నో అనకుండా తినేయండి!

18 Jan, 2015 01:10 IST|Sakshi
నో అనకుండా తినేయండి!

ఫుడ్ n బ్యూటీ
‘కోడిపులుసు-గారెలు’ కాంబినేషన్‌ను ఆరగించాలంటే చాలా మందికి భయం. లావవుతామని, చికెన్ రూపంలో శరీరంలోకి కొవ్వు నిల్వలు చేరిపోతాయేమోనని వీటి కి దూరంగా ఉంటారు. అలాంటి భయాలేమీ పెట్టుకోనక్కర్లేదు. తెలుగువారి సంప్రదాయబద్ధమైన ఈ ఆహారాన్ని కొన్ని టిప్స్ పాటించి వండుకుంటే చాలు, నో అనకుండా తినేయొచ్చు!
- డా॥జానకి,న్యూట్రిషనిస్ట్
 
 
కోడిపులుసు తయారీకి...
కావాల్సినవి:
 చికెన్ స్కిన్‌లెస్-250 గ్రాములు
 ఉల్లిపాయలు- 2; పచ్చిమిర్చి- 4
 యాలకులు- 3; లవంగాలు- 4
 ధనియాల పొడి- రెండు టీ చెంచాలు
 కారం- ఒకటి లేదా రెండు చెంచాలు
 పసుపు- 1/2 చెంచా
 నూనె - 3 చెంచాలు
 చింతపండు రసం- పావు కప్పు
 అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు చెంచాలు
 దాల్చిన చెక్క; ఉప్పు- తగినంత
విధానం: పాత్రలో ముందుగా నూనెను వేడి చేయాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఫ్రై చేశాక, అల్లం వెల్లుల్లి పేస్టు జోడించాలి. ఫ్రై అయ్యాక తరిగిన పచ్చిమిర్చి వేయాలి. తర్వాత పసుపు, ధనియాలపొడి, కారంపొడి వేయాలి. ఇప్పుడు చికెన్ వేసి అంతటినీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చివర్లో చింతపండు రసం పోసి 5 నిమిషాల్లో దించాలి.
 
గారెల తయారీకి...
కావాల్సినవి:
 మినప్పప్పు- పావు కిలో
 ఉల్లిపాయలు- 2; పచ్చిమిర్చి- 4
 జీరా- 2 చెంచాలు; అల్లం- 1 చెంచా
 కరివేపాకు - ఒక రెమ్మ; నూనె, ఉప్పు.
 విధానం: మినప్పప్పును రెండు గంటల పాటు నానబెట్టి, రుబ్బు కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, అల్లం, ఉప్పు...  పప్పుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గారెలుగా చేసుకుని, నూనెలో వేయించాలి.
 
చలికాలంలో మంచివి
చికెన్ పులుసు, గారెలు శీతాకాలంలో తగిన శక్తినీ, శరీరానికి వేడినీ ఇస్తాయి. మాంసంలోని ప్రొటీన్‌లు విలువైనవి. మినప్పప్పులో ఫైబర్(పీచు) ఎక్కువుంటుంది కాబట్టి, చికెన్‌తో కలిపి తినడం జీర్ణానికి మంచిది.
 
టిప్: మినప్పప్పు గ్రైండింగ్‌లో తక్కువ నీటిని ఉపయోగిస్తే, వేయించేప్పుడు, ఒక వాయి గారెలు ఐదు గ్రాముల కన్నా తక్కువ నూనెను పీల్చుకుంటాయి!
 
పోషక విలువలు:
100 గ్రాముల చికెన్‌లో 26 గ్రా. ప్రోటీన్స్, 6 గ్రా. ఫ్యాట్, 190 కిలో క్యాలరీల శక్తి; గారెల్లో వంద గ్రాములకు 24 గ్రా. ప్రోటీన్స్, 5 గ్రా. ఫ్యాట్, 350 కిలో క్యాలరీల శక్తి ఉంటాయి.
రిపోర్టింగ్: బీదాల జీవన్‌రెడ్డి
ఫొటో: జి.రాజేష్

మరిన్ని వార్తలు