తెలుగు భాషపైన నిజమైన ప్రేమేనా?

8 Dec, 2019 01:09 IST|Sakshi

ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులకు హఠాత్తుగా తెలుగు భాషపైన ఎక్కడ లేని ప్రేమ పుట్టు కొచ్చింది. తెలుగు భాష సంస్కృతి అంతమైపోయిందన్న ఆందోళనతో నిద్రకూడా పోవడం లేదు. ఇప్పటికిప్పుడు తెలుగు పైన ఇంత అభిమానం ఎందుకు కలిగింది? ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్య మంలో ఉంటుందన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటన వల్లనే గదా.

తెలుగు మాట్లాడితే జరిమానా విధిస్తూ, ఎండలో నిలబెట్టి శిక్షిస్తూ, తెలుగు వాసనని కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్న కార్పొరేట్‌ స్కూళ్లలో సంపన్న వర్గాల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నప్పుడు తెలుగు భాషకు ఏ అపకారం, అపచారం జరగలేదా? ఇప్పుడు పేదలు, బలహీనవర్గాలు, దళిత, మైనారి టీల పిల్లలు ఇంగ్లిష్‌లో చదువుకుంటేనే తెలుగుకు అంత పెద్ద ఉపద్రవం వచ్చి పడబోతున్నదా? తెలుగు భాషపైన ఇప్పుడు అలవిమాలిన ప్రేమని ఒలకబోస్తున్న గత ప్రభుత్వం తెలుగు భాషాభి వృద్ధికి ఏం చేసింది? 

ఓరియంటల్‌ కళాశాలలు వరుసగా మూతప డుతున్నాయి. భాషా ప్రవీణ, విద్వాన్‌ వంటి కోర్సుల సిలబస్‌లో తెలుగు భాషకు సంబంధిం చిన సిలబస్‌ను తగ్గించి ఇంగ్లిష్‌ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. మరి పద్నాలుగేళ్లు సీఎం రాజ్య మేలిన చంద్రబాబుకు, ఆయన అనుచరు లకు, వంత పాడుతున్న మేధావులకు ఆనాడే తెలుగు భాషకు జరిగిన అపచారం తెలీలేదా? మరో విషయం. టెన్త్, ఇంటర్‌ తరగతుల్లో సంస్కృతం పేపర్‌ ఎందుకొచ్చింది? ఎవరి ప్రయోజనం కోసం వచ్చింది?

తెలుగు పేపర్‌ను వదిలేసి విద్యార్థు లంతా సంస్కృతం పేపర్లోకి పరుగులు తీసే పరి స్థితి ఎందుకేర్పడింది? విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్‌ సంస్థలు ర్యాంకుల పంట పండించు కోవడం కోసం కాదా? దీంతో తెలుగు బడులకు మనుగడ లేక, తెలుగు పండితులకు గౌరవం లేక, తెలుగు భాష ఇంత చులకనైపో తుంటే, పలుచనై పోతుంటే ఇన్నేళ్లుగా చూస్తూ కూర్చున్నారు కదా.. ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడే అర్హత వీరికి ఎక్కడినుంచి వచ్చింది? 

గ్రామీణ ప్రాంతాల బడుల్లో సరిపడినంత విద్యార్థులు లేరన్న నెపంతో గత ప్రభుత్వం వేలాది బడులను మూసివేసింది. దాంతో పేద విద్యార్థులు అప్పులు చేసి ప్రైవేటు బడులకు పరు గులు తీయవలసి వచ్చింది. ఆ మాత్రం శక్తి కూడా లేని వేలాదిమంది పసివాళ్లు బడిబాటే మర్చి పోవాల్సి వచ్చింది. ఇంత నిర్దయగా నిరుపేదలు, బడుగు, బలహీనుల బిడ్డలకు చదువుని దూరం చేసి గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు పసి బిడ్డల చదువుల గురించి కాకుండా వాళ్ల భాష గురించి బాధపడటం ఎంత విచిత్రం.

మాతృభాషలో విద్యాబోధనే ఉత్తమం అని మేధావులు, భాషా శాస్త్రవేత్తలు చెబుతోంది నిజమే. అయితే మాతృభాషలోనే ఉన్నత విద్య అభ్యసిస్తున్న జర్మనీ, జపాన్, రష్యా వంటి పలు దేశాల పరిస్థితి వేరు. ఈ దేశాలు ఆంగ్లేయుల పాలనకు తలొగ్గలేదు. ఇంగ్లిష్‌ నేర్చుకునే అవసరం వారికి ఏర్పడనందున శాస్త్ర, సాంకేతిక జ్ఞాన మంతా వారి మాతృభాషలోనే లభ్యమవుతుంది.

కానీ భారత్‌ వంటి దేశాల పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. 200 ఏళ్లకు పైగా బ్రిటిష్‌ వలసగా మనం ఉండటంతో ఇంగ్లిష్‌ మనపై బలవంతంగా రుద్దారు. భారతీయులు అనివార్యంగా ఇంగ్లిష్‌ నేర్చుకోవలసి వచ్చింది. ఇంగ్లిష్‌లో మాట్లాడటం గొప్ప అన్న భావన స్థిరపడి పోయింది. ఇంగ్లిష్‌ రానివాళ్లు ఆత్మన్యూనతలో ఉండిపోయారు. అంతగా పాతుకుపోయిన ఆంగ్ల భాషను ఇప్పటి కిప్పుడు తోసెయ్యగలమా? 

వారు చెబుతున్నట్లే తెలుగు భాషని ఉద్ద రిద్దాం. ‘ఆంధ్రదేశంలోని ప్రతి పాఠశాలలోనూ ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి, ఏ మినహాయింపూ లేకుండా ప్రతి తెలుగువాడూ తెలుగు మాధ్యమంలోనే చదువుకోవాలి’ అనే నినా దంతో ముందుకురండి. ఆ ఉద్యమాన్ని చేపట్టండి. కనీసం ఒక ప్రకటన చేయగలరా? చేయలేరు.

ఇంగ్లిష్‌ మీడియం బడుల్ని పల్లెత్తు మాటనలేరు. ఇంగ్లిష్‌తో విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలకు నష్టం జరిగే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఎందు కంటే ఆ వ్యాపార సంస్థలు మన వాళ్లవి. అక్కడ చదువుకోవలసింది మన పిల్లలు. ఏమిటీ ద్వంద్వ నీతి? లెక్కలు, సైన్సు, సోషల్‌ ఇంగ్లిష్‌లో బోధిం  చినంత మాత్రాన తెలుగు అంతమైపోతుందా?

ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వాళ్లు మాత్రమే తెలుగును బ్రతికించాలా? ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివే సంపన్నులకు ఆ బాధ్యత లేదా? పైగా అంబేడ్కర్‌ అంత గొప్పవాడు కాలేదా? పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాలేదా? సీవీ రావు సైంటిస్ట్‌ కాలేదా? అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి కాలేదా? వారంతా వారి వారి మాతృభాషల్లో ప్రాథమిక విద్య అభ్యసించినవాళ్లే కదా అంటూ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లని ఉదా హరణగా చూపిస్తున్నారు.

ఇదెలా ఉందంటే కార్పొ రేట్‌ విద్యా సంస్థలు ఒకటి రెండు ర్యాంకులు చూపించి తమ వద్ద చదివితే అందరికీ ఇలాంటి ర్యాంకులు వస్తాయన్న భ్రమని కల్పించి దోచు కుంటున్నట్టుగా ఉంది. స్వయం ప్రతిభతో, అసా ధారణ మేధస్సుతో రాణించే వాళ్లకు ఇవేవీ వర్తిం చవు. పైగా వారు చదువుకునే రోజుల్లో ఊళ్లో ఒకే బడి ఉండేది. అందరికీ ఒకే సిలబస్‌ ఉండేది. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వృద్ధి చెందేవారు. 

ఇప్పుడా పరిస్థితి ఉందా? విద్యార్థి లోక మంతా నిట్టనిలువునా రెండుగా చీలిపోలేదా? సంపన్నులందరూ ప్రైవేట్‌ బడుల్లోకి, పేదలు, బలహీన వర్గాలూ ప్రభుత్వ బడుల్లోకి అనివా ర్యంగా నెట్టబడలేదా? ఈ విభజన ఎవరి ప్రయో జనం కోసం జరిగింది? ఈ తెలుగు వాదం చేస్తున్న పెద్దలెవరైనా వాళ్ల పిల్లల్ని ఒక్క సంవత్సరం ఆ బడుల్లో చదివించగలరా? తమిళ మాధ్యమంలో చదివిన వారికి తమిళులు 20 శాతం రాయితీ ఇస్తు న్నారు.

కన్నడిగులు 10 శాతం ఇస్తున్నారు. తెలు గుపైన అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వం వారి నెందుకు ఆదర్శంగా తీసుకోలేదు. ఇప్పుడు 90 శాతం మంది ప్రజల్ని పీడించి దోపిడీ చేస్తున్నాయి విద్య, వైద్య రంగాలు. వాటిని సమూలంగా సంస్కరించే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు 9 రకాల వసతులు సమకూరుస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. తెలుగు భాష బాగుండాలి అనేవారు అంతకంటే ముందు తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకోవాలి.


వ్యాసకర్త, 
పాటిబండ్ల ఆనందరావు,
మొబైల్‌ : 98498 98800.

మరిన్ని వార్తలు