నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ

26 Jan, 2020 00:05 IST|Sakshi

నేనొక కలగంటున్నాను. ప్రపంచంలో భారతదేశం అనేదే లేదు. సరిహద్దులు ఉంటాయి. కానీ అది దేశం కాదు. నరేంద్ర మోదీ ఉంటాడు. కానీ అతడు ప్రధాని కాదు. అమిత్‌ షా ఉంటాడు. కానీ అతడు హోమ్‌ మినిస్టర్‌ కాదు. ప్రజలు ఉంటారు. కానీ దేశ ప్రజలు కారు. 
నేనొక కలగంటున్నాను. ఉండీలేనట్లున్న ఈ దేశంలో నరేంద్ర మోదీ, అమిత్‌ షా కూడా ఉండీ లేనట్లే ఉంటారు. దేశ ప్రజలంతా ఒక దేశం లేనివాళ్లుగా ఉంటారు. అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారీ ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పరిఢవిల్లుతుంటాయి. ఐఎస్‌ఐ వాళ్లు, ఐసిస్‌ వాళ్లు భార్యాబిడ్డల్తో టూర్‌కి వచ్చిపోతుంటారు. ఏటా దావోస్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో ప్రసంగించడానికి వచ్చే బిలియనీర్‌లు ప్రసంగాలు అయ్యాక.. వాళ్ల వాళ్ల దేశాలకు వెళ్లిపోకుండా.. ఇక్కడెలా ఉందో ఒకసారి చూసి పోదామని ఇటువైపు వస్తారు. ప్రభుత్వం ఉండీ లేకపోవడం వారికి సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. పౌరులు పౌరుల్లా కాకుండా.. ఆధార్‌ కార్డులు లేకుండా, పుట్టిన తేదీలు, పుట్టిన స్థలాల పట్టింపు లేకుండా అంతా కలివిడిగా ఆలింగనాలు చేసుకుంటూ జీవిస్తుండటం ఆ దావోస్‌ ప్రసంగీకుల్ని పరమానందభరితుల్ని చేస్తుంది... 
ఏదో చప్పుడైంది! నా కల పూర్తి కాకుండానే చెదిరిపోయింది. 
‘‘.. మీ అందమైన కలకు నేను గానీ అంతరాయం కలిగించ లేదు కదా మోదీజీ’’  అంటున్నారు అమిత్‌ షా!!
ఆశ్చర్యంగా చూశాను. 
‘‘పరేడ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీజీ. చీఫ్‌ గెస్ట్‌ జైర్‌ బొల్సొనారో కూడా బ్రెజిల్‌ నుంచి వచ్చి కూర్చున్నారు. మీరొస్తే పరేడ్‌ మొదలౌతుంది’’ అన్నారు అమిత్‌ షా. 
‘‘అమిత్‌జీ.. ముందు నాకిది చెప్పండి. నేనొక అందమైన కలను కంటున్నట్లు మీరెలా గ్రహించగలిగారు’’ అని అడిగాను. 
‘‘మీ ముఖంపై చిరునవ్వును గమనించాను మోదీజీ. ఆ చిరునవ్వు.. పౌరసత్వ చట్టం అమలుకు ఈ దేశంలోని ప్రగతిశీల వాదులంతా ఒకేసారి ఓకే అంటేనో, ఎన్నార్సీని ప్రారంభించడానికి రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకు వస్తేనో విరిసేది కాదు. అంతకు మించిన కారణం ఏదైనా ఉండాలి. నేననుకోవడం.. మీరొక హద్దులు, పద్దులు లేని భారతదేశాన్ని కలగంటున్నారు. నిజమేనా మోదీజీ’’ అన్నారు అమిత్‌ షా!! అతడి ముఖంలో ఏదో వెలుగు కనిపిస్తోంది.
విస్మయ చకితుణ్ణి అయ్యాను. ‘‘ఎలా చెప్పగలిగారు అమిత్‌జీ’’ అన్నాను. 
‘‘మీ కలనే ఇప్పటి వరకు నేనూ మా ఇంట్లో కని వస్తున్నాను మోదీజీ. ఎవరైనా వాళ్ల కలను కాకుండా, ఇంకొకరి కలను కంటూ ఉంటే వారి ముఖంలోకి వచ్చే ఆ వెలుగే వేరు’’ అన్నారు అమిత్‌ షా. 
లేచి అద్దంలో ముఖం చూసుకున్నాను. నా ముఖంలోనూ వెలుగు! అప్పటి వరకు నేను కంటున్న జార్జి షోరోస్‌ అనే ఒక విదేశీయుడి కల అప్పుడే నా ముఖంపై పనిచేయడం మొదలైనట్లుంది! దావోస్‌లో ప్రసంగించి వెళ్లిన బిలియనీరే ఆ జార్జి షోరోస్‌. నరేంద్ర మోదీ డేంజరస్‌ అంటాడు! పౌరుల్ని తరిమికొట్టడానికే పౌరసత్వ చట్టం అంటాడు! కశ్మీర్‌తో మోదీకేం పని అంటాడు! ఇండియాను ఇల్లూ వాకిలి లేని ఓపెన్‌ సొసైటీగా మార్చడానికి ఒక యూనివర్సిటీని కట్టాలని అంటాడు. కట్టేపనైతే బిలియన్‌ డాలర్‌ల చెక్కు ఇస్తానని అంటాడు! 
‘‘ఏం చేద్దాం అమిత్‌జీ’’ అన్నాను. 
‘‘ఏంటి చేయడం మోదీజీ’’ అన్నారు. 
‘‘యూనివర్సిటీ కట్టడానికి బిలియన్‌ డాలర్లు ఇస్తాడట జార్జి షోరోస్‌. కడదామా?’’ అన్నాను. 
‘‘కట్టడం ఎందుకు మోదీజీ! ఆల్రెడీ మనకు జేఎన్‌యూ ఉంది కదా’’ అన్నారు అమిత్‌ షా.
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు