేశించి అడిగారు. కొంతమంది కలగజేసుకుని గవర్నర్‌ గురించి నాలుగు ఫిర్యాదులు చేశారు. ‘‘గవర్నర్‌ గారు ఫజర్‌ నమాజు తరువాత కలవరు’’ అన్న ఫిర్యాదుకు సంజాయిషీ ఇవ్వమని కోరారు. అందుకు సయీద్‌ బిన్‌ ఆమిర్‌ ‘‘అయ్యా, మా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతోంది.

ఇంటి పనులన్నీ నేనే స్వయంగా చేయాలి. ఉదయాన్నే నమాజు తరువాత ఇల్లు ఊడ్చి, అంట్లు కడిగి, రొట్టెల పిండి కలిపి రొట్టెలు చేస్తున్నాను. మంచానికే పరిమితమైన నా భార్య అవసరాలు తీరుస్తున్నాను. బట్టలు ఉతుకుతున్నాను. ఇంటిపనులన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ వేళలో ప్రజలకోసం సమయం కేటాయించలేకపోతున్నాను. నౌకరును పెట్టుకునేంత స్థోమత నాకు లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘వారంలో ఒకరోజు ప్రజలను కలవరు’ అన్నది మరో ఫిర్యాదు. దానికి సయీద్‌ బిన్‌ ఆమిర్‌ ‘‘ఈ విషయం నేనెంతో రహస్యంగా ఉంచదలుచుకున్నాను. ప్రజలు మీముందు ఫిర్యాదు చేశారు కాబట్టి చెప్పక తప్పడం లేదు. నాకున్నది ఒకే ఒక్క జత బట్టలు.

వాటిని వారానికోసారి ఉతికి ఆరేస్తాను. అవి ఆరేదాకా నా భార్య బట్టలు తొడుక్కుంటాను. అందుకే వారంలో ఒకరోజు బయటికి రాను’ అని చెప్పారు. ‘నువ్వు రాత్రుళ్లు ఎవ్వరినీ కలవవు’ అన్నది మూడో ఫిర్యాదు. ‘‘నా తల వెంట్రుకలు, గెడ్డం అన్నీ నెరసిపోయాయి. ప్రభువు పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు. నా పాపాల చిట్టా చాంతాడంత ఉంది. పగలంతా ప్రజాసేవలో గడపడం మూలాన దైవారాధనకు తీరిక దొరకడం లేదు కాబట్టి రాత్రుళ్లు అల్లాహ్‌ ఆరాధనలో లీనమవుతాను’ అని చెప్పాడు. ‘ఒక్కోసారి స్పృహతప్పి పడిపోతాడు’ అన్నది నాలుగో ఫిర్యాదు‘నేను నలభై ఏళ్ల వయస్సులో కలిమా చదివి విశ్వాసినయ్యాను.

నలభై ఏళ్ల వరకూ నేను చేసిన పాపాలు గుర్తుకొచ్చినప్పుడల్లా స్పృహ తప్పిపడిపోతున్నాను. ప్రళయం రోజు నా పాపాల గురించి అల్లాహ్‌ నిలదీస్తే నేనేం జవాబు చెప్పాలన్నదే నా భయమంతా. నాకోసం ప్రార్థించండి’’ అని అన్నాడు. అలాగే, ‘ఖలీఫా గారూ ఈ నాలుగు ఫిర్యాదులకు మీరేం శిక్ష వేసినా నేను భరించేందుకు సిద్ధమే’ అని చెప్పాడు. ‘‘ఓ అల్లాహ్‌ ఇలాంటి మరింతమంది గవర్నర్లను నాకివ్వు’’ అంటూ రోదిస్తూ ఖలీఫా ఉమర్‌ తన రెండు చేతుల్ని పైకెత్తి అల్లాహ్‌ను వేడుకున్నారు.
–  ముహమ్మద్‌ ముజాహిద్‌ 

మరిన్ని వార్తలు