వణికిస్తున్న రాకాసి మిడతలు

26 May, 2020 06:37 IST|Sakshi

ఐదు రాష్ట్రాల్లో రైతులు గజగజ

డ్రోన్లతో పురుగుమందు పిచికారీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

రాకాసి మిడతలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్‌ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజా»Œ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా పంటలను నమిలేస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోనే 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం రాకాసి మిడతల దండు దాడికి గురైనట్లు అంచనా. రాజస్థాన్‌లోనే 5 లక్షల హెక్టార్లలో పంటలను మిడతలు స్వాహా చేస్తున్నాయి. ముందుకు విస్తరిస్తున్నాయి.

ఈ రాష్ట్రాలకు మిడతల తాకిడి కొత్తేమీ కాదు. అయితే, ఈ ఏడాది సాధారణంగా కన్నా కొన్ని వారాలు ముందుగానే విరుచుకుపడటంతో చేతికి వచ్చే దశలో రబీ పంటలు ధ్వంసమయ్యాయి. గత 27 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ బెడద ఇప్పుడు ముంచుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పళ్లాలు, ఇతర పాత్రలు, డబ్బాలను మోగించడం, పెద్దగా శబ్దాలు చేస్తూ మిడతల దండును పారదోలి పొలాల్లోని పంటలను కాపాడుకోవాల్సిందిగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ట్రాక్టర్‌ స్ప్రేయర్లతో, అగ్నిమాపక యంత్రాలతో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నాయి. అయితే, 2.5–3 కిలోమీటర్ల పొడవైన కోట్లాది మిడతల గుంపు పంటల మీద దాడి చేస్తున్నందున డ్రోన్లను రంగంలోకి దింపడం అవసరమని కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలోని ఫరీదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ క్వారంటైన్‌ అండ్‌ స్టోరేజ్‌ డైరెక్టరేట్‌కు మిడతల దండు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

దేశంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం చట్టవిరుద్ధం. అయితే, మిడతల విపత్తును ఎదుర్కొనేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మిడతలు పగటి పూట ప్రయాణం చేసి రాత్రి పూట చెట్లు చేమలు పంటలపై వాలుతాయి. ఆ సమయంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు.

మన దేశంలోకి సాధారణంగా పాకిస్తాన్‌ మీదుగా మిడతల దండు దాడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం తీవ్రత చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో రెండో వైపు నుంచి కూడా మిడతల ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి హిందూమహా సముద్రం మీదుగా నేరుగా భారత ద్వీపకల్పంలోని తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఇతర రాష్ట్రాలపైనా మిడతల దండు దాడికి దిగవచ్చని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. జూలైలోగా భారత్‌ వైపు మరిన్ని మిడతల గుంపులు కదిలి వచ్చే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ సూచిస్తోంది.

మరిన్ని వార్తలు