ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై

18 May, 2019 00:30 IST|Sakshi

తెల్లవారు జామున ఒక చెట్టు కొమ్మల మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. మరో చెట్టు తొర్రలో నుంచి పాలపిల్ల కువకువలాడుతోంది. సూర్యుడు నేలను చూడడానికి చెట్ల ఆకుల మధ్య నుంచి దారులు వెతుక్కుంటున్నాడు! ఇదేమీ చీమలు దూరని చిట్టడవి వర్ణన కాదు, కాకులు దూరని కారడవి వర్ణన కూడా కాదు. ఒక ప్రొఫెసర్‌ విశ్రాంత జీవనం గడుపుతున్న ప్రదేశం. ఏళ్లుగా కరెంటే లేని నివాసం.

మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉంది బుధవారపేట. పెద్ద వ్యాపార కేంద్రం అది. ముఖ్యంగా ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ మార్కెట్‌కు ప్రసిద్ధి బుధవారపేట. ఆ బుధవారపేటలోనే ఉంది కరెంట్‌ లేని ఓ ఇల్లు. అది ఇల్లంటే ఇల్లు కాదు తోటంటే తోటా కాదు. చిన్న అడవిని తలపించే ప్రదేశం. అందులో ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఓ కట్టడం. అందులో ఒంటరిగా నివసించే ప్రొఫెసర్‌ పేరు డాక్టర్‌ హేమా సనే. బాటనీ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారామె. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే హేమ కరెంట్‌ దీపాలు వెలిగిస్తే పక్షులకు అసౌకర్యం కలుగుతుందని కరెంట్‌ లేకుండానే జీవిస్తున్నారు. ఇప్పుడామెకి 79 ఏళ్లు. ‘‘కరెంట్‌ లేని రోజులను చూశాను, అప్పుడు కూడా హాయిగానే జీవించాను. ఇప్పుడూ అంతే. కరెంట్‌ సౌకర్యం కోసం పక్షులను ఇబ్బంది పెట్టలేను’’ అంటారామె.

ఏది నాది?
‘‘తిండి, దుస్తులు, నీడ మాత్రమే మనిషికి కనీసవసరాలు. ఇక ఇతర అవసరాలేవీ తప్పని సరి కానే కాదు. నాకు ఈ మూడు కనీస అవసరాలు తీరుతున్నాయి. కరెంట్‌ లేని కారణంగా నాకు ఎదురవుతున్న అసౌకర్యం ఏమీ లేదు. నిద్రలేచేటప్పటికి పక్షుల కిలకిలరవాలు వినిపించకపోతే అసౌకర్యానికి లోనవుతాను తప్ప కరెంటు లేనందుకు కాదు. ఈ ప్రదేశాన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందనే సలహాలు నాకు చాలా మందే ఇచ్చారు. ఈ నేల నా ఆస్థి కాదు. ఇక్కడ నాకు తోడుగా ఓ కుక్క, రెండు పిల్లులున్నాయి. వాటికి తోడు ఓ ముంగిస కూడా ఉంది. ఎన్నో రకాల చెట్లున్నాయి. ఆ చెట్ల మీద లెక్కలేనన్ని పక్షులున్నాయి.

వాటన్నింటి ఆస్తి ఇది. నేను వాటి బాధ్యత చూసుకునే సంరక్షకురాలిని మాత్రమే. ప్రకృతి భూమిని ఏర్పరచింది పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ జీవించడానికే తప్ప మనిషి విపరీతమైన ఆకాంక్షల కోసం ఛిన్నాభిన్నం చేయడానికి కాదు. నన్ను చాలా మంది ఫూల్‌ అంటుంటారు కూడా. వాళ్లలా అన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను. ఎవరికీ హాని కలిగించని రీతిలో జీవిస్తున్నాను కాబట్టి ఎవరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’’ అంటారు హేమ నిష్కర్షగా.

నిత్యాన్వేషణ
నడుము వంగిపోయిన వయసులో ఆమె రోజూ తన అడవిలాంటి తోటంతా తిరుగుతారు. ఆమె సామిత్రీఫూలే పూనె యూనివర్సిటీ నుంచి బాటనీలో పీహెచ్‌డీ చేశారు. పూనెలోని గర్వారే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు.  వృక్షశాస్త్రం– పర్యావరణం అంశం మీద ఆమె రాసిన అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. తన ఒంటరి జీవితాన్ని వృక్షశాస్త్ర అధ్యయనానికే అంకితం చేసిన హేమ ఇప్పటికీ కొత్త పరిశీలనలను గ్రంథస్థం చేస్తున్నారు.

ఆ తోట మొత్తంలో ఆమెకు పేరు తెలియని పక్షి కానీ, చెట్టు కానీ లేవు. ప్రతి మొక్క, చెట్టు సైంటిఫిక్‌ నేమ్‌తో దాని లక్షణాలను వివరిస్తారు. ఇలాంటి విలక్షమైన జీవనశైలి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశమూ ఇవ్వడం లేదని కూడా అంటారు డాక్టర్‌ హేమాసనే. అయితే అలా అడిగిన వాళ్లకు... ‘నీ జీవితంలో నీవు నడవాల్సిన దారిని నువ్వే అన్వేషించుకో’ అనే బుద్ధుని సూక్తిని ఉదహరిస్తారామె. 
– మంజీర

మరిన్ని వార్తలు