ప్రచారంలో పదనిసలు 

18 Apr, 2019 03:37 IST|Sakshi

సందర్భం

ఈమధ్య రాజకీయ నాయకులు తమ ప్రచారంలో ఓ ప్రమాదకరమైన  విషయంలో కాలుమోపుతున్నారని నాకనిపిస్తుంది . అసదుద్దీన్‌ ఒవైసీగారు నరేంద్రమోదీ మీద కాలు దువ్వుతూ ఒకానొక సభలో ‘‘గో మాంసంతో చేసిన బిరియానీ సేవించి తమరు నిద్రపోయారు ? ’’ అని విమర్శించాడు. ఇందులో ప్రత్యేకమైన ఎత్తుపొడుపు– గోవుల్ని  ఆరాధించే  పార్టీనాయకులు అలాంటి  బిర్యానీని  తినడం. 
వీరే 2018 తెలంగాణా ఎన్నికలలో ‘‘నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుని ఒక  ప్యాకెట్‌ ‘కళ్యాణి’ బిర్యానీ అడుగుతా’’ అన్నారు. 

బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షా ఉత్తరప్రదేశ్‌ మొరా దాబాద్‌ ఎన్నికల సభలో  ‘‘ఇంతకాలం కాంగ్రెస్‌ దౌర్జన్యకారుల చేత బిర్యానీని  తినిపించింది’’అని ఎద్దేవా చేశారు. 
కాంగ్రెసు కార్యదర్మి ప్రియాంకా గాంధీ  ‘‘మోదీగారు పాకిస్తాన్‌ బిర్యానీని సేవించడానికి పాకిస్తాన్‌ వెళ్లారు’’ అని వెక్కిరించారు. 

తెలుగులో ఓ సామెత∙ఉంది. ప్రత్యర్థిని దెబ్బతీస్తున్నప్పుడు ఒకమాట చెప్తారు. ‘‘ఏమైనా చెయ్యండి కానీ అతని కడుపు మీద కొట్టకండి’’ అని. కారణం ఉపాధికి మూల స్థానం– కడుపు. దానికి సంబంధించినది దేన్ని కదిపినా మనిషి కదులుతాడు అయినా ఈమధ్య రాజకీయ నాయకులు ‘కడుపు’ మీద  కొడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన చర్య అని ముందుగా అందరినీ హెచ్చరిస్తున్నాను. 
ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి ఉంటుంది. దానిని ఎత్తి చూపి ఆ ప్రాంతాలవారిని వెక్కిరించడం కద్దు. దక్షిణాదివారిని ‘ఇడ్లీ సాంబారు వాలా’ అంటారు. ఒకప్పుడు ఇది తమిళుల సొత్తు ఇప్పుడు ఇడ్లీ విశ్వరూపం దాల్చింది. వాషింగ్టన్‌ , దుబాయ్, మలేషియా– ఎక్కడయినా ఇడ్లీ దర్శనమిస్తుంది.  

తెలుగువారికి – దోశ, పెసరట్టు. నేను విజయవాడలో పనిచేసే రోజుల్లో రాత్రంతా రచన చేసి ఏ తెల్లవారు జామునో కడుపు తేలిక కాగా ఏలూరు రోడ్డుకి వచ్చేవాడిని. ఆ సెంటర్లో ‘మాతా కేఫ్‌’ ఉండేది. మాలాంటి వాళ్ల కోసం  వేడి వేడి ఇడ్లీలు చేసేవాడు. ఓపట్టు ఎక్కువ పట్టాలంటే మినప దోసె. వీటిని తినడానికే ఓ రాత్రి వరకూ రచన సాగించేవారం. కాలిఫోర్నియాలో సాగర్‌ అనే తెలుగు మిత్రులు ఒక ఆంధ్రా హోటల్‌ తెరిచారు. పేరు? ‘‘దోసె ప్యాలెస్‌’’. అక్కడి దోసెలు తినడానికి 60–70 మైళ్ల దూరం నుంచి తెలుగువారు రావడం నాకు తెలుసు. 

మరి కేరళవారికి? పుట్టు కడలె చాలా అభిమాన వంటకం. సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకులు భీమ్‌సింగ్‌ గారి సతీమణి సుకుమారి ఇంట్లో తిన్న జ్ఞాపకం ఇప్పటికీ చెదిరిపోదు. ఇక కర్ణాటకలో– ఆ మాటకు వస్తే మన రాయలసీమ పొలిమేరల నుంచి ‘రాగి ముద్ద’ చాలా ఫేమస్‌.  
నిజాం ప్రాంతంలో, కొన్ని ఉత్తరాది ప్రాంతాలలో చాలా పాపులర్‌ వంటకం– బిర్యానీ. నాకో దురభిప్రాయం ఉండేది. ఇది బొత్తిగా ఉత్తర భారతీయుల ‘రుచి’ అని. నేను పొరపాటు బడ్డానని ఈ మధ్యనే గ్రహించాను. ఇవాళ ఎక్కడ చూసినా చెన్నైలో బిర్యానీ విశ్వరూపం కనిపిస్తోంది. బిర్యానీ హోటళ్ల వివరాల కోసం కంప్యూటర్‌ తెరిచాను. నాకు శోష వచ్చినంత పనైంది. ఒక్క చెన్నైలోనే దాదాపు 249 హోటళ్లున్నాయి. అదీ రకరకాల బిర్యానీ రుచులతో. 

మచ్చుకి కొన్ని మాత్రం – ఆసీష్‌ బిర్యానీ, తాళపుకట్టె బిర్యానీ, మలబార్‌ బిర్యానీ, అబ్దుల్లా బిర్యానీ, అంబాళ్‌ బిర్యానీ, తంగమ్‌ బిర్యానీ, స్టార్‌ చికెన్‌ బిర్యానీ, ముఘల్‌ బిర్యానీ, కరీం బిర్యానీ, ఎస్‌ఎస్‌ హైదరాబాద్‌ బిర్యానీ, బిలాల్‌ బిర్యానీ, చార్మినార్‌ బిర్యానీ, పారామౌంట్‌ బిర్యానీ, ది రాయల్స్‌ బిర్యానీ, సేలం ఆర్‌ఆర్‌ బిర్యానీ, తారిఖ్‌ బిర్యానీ, నయీం బిర్యానీ, సంజయ్‌ బిర్యానీ– ఇక్కడ ఆగుతాను.  
మొఘలుల కాలంలో ఇండియాకు దిగుమతి అయిన ఈ వంటకం – పేరు, రుచి మార్చుకుని ఇప్పుడు అంతటా దర్శనమిస్తోంది. అవధ్, హైదరాబాద్, పంజాబీ, కలకత్తా, దిండిగల్లు ఇలా మీ యిష్టం.  

విజయ్‌ మరూర్‌ అనే వంటగాడు– లక్షలాది మందికి అనుదినమూ ఆనందాన్నీ, ఉపాధినీ ఇచ్చే ఈ ‘గొప్ప’ దినుసుని రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడం అన్యాయమని వాపోయారు. మనూ విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్‌ సల్మా ఫరూఖీగారు తమ రాజకీయ వెక్కిరింతలకు నిక్షేపంలాంటి, కడుపుల్ని నింపే వంటకాన్ని వీధిన పెట్టడం దుర్మార్గం అన్నారు. 
ఏమయినా ఈ రాజకీయ నాయకులందరూ పప్పులో కాలేశారని నాకనిపిస్తుంది. పొరపాటు. ఈ మాట అన్నదెవరో పప్పుని దుర్వినియోగం చేశాడనీ, అతనికి బొత్తిగా పప్పు రుచి తెలియదని నా ఉద్దేశం. ఇప్పుడు – ఈ కామెంట్‌ను తిరగరాస్తున్నాను. 

ఈ రాజకీయ నాయకులందరూ నిర్ధారణగా ‘బిర్యానీ’లో కాలేశారు. వారందరికీ అర్థంకాని విషయం ఏమిటంటే మన దేశంలో బిర్యానీ రుచి కొత్త రాష్ట్రాలకూ, ప్రాంతాలకూ పాకుతోంది. రోజురోజుకీ దేశ ప్రజలు బిర్యానీ రుచిని మరిగి విర్రవీగిపోతున్నారు. కనుక బిర్యానీని అడ్డం పెట్టుకుని ఎద్దేవా చేసే నాయకులు వారికి తెలియకుండానే కొన్ని లక్షల ఓట్లు నష్టపోతున్నారని నాకనిపిస్తోంది.

-గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు