పరివార ఆలయాలు – దేవతలు

20 Oct, 2019 05:00 IST|Sakshi

ఆలయం ఆగమం

ఆలయానికి దేవాలయం.. దేవస్థానం అనే పేర్లు  ప్రచారంలో ఉన్నా ఆగమం అందులో ఓ తేడాను చెప్తుంది. గర్భగుడి.. గుడిలో మూలమూర్తి లేదా శివలింగం.. ఎదురుగా నంది/వాహనం... ధ్వజస్తంభం..బలిపీఠం ఇవి మాత్రమే ఉంటే దాన్ని దేవాలయం అంటారు. అదే వీటితోపాటు దేవి, గణపతి, స్కందుడు, చండేశ్వరుడు, పరివార దేవాలయాలు, అనేక శాలలు, గోపురాలు ఉన్నదాన్ని దేవస్థానం అంటారు. శయనాలయం దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత తప్పనిసరిగా ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలను దర్శించుకోవాలి. వాటిలో ఉన్న దేవతలను పరివార దేవతలు అంటారు. పరివార దేవతలను తప్పక దర్శించాలి అన్నది ఆలయ నియమం.

స్వామివారి దేవేరులు.. పిల్లలు...ద్వారదేవతలు... దిక్పాలకులు.. గణనాయకుడు.. సేనాపతి... ఋషులు.. భక్తులు వీళ్లంతా పరివారదేవతలుగానే పరిగణించబడతారు. పరివార దేవతలందరికీ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. రాజు ఒక పనిని తన పరివారం తోడ్పాటుతో పూర్తి చేసినట్లే... ఇక్కడ భగవంతుడు తన భక్తుల కోర్కెలను కూడా ఈ పరివార దేవతల ద్వారా తీరుస్తాడు. ఈ పరివార దేవతలనే ఆవరణ దేవతలు, ఉపదేవతలు అని కూడా అంటారు. వీరిని మూలమూర్తితో పాటు నిత్యం పూజిస్తారు. ఈ పరివారమూర్తులను ప్రతిష్ఠించడం దేవాలయానికి శోభను.. శాంతిని... మరింత పవిత్రతను.. తెచ్చిపెడుతుందని శ్రీ ప్రశ్నసంహిత చెబుతుంది.

ఈ పరివార దేవతలు సామాన్యంగా ఎనిమిది మందితో మొదలై గరిష్టంగా అరవైనాలుగుమంది వరకూ ఉంటారు. మొదటి ప్రాకారంలో.. అంటే గర్భగుడి చుట్టూ ఎనిమిదిమంది ... రెండవ ప్రాకారంలో పదహారుమంది... మూడవ ప్రాకారంలో ముప్పైరెండుమంది పరివార దేవతలుండాలని మానసార శిల్పశాస్త్రం చెప్పింది. పన్నెండుమంది పరివారదేవతలుంటే ఉత్తమం అని సనత్కుమారసంహిత చెప్తుంది. వైఖానసాగమంలో ఎనిమిదిమందితో మొదలై.. ఏడుప్రాకారాలు.. నూటపన్నెండుమంది పరివారదేవతల వరకు ఉంది. అలా ఉన్న ఆలయమే ఉత్తమోత్తమమైనది అని చెప్తోంది.

శివాలయానికి దేవి, నంది, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అగ్నిదుర్గా, అగస్త్యుడు, బ్రహ్మ, సప్తమాతృకలు, వీరభద్రుడు, విష్ణువు, శివసూర్యుడు, జ్యేష్ఠ పరివారదేవతలుగా ఉంటారు. విష్ణ్వాలయానికి దేవేరులు శ్రీదేవి–భూదేవి, గరుడుడు, విష్వక్సేనుడు, చక్రమూర్తి, దశావతారాలు, పంచమూర్తులు, నవమూర్తులు, ద్వాదశాదిత్యులు పరివారదేవతలు. శక్తి ఆలయానికి జయా, విజయా, అజితా, అపరాజితా, విభక్తా, మంగళా, మోహినీ, స్తంభినీ అనే ఎనిమిదిమంది దేవతలు. పరివారదేవతలను దర్శించి మూలమూర్తి దగ్గర కోరిన  కోరికలు మరోమారు తలుచుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయన్నది ఆగమ శాస్త్రోక్తి.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

మరిన్ని వార్తలు