బుద్ధిజీవులు  

3 Jun, 2018 00:46 IST|Sakshi

ఈవారం కథ

‘‘విజ్ఞానం కంటే ముఖ్యమైనది ఊహాత్మకత. సమస్త శాస్త్ర ఆవిష్కరణలకూ అది మూలం –’’ అల్బర్ట్‌ ఐన్‌ స్టెయిన్‌.ఈ విశాల విశ్వంలో అనేక గ్రహాల మీద జీవులున్నాయన్న సంగతి మనకు తెలుసు. ఒక్కొక్క గ్రహంలో పరిణామక్రమం, నాగరికత ఒక్కోలా వుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సాంకేతిక అభివృద్ధి విషయంలో మిగతా గ్రహాలన్నింటికంటే మనం ఉన్నత స్థాయిలో వున్నామన్న సంగతి మీకందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే మనం సాధించిన అభివృద్ధితో పోలిస్తే ఇంకా చాలా గ్రహాల్లో పరిస్థితి ప్రాథమిక దశలో వుందని చెప్పొచ్చు. వర్చువల్‌ ట్రావెలింగ్, భాషతో సంబంధం లేకుండా ఫ్రీక్వెన్సీ మేపింగ్‌ ద్వారా ఎదుటివారితో సంభాషించటం, దీర్ఘనిద్రలోకి వెళ్ళి చాలాకాలం తర్వాత తిరిగి అవసరమైనప్పుడు మేల్కొనే అవకాశం.. ఇంకా ఇలాంటి చాలా విషయాలు మిగతా గ్రహాల్లో ఊహా మాత్రంగానే వున్నాయి. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన మరో సవాల్‌ని సాధించబోతున్నాం..’’ అధ్యక్షుడు కొన్ని క్షణాలు విరామం ఇచ్చాడు.విశాలమైన ఆ హాల్‌లో పాతికమంది వరకూ వున్నారు అనడం కంటే, అక్కడ వారి వర్చువల్‌ ప్రతిబింబాలు మాత్రమే వున్నాయనడం సరైనది. అధ్యక్షుడు మాట్లాడ్డం ఆపాక అక్కడ చిక్కనైన నిశ్శబ్దం అలుముకుంది.  ‘‘మనం చేయబోతున్న ఈ ప్రయోగం జీవ పరిణామాన్నే సవాల్‌ చేసే ప్రయోగం. జీవులన్నవే లేని ఒక గ్రహాన్ని ఎన్నుకుని, దానిమీద జీవులు అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయోగాలు నిర్వహించి, మనం కోరుకున్న రీతిలో ఆ జీవుల పరిణామక్రమాన్ని నియంత్రించడం.. వాటి మెదడును మనకు అనుకూలమైన రీతిలో పరిణామం చెందేలా చేయడం.. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న రోబోల స్థానంలో జీవ రోబోల్ని ప్రవేశపెట్టడం..!

ఇది మన గ్రహం కోసం మాత్రమే కాదు; ఇది సాధ్యమైతే జీవ రోబోల్ని పంపించడం ద్వారా విశ్వంలో మన చుట్టుపక్కల గ్రహాలన్నింటిలోనూ మనం ఊహించలేని మార్పులు తేగలం. అయితే ఈ ప్రయోగం నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. మొదటిది దీనికి చాలాకాలం పడుతుంది. అయితే కాలం మనకు సమస్య కాదు. రెండోది.. ముఖ్యమైనది.. ఏమిటంటే ఈ ప్రయోగానికి అనుకూలమైన గ్రహాన్ని పట్టుకోవడం. ఇది చాలా కష్టమైన విషయంగా మారింది. కారణమేమిటంటే జీవులు అభివృద్ధి చెందటానికి అవకాశం వున్న గ్రహాలన్నింటిలోనూ ఇప్పటికే అంతో ఇంతో అభివృద్ధి చెందిన జీవులున్నాయి. అదీగాక ఆ గ్రహాల వాతావరణం కూడా మన ప్రయోగానికి అనుకూలం కాదు. అందువల్ల ఆ గ్రహాలేవీ మనకు పనికిరాకుండా పోతున్నాయి.అయితే మన ప్రయోగ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కలిగిన గ్రహం ఒకే ఒక్కటి మాత్రం కనుగొన్నాం. ఆ గ్రహంలో కూడా జీవులున్నాయి..’’ అధ్యక్షుడు మళ్ళీ ఆపాడు.ఈసారి కొంచెం కలకలం రేగింది. గందరగోళంగా కొన్ని స్వరాలు వినిపించాయి. కొన్ని క్షణాల తర్వాత ఎవరో అడిగారు.. ‘‘ఆ గ్రహం ఏది..? ఎక్కడుంది..?’’.‘‘వుంది. ఆ గ్రహం పేరు భూమి..! అవును.. చిట్టచివరికి మాకు దొరికిన గ్రహం పేరు భూమి. ఆ పేరు ఆ గ్రహం మీదున్న జీవులు పెట్టుకున్న పేరు. వారినక్కడ మానవులుగా పిలుస్తారు. వారి భాషలో చెప్పాలంటే మిల్కీవే గెలాక్సీలోని ఓరియన్‌ ఆర్మ్‌లో వున్న సౌర కుటుంబంలోని ఒక చిన్న గ్రహం అది. సూర్యుడనే ఒక సెకండరీ స్టార్‌ నుంచి వేడినీ, వెలుతురునూ పొందుతోంది. మనతో పోలిస్తే అక్కడి జీవులు.. అంటే మానవులు.. సాంకేతికంగా ప్రా«థమిక దశలో వున్నారు. దానిమీదున్న జీవుల్ని మొత్తం నాశనం చేసి మన ప్రయోగాలు ప్రారంభించాలని నిర్ణయించాం. ఆ గ్రహమే ఎందుకంటే మనం చెయ్యబోయే ప్రయోగాలకి సరిగ్గా సరిపోయే వాతావరణం కలిగివుండటం ఒక కారణమైతే ఇక రెండోది...’’ అధ్యక్షుడు కొనసాగించాడు.ఆండ్రొమెడా గెలాక్సీకి చెందిన జిటా గ్రహం మీద జరుగుతున్న ఆ సమావేశం చాలాసేపటివరకూ కొనసాగుతూనే వుంది.

సెంట్రల్‌ స్పేస్‌ సెంటర్‌. భూమి.సురేంద్ర మొహంలో, మాటల్లో ఎగై్జట్‌మెంట్‌ కనబడుతోంది – ‘‘ఎంతోకాలం నుంచి మానవులను వేధిస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకబోతోంది. విశ్వంలోని వేరే గ్రహానికి చెందిన జీవుల్నుంచి శక్తివంతమైన రేడియో సంకేతం వచ్చింది. అంతేకాదు, ఆ సంకేతం డీకోడ్‌ చెయ్యడానికి అనువైన రీతిలో వున్నట్టుగా అనిపిస్తోంది. ఏలియన్స్‌ (ఇతర గ్రహ జీవులు) మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదేమిటో సరిగ్గా అర్థం కావడంలేదు. కానీ ఇంతకాలానికి ఒక విషయం స్పష్టమైంది. ఇతర గ్రహాల్లో జీవులు వున్నారు. అంతేకాదు, వాళ్ళు మనకంటే సాంకేతికంగా చాలా ముందున్నారు. కాబట్టే మనకు సంకేతం ఇవ్వగలిగారు. వారికి మన గురించి పూర్తిగా తెలిసివుండకపోతే ఇలాంటి స్పష్టమైన సంకేతం రావడం అసాధ్యం’’.చైర్మన్‌ పురుషోత్తమరావును కలుసుకున్నాడు సురేంద్ర. విషయం విన్నాక చైర్మన్‌ ఆనందం పట్టలేకపోయాడు. ‘‘నిజమా.. మనం లోకానికి ఈ విషయాన్ని వెల్లడి చేయవచ్చా..? దాన్ని నువ్వు డీకోడ్‌ చెయ్యగలవా...?’’ పొంగిపోతూ అడిగాడు.

‘‘ఏలియన్స్‌ నుండి సంకేతం రావడం నిజం. ఇందులో ఎలాంటి అనుమానానికీ తావు లేదు సర్‌. అయితే వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మన టెక్నాలజీ గురించి వారికి పూర్తిగా అవగాహన వుందని నా నమ్మకం. అందుకే మనం అందుకోగలిగే విధంగానే ఆ సంకేతం పంపారు. అంతేకాదు మనం డీకోడ్‌ చేసే విధంగానే ఆ సంకేతం వుండి వుంటుందని నా నమ్మకం. కానీ ఆ విషయం నిర్ధారణగా చెప్పలేను. మరికాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే ఏమైనా తెలియొచ్చు..’’ చెప్పాడు సురేంద్ర.ఏలియన్స్‌ నుంచి సంకేతం వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలియపర్చబడింది. ఏలియన్స్‌ నుండి సంకేతం వచ్చిందనీ, వాళ్ళు నిజంగానే వున్నారనీ బైట ప్రపంచానికి తెలియజెప్పడం అభ్యంతరకరమైన విషయంగా ప్రభుత్వం భావించలేదు. గ్రహాంతరవాసుల నుంచి వచ్చిన సంకేతాన్ని అందుకొని గుర్తించడం ఒక ఘన విజయంగా భావించింది. మర్నాడు పేపర్లన్నింటిలోనూ ఇదే ప్రధాన వార్త. 
             
కంప్యూటర్‌ తెరమీద గందరగోళంగా కొన్ని గుర్తులు వచ్చాయి. సురేంద్ర నిస్పృహగా తల విదిలించాడు. అసలు ఈ సంకేతంలో ఏమైనా వుందా..? లేక తను అనవసరంగా ప్రయత్నిస్తున్నాడా..? ఏలియన్స్‌ తమతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా..? లేక తమ ఉనికిని మానవులకు చెప్పడానికి మాత్రమే ఆ సంకేతం పంపారా..?‘‘మీరు ఊహిస్తున్నది నిజమే! మీతో ఒక విషయం చెప్పడానికే ఆ సంకేతం పంపించాం..’’ ఎక్కణ్ణుంచో వినబడింది.సురేంద్ర ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది..? ఏవో మాటలు వినబడుతున్నాయేమిటి..? ఎక్కణ్ణుంచి..? తను భ్రమపడ్డాడా..? ‘‘భ్రమ కాదు భూగ్రహవాసీ! నిజమే. సరిగ్గా దృష్టిని కేంద్రీకరించి వినండి..’’ మళ్ళీ వినబడింది. సురేంద్రకి ఈసారి స్పష్టంగా అర్థమైంది. ఎక్కణ్ణుంచో కాదు.. తన బుర్రలోంచే వినబడుతున్నాయి ఆ మాటలు. అతడు ఆశ్చర్యంతో తలమునకలై వుండగా మళ్ళీ వినిపించసాగింది.‘‘ఆ సంకేతంలో ఏమీలేదు. కానీ దానిమీద ఎవరైనా దృష్టి కేంద్రీకరించడం జరిగితే వారి బ్రెయిన్‌ వేవ్‌ లెంగ్త్‌ తెలుసుకోవడం ద్వారా కాంటాక్ట్‌ చెయ్యాలని మేము భావించాము. మీరు దొరికారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదొక రకమైన టెలిపతీ అనాలి. కానీ దానికన్నా ఇది ఎన్నో రెట్లు ముందున్న సాంకేతికత. మీరు ఊహిస్తున్నది నిజం. మేము సాంకేతికంగా మీకంటే చాలా ముందున్నాం. మీ గ్రహం మీదున్న పరిస్థితుల గురించి మాకు పూర్తిగా తెలుసు.

నిజానికి ఈ విశ్వంలో ఏయే గ్రహాల మీద జీవులు ఏ దశల్లో వున్నాయో కూడా మా దగ్గర సమాచారం వుంది.’’‘‘మమ్మల్ని ఇప్పుడెందుకు కాంటాక్ట్‌ చెయ్యాలనుకున్నారు?’’ అప్రయత్నంగా సురేంద్ర మనసులో అనుకున్నాడు. ఆ విషయం వెంటనే అటువైపు గ్రహాంతరవాసికి తెలిసిపోయినట్టు సమాధానం వచ్చింది – ‘‘ఆ విషయమే చెప్పబోతున్నాను. మామూలుగా అయితే మిమ్మల్ని కాంటాక్ట్‌ చెయ్యడంలో మాకెటువంటి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు మీ గ్రహంతో మాకు పనిబడింది. అసలీ విషయం మీకు చెప్పాలని కూడా మేము భావించలేదు. అయితే ఎవరైనా కాంటాక్ట్‌లోకి వస్తే చెప్పాలని మాత్రం అనుకున్నాము. జీవపరిణామాన్ని నియంత్రిస్తూ జీవరోబోలను సృష్టించే ప్రయోగాల కోసం మాకొక గ్రహం అవసరమైంది. ఆ గ్రహంలో మా ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం వుండాలి. కానీ జీవులు వుండకూడదు. అలాంటి గ్రహం విశ్వంలో మాకెక్కడా లభించలేదు. సరిగ్గా మీ గ్రహం అప్పుడే మా దృష్టిలో పడింది. కానీ ముందే చెప్పినట్టు మా ప్రయోగాలకు జీవులు లేని గ్రహం కావాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీ గ్రహం మీద సమస్త జీవరాశిని తొలగించబోతున్నాము. తర్వాత మా ప్రయోగాలు ప్రారంభిస్తాం..’’‘‘నాకర్థం కావడం లేదు. సమస్త జీవుల్నీ తొలగించడం అంటే ఏం చేస్తారు?’’ సురేంద్ర మనసులోనే అనుకున్నాడు. అతడిలో అప్పుడే ఆందోళన ప్రారంభమయింది.‘‘ఇందులో పెద్దగా అర్థం కావడానికేమీ లేదు. భూగ్రహం మీద సమస్త జీవరాశినీ ముందు నిర్జీవంగా చేసి తర్వాత అనుకూలమైన పద్ధతిలో తొలగిస్తాం.. అంతే..!’’‘‘అంటే మీ ప్రయోగాల కోసం మమ్మల్నందర్నీ చంపేస్తారా..?’’‘‘చావుకి మా దగ్గరున్న అర్థం వేరు. అయినా అదంతా మీకు చెప్పవలసిన అవసరం లేదు. అసలు మీ బ్రెయిన్‌ మాకు తగిలుండకపోతే ఇది కూడా చెప్పేవాళ్ళం కాదు..’’ 

‘‘ఇది దారుణం. మేము మీలాగే బుద్ధిజీవులం. మీరూ మాలాంటివారే. కాకపోతే సాంకేతికంగా మాకంటే చాలా ముందుండి వుండవచ్చు. మమ్మల్ని నాశనం చెయ్యాలని ఎందుకనుకుంటున్నారు? మీకన్నా అభివృద్ధి చెందిన జీవులు మిమ్మల్ని నాశనం చెయ్యాలనుకుంటే మీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి?’’‘‘మీకు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి ఈ విశాల విశ్వంలో లెక్కకు మించిన గ్రహాల్లో జీవం వుంది. అందులో చాలా గ్రహాల్లోని జీవులు మీకంటే సాంకేతికంగా ఎంతో ముందున్నాయి. మాకున్న సమాచారం మేరకు మాకంటే సాంకేతికంగా ముందున్నవాళ్ళు ఎవరూ ఇంతవరకు మాకు తగల్లేదు. ఒకవేళ వున్నా అది మాకు ప్రధానం కాదు. ఇక రెండోది బుద్ధి జీవులంటే మీరేమనుకుంటున్నారో మాకు తెలీదు. మా నిర్వచనం ప్రకారం మీరు బుద్ధిజీవులు కాదు. మేము చేస్తున్నది మాకోసం మాత్రమే కాదు. ఈ ప్రయోగం సఫలమైతే విశ్వంలో జీవులున్న గ్రహాలన్నీ అని మేము చెప్పలేము గానీ మా పరిధిలోని గ్రహాల్లో పరిస్థితిని మేము సమూలంగా మార్చగలము.ఆ గ్రహాల్లో జీవులు ఆనందంగా జీవించేలా చెయ్యగలము. మీ గ్రహంలో ప్రయోగాల కోసం కోతుల్ని ఎలుకల్నీ ఎలా ఉపయోగించుకొంటారో ఇది కూడా అంతే..! భూగ్రహంలో మానవ సౌభాగ్యం కోసం కొన్ని మూగజీవులు నశించిపోయినా ఫర్వాలేదని మీరెలా అనుకుంటున్నారో, మేము తలపెట్టిన ఈ పని కోసం మీ గ్రహంలో జీవులు నశించిపోయినా ఫర్వాలేదని మేము కూడా భావించాం. ఇది మీకు జీర్ణించుకోవడానికి కష్టంగా వున్నా తప్పదు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో మా ప్రయోగాలకు సరిగ్గా అతికినట్లు సరిపోయే గ్రహం మీదొక్కటే..!’’

‘‘చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. భూమ్మీద సమస్త జీవరాశిని తొలగించటమంటే ఏమిటో తెలుసునా? కొన్ని కోట్ల అనుభూతుల్ని నాశనం చెయ్యడం.. కొన్ని కోట్ల ఆశల్ని సమూలంగా తుంచెయ్యడం.. మీరెందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు..? దయచేసి అలాంటి ప్రతిపాదన విరమించుకోండి..’’అట్నుంచి చిన్న నవ్వు వినిపించింది – ‘‘మొత్తం నిర్ణయం జరిగిపోయింది. ప్రణాళిక సిద్ధమైపోయింది. మీ భాషలో చెప్పాలంటే దాని పేరు ఆపరేషన్‌ టెర్మినేట్‌..’’ ‘‘కాదు.. కాదు.. నేను చెప్పేది వినండి.. అసలు..’’ చెప్తుండగానే అతడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడ్డాడు. బైటి శబ్దాలన్నీ ఎప్పటిలా మామూలుగా వినిపించసాగాయి. లింక్‌ తెగిపోయిందన్న విషయం సురేంద్రకి అర్థమయ్యింది. అతడు ఆందోళనగా అక్కణ్ణుంచి లేచాడు.తనకు వచ్చిన సమాచారాన్ని ముందుగా పురుషోత్తమరావుకి తెలియజేశాడు. ఆయనకి ఈ విషయం నమ్మశక్యంగా అనిపించలేదు. ‘‘నువ్వు భ్రమ పడుతున్నావేమో..’’ అన్నాడు సురేంద్రని. ‘‘లేదు సర్‌.. భ్రమ కాదు. ఇదంతా నిజమే! అయినా స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పనే చెప్పారు.. ఏలియన్స్‌ మనకంటే కనీసం కొన్ని బిలియన్ల సంవత్సరాలు సాంకేతికంగా ముందుండి వుంటారనీ, ఇప్పుడు మనం బ్యాక్టీరియాకి ఇస్తున్న విలువ కంటే వాళ్ళు మనకి ఎక్కువ విలువ ఇవ్వరనీ. అదే నిజం అయింది. మనం డేంజర్‌లో వున్నాం సర్‌.. ఇప్పుడు మనమేం చెయ్యాలో ఆలోచించాలి. ప్రభుత్వానికి ఇన్ఫార్మ్‌ చెయ్యాలి. భూమ్మీద వున్న ప్రఖ్యాత సైంటిస్టులందర్నీ సమావేశపర్చాలి. పరిష్కారం కనుక్కోవాలి..’’ గబగబా చెప్పాడు.పురుషోత్తమరావు కొన్ని క్షణాల పాటు నిర్ఘాంతపోయి చూస్తూండిపోయాడు.
  
ఏలియన్స్‌ని ఎలా ఎదుర్కోవాలన్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్త అన్ని దేశాల ప్రభుత్వాలలోని అత్యున్నత వర్గాలకీ, సైంటిస్టులకీ మాత్రమే పరిమితం చేశారు. ఆపరేషన్‌ టెర్మినేట్‌ అంటే భూగ్రహం మీద జీవరాశిని తొలగించడం అని అర్థమౌతున్నా, దానికోసం వాళ్ళ పథకం ఏమిటో ఊహించడం కష్టంగా మారింది.ఆపరేషన్‌ టెర్మినేట్‌ అంటే ఏం చేస్తారు..? భూకంపం సృష్టిస్తారా..? లేక సునామీ రప్పిస్తారా..? భూగ్రహాన్ని ఏదైనా ఆస్టరాయిడ్‌ ఢీ కొట్టేట్టు చేస్తారా..? లేక భూమ్మీద శక్తివంతమైన అణుబాంబు ప్రయోగిస్తారా..? ఏం చేస్తారు..? శాస్త్రజ్ఞుల ఊహలు రకరకాలుగా ఉన్నాయి. సురేంద్ర ఇప్పుడు కీలకంగా మారాడు. మళ్ళీ ఏలియన్స్‌ అతడి బ్రెయిన్‌ను కాంటాక్ట్‌ చెయ్యవచ్చనే ఉద్దేశ్యంతో అతనికి ఆ పని మీదే వుండమని చెప్పారు. వాళ్ళు ఊహించినట్టే సురేంద్రకి మళ్ళీ ఏలియన్‌తగిలాడు. సురేంద్ర అలర్ట్‌ అయ్యాడు. అతడి మైండ్‌లో శబ్దాలు ప్రారంభం అయ్యాయి.‘‘భూగ్రహవాసీ.. చెప్పండి.. మీరంతా నశించడానికి సిద్ధంగా వున్నారనుకుంటాను..’’ ‘‘కాదు.. మీ ఆలోచన మార్చుకోండి.. మా ప్రార్థన ఆలకించండి..’’‘‘కంగారు పడకండి.. మేము మా ఆలోచనను మార్చుకున్నాం..’’‘‘నిజమా.. అకస్మాత్తుగా ఏమిటీ మార్పు..?!’’ సురేంద్రలో ఆశ్చర్యంతో పాటు పెద్ద రిలీఫ్‌.‘‘అవును.. మీరు చెప్పిందాన్ని గూర్చి ఆలోచించాం. విశ్వంలో జీవరాశులు లేని మరొక గ్రహం కోసం వెతుకులాట ప్రారంభించాం. సరిగ్గా ఏడురోజుల తర్వాత ఇదే సమయానికి మా కాంటాక్ట్‌లోకి రావడానికి సిద్ధంగా వుండండి. ప్రస్తుతానికి శెలవు..’’ లింక్‌ కట్టయింది.

ఈ వార్త ఆఘమేఘాల మీద ముఖ్యమైన వారందరికీ చేరిపోయింది. సైంటిస్టులంతా పెద్ద రిలీఫ్‌గా ఫీలయ్యారు. అయినా ఏడురోజుల తర్వాత మళ్ళీ ఏలియన్‌ కాంటాక్ట్‌లోకి వస్తే ఎలాగైనా వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వీలవుతుందేమో అన్న దిశలో ఆలోచనలు సాగించారు. ఈసారి సురేంద్ర ఏలియన్‌తో సంభాషిస్తున్నప్పుడు అతడి పక్కనే ప్రఖ్యాత సైంటిస్టులు కూడా కూర్చొని వుంటారు. సంభాషణ సమయంలో సురేంద్రని మనసులో అనుకోవడంతో పాటు బైటికి కూడా అదేమాటలు చెప్పమని ఆదేశాలిచ్చారు. ఏలియన్‌ మాటలు వినే అవకాశం మిగతావారికి లేదు కాబట్టి సురేంద్ర మాటల ద్వారా విషయం గ్రహిస్తారు. దాన్ని బట్టి సంభాషణ ఏం జరుగుతోందో అర్థం చేసుకుని అవసరమైతే అతడికి సూచనలు ఇస్తారు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. సురేంద్ర మైండ్‌లో శబ్దాలు వినిపించసాగాయి.‘‘చూడండి భూగ్రహవాసీ.. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి..’’‘‘మేము కూడా మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాము..’’ చెప్పాడు సురేంద్ర.‘‘మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు. మాతో స్నేహం చెయ్యాలనుకుంటున్నారు. అది జరగని పని. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా ప్రయోగాల కోసం అనుకూలమైన వాతావరణం మీ గ్రహంలోనే వుంది కాబట్టి మీ గ్రహాన్ని ఎన్నుకున్నాం అని చెప్పాను. అది మొదటికారణం.. మీ గ్రహాన్నే ఎన్నుకోవడానికి రెండో కారణం కూడా వుంది. అదేమిటంటే మీ గ్రహవాసుల మీద మాకేమాత్రం సదభిప్రాయం లేదు. బుద్ధిజీవులంటే ఆలోచనాజ్ఞానం వున్నవారని మీరనుకుంటున్నారేమో..? కాదు.. మీ ఆలోచన నాశనానికి మాత్రమే దారితీసేది. అందుకే మిమ్మల్ని బుద్ధిజీవులుగా మేం అంగీకరించలేం. అసలు భూమ్మీద వున్న పరిపాలనా నిర్మాణమే సరైంది కాదు.

అనేక  దేశాలుగా విడిపోయి వున్న మీరు పైకి శాంతి మంత్రాలు జపిస్తూ నిరంతరం ఒకరినొకరు అనుమానించుకుంటూ వుంటారు. ప్రతిదేశం అణుశక్తి కోసం, అణ్వాయుధాల కోసం తహతహలాడుతుంది. అణ్వాయుధాలు కలిగిన దేశంగా పిలిపించుకోవడం మీకు ఇష్టం. ‘మా దగ్గర కూడా అణ్వాయుధాలున్నాయి సుమా.. జాగ్రత్త’ అని మిగతా దేశాలకు హెచ్చరికనివ్వడం మీ అసలు ఉద్దేశ్యం. అన్నింటికన్నా ఎక్కువగా దేశ రక్షణకు ఖర్చుపెడతారు. నిరంతరం సరిహద్దుల్ని కాపలా కాయకపోతే మీకు రోజు గడవదు. ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. చాలా దేశాల్లో అణురియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి వాటి సరైన నిర్వహణ మీకు తెలీదు. చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి అణుప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మీకీ విషయం అర్థం కావడం లేదు. భూమిని నిప్పులకుంపటి చేసుకుంటున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మేం నాశనం చెయ్యకపోయినా, సమీప భవిష్యత్తులో మీరే ఆ పని చేసుకుంటారు. అందుకే.. సరిగ్గా అందుకే.. మేం మీ గ్రహాన్ని ఎన్నుకున్నాం. మా అభిప్రాయంలో ఏ మార్పూ లేదు. అయితే మేము ఆపరేషన్‌ టెర్మినేట్‌ చేపట్టడానికి మీ కాలమానం ప్రకారం ఏడురోజుల సమయం వుంది. ఈ లోపల మిమ్మల్ని భయభ్రాంతుల్ని చెయ్యడం అనవసరం అనిపించింది. మాలో మేం చర్చించుకున్న తర్వాత మీకు క్రితంసారి ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను.. ఆపరేషన్‌ టెర్మినేట్‌కి సమయం ఆసన్నమైంది. నా మాటలు ఆగిపోయిన మరుక్షణం అది మొదలవుతుంది. ఆపరేషన్‌ టెర్మినేట్‌ అంటే ఏమిటో తెలుసుకునేసరికి జరగాల్సింది జరిగిపోతుంది. మీరేం చెయ్యలేరు. గుడ్‌ బై. వన్‌...టూ...’’

మాటలు ఆగిపోయాయి. సురేంద్ర ఆందోళనతో కంపించసాగాడు. అంతసేపు అవతలి నుంచి ఏలియన్‌ ఏం చెప్తున్నాడో అర్థంకాక మిగతావారు టెన్షన్‌గా చూస్తున్నారు. మాటలు కూడదీసుకుంటూ అతడు చెప్పాడు – ‘‘వాళ్ళు మనకి అబద్ధం చెప్పారు. భూగ్రహాన్ని నాశనం చెయ్యాలనుకున్న వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు. బహుశా ఇప్పటికే ఆపరేషన్‌ టెర్మినేట్‌ మొదలైంది. వీలైతే అదేమిటో కనుక్కోవడానికి ప్రయత్నించండి. కనుక్కున్నా బహుశా మనమేం చెయ్యలేం. మరికొద్దిసేపట్లో భూమ్మీద జీవజాలం నాశనం కాబోతోంది..’’అక్కడ గందరగోళం మొదలైంది. వాళ్ళనలాగే వదిలేసి సురేంద్ర బైటికి వచ్చాడు. ఏం జరగబోతోంది? సునామీ రాబోతోందా.. లేక ఇప్పటికే వచ్చిందా..? లేక భూకంపమా..? ఆ సూచనలు కనిపించడం లేదే..? అసలు ఏది వచ్చినా భూమ్మీద జీవజాలాన్నంతా ఒకేసారి నాశనం చెయ్యడం సాధ్యమేనా..? ఎంతోకొంత జీవజాలం మిగిలిపోతుంది కదా..? అసలు గ్రహాంతరవాసులు ఏం చెయ్యదల్చుకున్నారు..? ఎదురుగా విశాలమైన స్థలం. ఒక పక్కన పెద్ద కొలను. అతడికి ఏదో అసౌకర్యంగా అనిపించింది. కొన్ని క్షణాలు గడిచేసరికి అర్థమైంది... శ్వాస తీసుకోవడం కష్టమౌతోంది. అసలేం జరుగుతోంది..? ఎదురుగా కొలనులో నీళ్ళు అంతకంతకీ తరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. నిజమా.. భ్రమపడుతున్నాడా..? చెట్టు మీదనుంచి ఏవో పక్షులు కింద పడి అచేతనంగా మారాయి. అతడికి ఎగశ్వాస వస్తోంది.. భూమ్మీదకి విషవాయువులేమైనా ప్రయోగించారా..? ఏమీ తెలీడం లేదు.. ఒక్కటి మాత్రం అతడికి అర్థమౌతోంది. తన చివరి క్షణాలివి..! తనకే కాదు.. బహుశా భూమ్మీద ప్రాణకోటి మొత్తానికి..!  అకస్మాత్తుగా అతడి బుర్రలో మెరిసింది.. ఆక్సిజన్‌.. అవును.. వాతావరణం నుండి ఆక్సిజన్‌ తొలగించబడుతోంది. టెర్మినేషన్‌ ఆఫ్‌ ఆక్సిజన్‌..! దాదాపు ఇరవై ఒక్క శాతం వుండాల్సిన ఆక్సిజన్‌ అంతకంతకీ తగ్గిపోతోంది. నీటి నుంచి కూడా ఆక్సిజన్‌ తొలగించబడుతోంది. నీటిలోని ఆక్సిజన్‌ విడిపోయి బైటికి పోవడంతో మిగిలిన హైడ్రోజన్‌ గాల్లోకి చేరుతోంది. అందుకే కొలనులో నీళ్ళు తరిగిపోతున్నాయి. సమస్త జీవరాశినీ ఒకేసారి నాశనం చేసే విధానం. ఆపరేషన్‌ టెర్మినేట్‌..! ఏలియన్‌ చెప్పిన రెండో కారణం అతడికి గుర్తొచ్చింది. అవును మనిషి తన వినాశనానికి తానే గొయ్యి తవ్వుకున్నాడు. అతడి కళ్ళముందు చీకట్లు పరుచుకోసాగాయి. కొద్ది క్షణాల్లోనే అతడికి స్పృహ తప్పింది. 
∙           

మరిన్ని వార్తలు