రెండు మహానగరాలు

18 Jan, 2015 01:36 IST|Sakshi
రెండు మహానగరాలు

కవర్ స్టోరీ
రెండు మహానగరాలు. రెండూ తెలుగునాట వెలసినవే. వేర్వేరు కాలాల్లో ఉత్థాన పతనాలను చవిచూసినవే. వాటి ఉచ్ఛదశలో తెలుగు రాజధానులుగా ఉజ్వలంగా వెలుగొందినవే. వెలుగు వెలిగిన కాలంలో అవి తెలుగు జాతినే వెలిగించాయి. తెలుగు వైభవాన్ని దశదిశలకూ విస్తరించాయి. గతవైభవ నిదర్శనాలుగా ఇప్పటికీ మిగిలి ఉన్న ఆనాటి రెండు మహానగరాల్లో ఒకటి అమరావతి, మరొకటి ఓరుగల్లు.

కేంద్రప్రభుత్వం తలపెట్టిన ‘హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్,  ఆగ్మెంటేషన్ యోజన’ (హృదయ్) పథకంలో భాగంగా...  కేంద్రం ఎంపిక చేసిన చారిత్రక వారసత్వ నేపథ్యంగల  పన్నెండు నగరాలలో ఈ రెండు తెలుగు నగరాలకూ చోటు దక్కింది. ‘హృదయ్’ కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చిన  ఈ రెండు మహానగరాల చారిత్రక నేపథ్యం, ప్రాశస్త్యం గురించి...

 
ఆంధ్రుల తొలి రాజధాని: కృష్ణానది తీరాన ఉన్న అమరావతి ఆంధ్రుల తొలి రాజధాని. ఇప్పుడిది గుంటూరు జిల్లాలో ఉంది. పంచారామాల్లో మొదటి క్షేత్రమైన అమరేశ్వర ఆలయం ఇక్కడే ఉంది. బౌద్ధులు, జైనులకు కూడా ఇది పవిత్ర క్షేత్రం. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలో శాతవాహనుల హయాంలో వారి రాజధాని ధాన్యకటకంగా విలసిల్లింది. ఈ నగరాన్ని సందర్శించిన బుద్ధుడు ధారునీలతో (పవిత్ర మంత్రాలు) శుద్ధి చేసిన కారణంగా కాలక్రమంలో దీని పేరు ధరణికోటగా మారింది.

దేవగురువు బృహస్పతి ఆధ్వర్యంలో దేవేంద్రుడు ఇక్కడ అమరేశ్వరుడిని ప్రతిష్ఠించడంతో అమరావతిగా గుర్తింపు పొందింది. పదహారడుగుల పొడవున ఉన్న స్ఫటికలింగం ఈ శైవక్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో అమరావతిని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ఇక్కడే ఏడాది నివసించి, ఇక్కడి విశేషాలను గ్రంథస్తం చేశాడు. క్రీస్తుశకం పదిహేడో శతాబ్దిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరేశ్వర ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి, ఈ నగరానికి అమరావతిగా నామకరణం చేశారు. వెంకటాద్రి నాయుడు కంటే ముందే శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించుకుని, తులాభారం తూగినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
 
బౌద్ధుల పవిత్ర క్షేత్రంగా...: బౌద్ధ గురువు దలైలామా 2006 సంవత్సరంలో నిర్వహించిన ‘కాలచక్ర’ దీనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ‘కాలచక్ర’ ఉత్సవాల సమయంలోనే 125 అడుగుల ధ్యానబుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. దీని నిర్మాణం 2014లో పూర్తయింది. దీనిపై బుద్ధుని జననం నుంచి నిర్యాణం వరకు గల ఘట్టాలన్నింటినీ చెక్కారు. ఇక్కడి మ్యూజియంలో బుద్ధుని జీవితానికి సంబంధించిన రెండువందల శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. మరో మూడువందల శిల్పాలకు స్థలం లేకపోవడంతో షెడ్డులో భద్రపరిచారు.

కొత్త మ్యూజియం ఏర్పాటైతే తప్ప సందర్శకులకు వీటి దర్శన భాగ్యం లభించే అవకాశం లేదు. మ్యూజియంలో బౌద్ధ శిల్పాలతో పాటు పద్మం, పూర్ణకుంభం, శాతవాహనుల నాటి నంది విగ్రహాలూ ఉన్నాయి. అమరేశ్వరాలయం నుంచి సేకరించిన 33 ముక్కలను మెండింగ్ చేసి, ఒకటిగా రూపొందించిన శిల్పంలో యక్ష, గంధర్వ, నంది ఆకృతులు ఉన్నాయి. బుద్ధుని నిర్యాణం తర్వాత ఆయన అస్థికలను అనేక ప్రాంతాల్లో భద్రపరచిన శిష్యులు, ఇక్కడ అస్థికలను నిక్షిప్తం చేసిన చోట అద్భుత స్థూపాన్ని నిర్మించారు. ఇప్పడా స్థూపంలోని ప్రధాన భాగాలు లండన్, మద్రాసు, కలకత్తా మ్యూజియంలలో పదిలంగా ఉన్నాయి.
 
జైనుల తీర్థస్థలిగా...: అమరావతి జైనులకు కూడా పవిత్ర స్థలంగా విరాజిల్లుతోంది. అమరేశ్వర స్నానఘాట్ సమీపంలో జైనుల 24వ తీర్థంకరుడైన చింతామణి పార్శ్వనాథ్ శ్వేతాంబర్ దేవాలయం జైనుల పవిత్రాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఏటా పదిహేను రోజుల పాటు జైనుల ఉత్సవాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో జైనులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. పార్శ్వనాథ్ మూలవిరాట్ విగ్రహం కృష్ణానది గర్భంలో లభించినందున జైనులు ఇక్కడే ఆలయాన్ని నిర్మించుకుని, అమరావతిని తమ ఆరాధనా కేంద్రంగా మలచుకున్నారు.
 
ఇప్పుడిలా మిగిలింది...: ఆంధ్రుల తొలి రాజధానిగా వెలుగొందిన అమరావతి ఇప్పుడు నామమాత్రపు పట్టణంగా మాత్రమే మిగిలింది. ఇక్కడి చారిత్రక వారసత్వ విశేషాలు దేశ విదేశాల పర్యాటకులను ఆకట్టుకుంటున్నా, ఇక్కడ వారికి తగిన కనీస వసతులేవీ లేవు. అమరావతికి ప్రతినెలా సగటున పదివేల మంది వరకు యాత్రికులు వస్తుంటారు. వారిలో కనీసం రెండువేల మంది విదేశీ యాత్రికులే ఉంటారు. వసతికి తగిన అతిథిగృహాలు, సరైన ఆహార సౌకర్యాలు, కనీసం టాయ్‌లెట్లు కూడా లేకపోవడంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

17.5 ఎకరాల విస్తీర్ణంలో థీమ్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, అది భూసేకరణ దశలోనే ఆగిపోయింది. ఇక్కడకు వచ్చే భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించేందుకు పుష్కరఘాట్లు, వసతులు కనిపించవు. కాలచక్ర మ్యూజియంలో లేజర్ షో ఏర్పాటుకు కావలసిన పరికరాలను పర్యాటక శాఖ సిద్ధం చేసినా, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూలపడ్డాయి.
 
ఇక వరంగల్ గురించి...
కాకతీయుల రాజధాని: ఒకప్పుడు ఏకశిలానగరంగా, ఓరుగల్లుగా ఖ్యాతిగాంచిన వరంగల్ కాకతీయుల రాజధానిగా వర్ధిల్లింది. క్రీస్తుశకం పన్నెండు నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ఓరుగల్లునే కేంద్రంగా చేసుకుని కాకతీయ ప్రభువులు గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కాకతీయుల వైభవానికి ఆనవాళ్లుగా పలు నిర్మాణాలు ఇక్కడ నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి.

కాకతీయుల కోట, నాలుగు శిలాతోరణాలు, స్వయంభూ దేవాలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప చెరువు వద్ద రామప్ప గుడి వంటి నిర్మాణాలు కాకతీయుల నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా ఉన్నాయి. కాకతీయుల పాలనలో సాంస్కృతిక, పాలనా వైభవాన్ని ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో గ్రంథస్తం చేశాడు. రామలింగేశ్వరుడు వెలసిన రామప్ప గుడి, దీనిని తీర్చిదిద్దిన శిల్పి రామప్ప పేరిట ప్రసిద్ధి పొందడం విశేషం.

‘నృత్య రత్నావళి’లో జాయప సేనాని వర్ణించిన నృత్యభంగిమల శిల్పాలు రామప్ప గుడిగోడలపై కనువిందు చేస్తాయి. ఈ శిల్పాలను ఆధారం చేసుకునే ఆచార్య నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవ నృత్యరీతిని పునరుద్ధరించారు. ఇక వేయిస్తంభాల గుడి నిర్మాణం  కాకతీయ ప్రభువు రుద్రదేవుని ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఆలయంలోని స్తంభాల దిగువన ఇసుక తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. శతాబ్దాలు గడచినా ఈ స్తంభాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉండటం అప్పటి శిల్పుల భవన నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. వేయిస్తంభాల గుడిలో శివుడు, విష్ణువు, సూర్యుడు కొలువుదీరి ఉన్నారు.

అద్భుత శిల్పనైపుణ్యంతో తీర్చిదిద్దిన స్తంభాలతో పాటు ఇక్కడ కొలువుదీరిన భారీ నంది విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటుంది. వేయి స్తంభాల గుడికి చేరువలోనే హన్మకొండలోని భద్రకాళి ఆలయం, దానికి చేరువలోనే భద్రకాళి చెరువు ఉన్నాయి. పద్మాక్షి గుట్టపైన పన్నెండో శతాబ్ది నాటి పద్మాక్షి ఆలయంతో పాటు జైన తీర్థంకరుల శిల్పాలూ ఉన్నాయి. ఈ ఆలయంలో ఏటా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కాకతీయ ప్రభువుల్లో రెండవ బేతరాజు వీరశైవంలోకి మారక ముందు కాకతీయులు జైన మతాన్నే అవలంబించే వారని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రెండవ ప్రోలరాజు ఇక్కడ నిర్మించిన జైన ఆలయం తదనంతర కాలంలో శైవ ఆలయంగా రూపుదిద్దుకున్నట్లు చెబుతారు.
 
ఆశించినవన్నీ నెరవేరేనా..?: ‘హృదయ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం పన్నెండు నగరాలను ఎంపిక చేసింది. వారణాసి, అమృత్‌సర్, అజ్మీర్, మధుర, గయ, కాంచీపురం, వెల్లంకని, బదామి, అమరావతి, వరంగల్, పూరీ, ద్వారక ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పన్నెండు నగరాలకు ‘హృదయ్’ పథకం కింద కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. అంటే, ఒక్కో నగరానికి దక్కేది రూ.40 కోట్ల పైచిలుకు మాత్రమే.

వారసత్వ, చారిత్రక నిర్మాణాల పరిరక్షణతో పాటు ఈ నగరాలలో పారిశుధ్యం, ఇక్కడి ప్రజలకు జీవనోపాధి, నైపుణ్యాల మెరుగుదల, భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల, సత్వర సేవలు కల్పించాలనేది ఈ పథకం లక్ష్యం. ఒక్కో నగరానికి దక్కే రూ.40 కోట్ల పైచిలుకు మొత్తంతో ఆశించిన లక్ష్యాలన్నీ నెరవేరేనా అనేదే ప్రశ్న!
 
వారసత్వ సంపదను పునరుద్ధరించాలి

అమరావతి వారసత్వ సంపద పరిరక్షణ కార్యక్రమాన్ని ఒక్క అమరావతికి మాత్రమే పరిమితం చేయకూడదు. అమరావతి పరిసరాల్లోని జైన అవశేషాలు కలిగిన మునగోడు, తుళ్లూరు మండలం వడ్డమాను (నాటి జైనుల వర్ధమానపురం), పెదకూరపాడు మండలంలోని కంభంపాడులనూ అభివృద్ధి చేయాలి. బౌద్ధమతానికి సంబంధించి ధరణికోటలోని కోట దిబ్బలలో నేటికీ శాతవాహనుల రాజధానికి సంబంధించిన శిల్పసంపద మరుగున పడి ఉంది. వెలికి తీసేందుకు తవ్వకాలు జరిపించాలి.

కొత్త తెలుగు రాష్ట్రంలో అమరావతి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చెందాలంటే, ఇక్కడ లలితకళల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. మత సామరస్యంలో ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచిన అమరావతిలో హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన చరిత్రను ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలి. ధ్యానబుద్ధ ప్రాజెక్టును గతంలో రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారమే నిర్మించాలి. వారసత్వ నగరానికి కేంద్రం ఇచ్చిన నిధులను రోడ్లు, కాలువలకు వాడకుండా, చరిత్రను వెలికితీసి, అభివృద్ధి చేయడానికి మాత్రమే వాడాలి.
 - డా. వావిలాల సుబ్బారావు
 చైర్మన్, ధాన్యకటక బుద్ధవిహార ట్రస్టు

 

ఓరుగల్లు కీర్తి వెలగాలి

వరంగల్‌కు చారిత్రకంగా ఎంతో గుర్తింపు ఉంది. పర్యాటకంగా ఆకట్టుకునే అన్ని అంశాలూ వరంగల్ జిల్లాలో ఉన్నాయి. పర్యాటకపరంగా వారసత్వ సంపదను నేచురల్ హెరిటేజ్, మ్యాన్ మేడ్ హెరిటేజ్, లివింగ్ హెరిటేజ్‌గా వర్గీకరిస్తారు. వరంగల్ జిల్లాలో ఈ మూడు రకాల ప్రదేశాలూ ఉన్నాయి. రేగొండ మండలం తిరుమలగిరి వద్దనున్న పాండవులగుట్ట సహజ వారసత్వ సంపదగా ఉంది. ఆదిమానవుల అవశేషాలు అక్కడ ఉన్నాయి.

కాకతీయుల కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, రామప్ప చెరువు, లక్నవరం చెరువు వంటివి మ్యాన్ మేడ్ హెరిటేజ్‌గా ఉన్నాయి. ఇక శతాబ్దాల పరంపరగా కొనసాగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర లివింగ్ హెరిటేజ్‌గా ఉంది. ఇలా అన్ని అంశాల్లోనూ ప్రత్యేకత ఉండటం వల్లనే వరంగల్‌కు 2012లో జాతీయ వారసత్వ నగరం హోదా దక్కింది. దీని వెనుక ‘ఇంటాక్’ కృషి చాలా ఉంది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సహకారంతో వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ చారిత్రక కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు లభించింది.

సమ్మక్క-సారలమ్మ జాతరకు కూడా ఇదే స్థాయిలో లివింగ్ హెరిటేజ్ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వరంగల్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిని ‘హృదయ్’ పరిధిలోకి చేర్చింది. ఇది ఎంతో మేలు చేస్తుంది. వేయి స్తంభాల గుడి కళ్యాణ మండపం పునరుద్ధరణ వచ్చే మార్చి నాటికి పూర్తవుతుంది. ఏఎస్‌ఐ నిధుల కొరత కారణంగా ఈ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదు. ‘హృదయ్’ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా 12 నగరాలకు రూ.500 కోట్లు కేటాయించింది.

‘హృదయ్’ అమలులో ఉండే 2018 సంవత్సరం లోపు వరంగల్‌కు అంతర్జాతీయ కీర్తి రావాలి. ‘హృదయ్’ కింద వంద శాతం నిధులను కేంద్రమే సమకూర్చనున్నందున నిధుల సమస్య తలెత్తే అవకాశాలు లేవు. నగర పాలక సంస్థలకు ‘హృదయ్’లో కీలక పాత్ర ఉండటంతో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రణాళికలను రూపొందించవచ్చు. అయితే, ‘హృదయ్’ ప్రణాళికను జిల్లా కేంద్రానికి మాత్రమే పరిమితం చేయకుండా, నగరం వెలుపల ఉన్న రామప్ప గుడి, పాండవుల గుట్ట వంటి అపురూప నిర్మాణాలను కూడా దీని పరిధిలోకి చేర్చాలి. ఇప్పటికే ఉన్న వారసత్వ సంపదను రక్షించుకుంటూ, శిథిలమైన వాటిని పునరుద్ధరించుకుంటే ప్రపంచ పర్యాటక రంగంలోనే వరంగల్‌కు గొప్ప ప్రాధాన్యత దక్కుతుంది.
 
ఎం.పాండురంగారావు, రిటైర్డ్ ప్రొఫెసర్, వరంగల్ జిల్లా కన్వీనర్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్), ట్రస్టీ, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్
 
 -  ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, గుంటూరు; ఫొటోలు: రూబెన్ బెసాలియేల్, గుంటూరు
 -  పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్; ఫొటోలు: తంపెట వెంకటేశ్వర్లు, పెద్దపెల్లి వరప్రసాద్, వరంగల్

మరిన్ని వార్తలు