పుష్కరిణి..పుష్పవనం

24 Nov, 2019 04:52 IST|Sakshi

ఆలయం ఆగమం

ఆలయంలో లేక దాని సమీపంలో ఈశాన్యభాగంలో పుష్కరిణి ఉండటం మనం చాలా ఆలయాల్లో చూడొచ్చు. అలాగే కొన్ని ఆలయాల్లో గుండం, నీటిచెలమ, బావి మొదలైనవాటిని కూడా చూసి ఉంటాం. వీటిని పవిత్రమైన తీర్థాలు అంటారు. కొలను.. కోనేరు.. కల్యాణి.. తటాకం.. తీర్థం.. ఇవన్నీ పుష్కరిణికి ఉన్న అనేక పేర్లు. ఆలయానికి సమీపంలో ఉన్న నీరు పరమపవిత్ర తీర్థమే. ఆ తీర్థాన్ని శివగంగగా భావించి అందులో స్నానం చేసి నన్ను (శివుని) పూజించాలి.‘ అని శివుడు కుమారస్వామికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పుష్కరిణి సాధారణంగా నలుచదరంగా ఉండి.. అన్నివైపులా దిగడానికి వీలుగా మెట్లు నిర్మిస్తారు. కోనేటి మధ్యలో నాలుగు స్తంభాల మండపం నిర్మించి దానిపై శిఖరం నిర్మిస్తారు. దీన్ని తీర్థమండపం లేక నీరాళిమండపం అంటారు. తెప్పోత్సవం జరిగే సమయంలో స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ ఈ తీర్థమండపంలోకి వేంచేసి పూజాదికాలు అందుకుంటారు.ఈ పుష్కరిణి తీర్థం దేవాలయంలో అర్చనాదులకు.. అభిషేకానికి.. ఇతర శుద్ధిపనులకు ఉపయోగ పడతాయి.

నిత్యం ఆలయాన్ని దర్శించే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి పునీతులౌతారు. ఉత్సవాల్లో చివరి అంకంగా జరిగే అవభృథస్నానం అంటే చక్రస్నానం.. త్రిశూలస్నానం వంటివి సామూహికంగా భక్తుల సమక్షంలో ఈ పుష్కరిణిలోనే జరుపుతారు. పుష్పవనం దేవాలయంలో అర్చనలకు.. అలంకారాల కోసం అవసరమైన పూలు, తులసి.. బిల్వం వంటి పత్రి కోసం.. పండ్ల కోసం వృక్షాలు పెంచడానికి దేవస్థానం పక్కనే.. పరిసరాలలో దగ్గరగా.. జలాశయానికి (పుష్కరిణి–తటాకం) పక్కనే ఒక ఉపవ నాన్ని నిర్మిస్తారు. అందులో పూజకు యోగ్యమైన పుష్పాలను.. పత్రాలను నివేదనకు యోగ్యమైన పండ్లను.. అందించేందుకు చెట్లను ఈ పూతోటలో పెంచుతారు. అలాగే పుష్పవనంలో ఒక మండపాన్ని కూడా నిర్మిస్తారు. అందులో పారువేట ఉత్సవంలో భాగంగా స్వామి మార్గాయాసం తీర్చుకోవడానికి అక్కడ కొంతసేపు విశ్రమిస్తారు. పుష్కరిణిలో స్నానం చేసిన భక్తుల తనువు శుద్ధమై పునీతులైతే పుష్పవనాన్ని చూసిన భక్తుల మనసు ఆహ్లాదమై భక్తిభావంతో పులకితమవుతారు.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆగమ,  శిల్పశాస్త్ర పండితులు

మరిన్ని వార్తలు