-

ఎన్నాళ్లీ సందిగ్ధావస్థ?

4 Nov, 2017 01:42 IST|Sakshi

♦ జాతిహితం
మోదీ యువకునిగా ఉన్నప్పటి నుంచి స్వయంసేవకునిగా పనిచేశారు. ఆ మితవాద పెంపకం ప్రభావం మటుమాయమయ్యేది కాదు. కానీ, ఆయన నేడు ప్రపంచాన్ని చూస్తు న్నారు, ప్రపంచ నేతలను కలుస్తున్నారు. ఎక్కువ విజయవంతమైన ఆర్థిక వ్యవస్థలు పని చేసే తీరును గమనిస్తున్నారు. ఇవి ఆయనలో నయా ఉదార వాద ఆదర్శాన్ని స్వీకరించాలనే కోరికను రేపుతున్నాయి. కానీ, సామాజిక–మతపరమైన మితవాదం, నయా ఉదారవాదం పరస్పర విరుద్ధమైనవి. మోదీ ఆర్థిక చింతన చిక్కుబడిపోయింది ఆ రాజకీయాల్లోనే.

జోసెఫ్‌ హెల్లర్‌ నవల క్యాచ్‌–22 లోని హీరో లెఫ్టినెంట్‌ మైండర్‌బైండర్‌ తనతో తానే వ్యాపారం చేసి సుప్రసిద్ధుడయ్యాడు. అది, ఆ వ్యాపార లావా దేవీల చక్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చివరికి ప్రభుత్వ ఖజానా నుంచి లాభా లను ఆర్జించగలిగేలా చేసే పద్ధతి. ఇలాంటి పరిస్ధితి ఏదైనా, క్యాచ్‌–22 పరిస్థితిగా ప్రాచుర్యం పొందింది. సిండికేట్‌ అనే తన కంపెనీకి లాభం చేకూ రడం తప్ప మరేదీ మిలోకి çపట్టదు. సరిగ్గా ఆ కారణంగానే అతడు అత్యంత స్వార్థపూరితమైన పెట్టుబడిదారీ విధానానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యాడు. అతగాడు, ఏదైనా ఒక వస్తువును, సాధారణంగా ఒక గ్రామంలోని మొత్తం గుడ్లు లేదా టమాటాలను అన్నింటిని తానే కొనేసి, తన కంపెనీకే చెందిన మరో విభాగానికి గుత్తాధిపత్య ధరకు (అత్యధిక) అమ్మేసేవాడు.

ఒక్కసారి మాత్రమే, అతగాడు ప్రపంచంలో ఉన్న ఈజిప్షియన్‌ పత్తిని అంతటినీ కొనేసి చిక్కుల్లో పడ్డాడు. ఆ పత్తిని ఎవరో కొనేసి తనకే అమ్మినట్టు చేసినా, దాన్ని కొనేవారు ఎవరూ దొరకలేదు. దీంతో సృజనాత్మకమైన తెగిం పుతో పత్తి ఉండలను చాక్లెట్‌లో ముంచి, తోటి సైనికులకు అమ్మాలని సైతం ప్రయత్నించాడు. ఈజిప్షియన్‌ కాటన్‌ మార్కెట్‌కు గుత్త (ఏకైక) వ్యాపారిగా మారడం ద్వారా మిలోనే స్వయంగా ఆ పత్తికి మార్కెట్‌ లేకుండా చేశాడు.

అయితే ఆ మేధావి ఈ పరిస్థితి నుంచి బయటపడే దారిని కూడా కని పెట్టాడు. ఆ పత్తిని తన ప్రభుత్వానికే ఎందుకు అమ్మకూడదు? పక్కా పెట్టు బడిదారునిగా అతగాడు ప్రభుత్వం వ్యాపార వ్యవహారాలలో తలదూర్చ కూడరాదని నమ్మినవాడే. అమెరికా అధ్యక్షుడు కాల్విన్‌ కూలిడ్జ్‌ స్వేచ్ఛా విపణి సిద్ధాంతాలను నమ్మినవాడు. సరిగ్గా సమయానికి, కూలిడ్జ్‌ విసిరిన ఈ వ్యంగ్యోక్తి  మిలోకి అనువుగా దొరికింది: ‘‘ప్రభుత్వం పని (బిజినెస్‌కు పని, వ్యాపారం తదితర అర్థాలున్నాయి) ‘పని’లో ఉండటమే!’’ కూలిడ్జ్‌ మన అధ్యక్షుడు, ఆయన చెప్పారంటే అది తప్పక సరైనదే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వ్యాపారంలోకి దిగాలి అని అతగాడు భాష్యం చెప్పాడు (కూలిడ్జ్‌ ఉద్దేశించని అర్థాన్నే లాగాడు). కాబట్టి, ఈ పత్తిని అమెరికా ప్రభుత్వానికే ఎందుకు అమ్మకూడదు? గత్యంతరం లేని చర్యే కానీ..

మిలో స్థానంలో 1969 తర్వాతి భారత సర్కార్‌ను, ఈజిప్షియన్‌ పత్తి స్థానంలో భారత బ్యాంకులను ఉంచుదాం. ఇప్పుడు ప్రదర్శితమౌతున్న ఆర్థిక విధానాలను చూడండి. దేశంలోని ప్రధాన బ్యాంకులన్నిటినీ ఇందిరా గాంధీ మొదట జాతీయం చేసేసారు. అభివృద్ధికి సంబంధించిన ద్రవ్య (ఫైనాన్స్‌) సంస్థలు (ఒకప్పటి ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐఎఫ్‌సీఐ తదితరాలు) అన్నీ ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్నాయి. కాబట్టి బ్యాంకింగ్, ఫైనాన్స్‌ (ద్రవ్య) రంగాలలో ప్రభుత్వ గుత్తాధిపత్యం నెలకొంటుంది.

ఇక ప్రభుత్వం తన నుంచి తానే కొనడం ప్రారంభిస్తుంది: ప్రభుత్వం, తను జారీ చేసిన సొంత బాండ్లపై బ్యాంకులు పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. తమ సొంత ప్రాజె క్టులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూలకు) రుణాలు ఇప్పిస్తుంది, రుణ మేళాలను  నిర్వహించేలా చేస్తుంది. చివరకు రుణ మాఫీలు చేయి స్తుంది. కాబట్టి బ్యాంకులపై దాని గుత్తాధిపత్యం ఆచరణలో ఎదురేలేని ఓట్లను కొనే వ్యాపారం కూడా అవుతుంది. ఈ క్రమంలో బ్యాంకులు క్రమం తప్పకుండా కొంత కాల వ్యవధితో దివాలా తీయడం కొనసాగుతుంది. 

బ్యాంకులన్నీ ప్రభుత్వానివే కాబట్టి, అవి దివాలా తీయడాన్ని అనుమ తించడానికి వీల్లేదు. ప్రభుత్వం విఫలం కావడానికి వీల్లేనంతటి పెద్దది. దానికి పన్నులు విధించే, నోట్లు ముద్రించే అధికారం ఉంది. కాబట్టి, ప్రభుత్వం తన బ్యాంకులను తానే మళ్లీ కొంటుంది (రీకాపిటలైజేన్‌ లేదా కొత్త పెట్టుబడిని సమకూర్చడం). ద్రవ్యలోటు పరిస్థితి బాగా లేదని అనిపిం చకుండా ఈ వ్యవహారం బడ్జెట్‌తో సంబంధం లేకుండా సాగిపోయే పద్ధతీ ఉంది. మీరు మీ బ్యాంకుల చేత బాండ్లను జారీ చేయిం చవచ్చు. మీ ఇతర కంపెనీలైన ప్రభుత్వరంగ సంస్థల చేత, వాటి వద్ద ఉన్న మిగులు నగదుతో మీ బ్యాంకుల బాండ్లనే మీరు కొనిపించవచ్చు. ఇప్పుడు చెప్పండి, మన ప్రభుత్వం మిలో మైండర్‌బైండర్‌ కంటే తెలివైన పెట్టుబడి దారా, కాదా? మిలో ఆర్థికనీతి క్యాచ్‌–22 అయితే, భారత ప్రభుత్వ ఆర్థికనీతి క్యాచ్‌–23 (ఈ అతి తెలివిలో మన ప్రభుత్వం మిలో కంటే రెండాకులు ఎక్కువ చదివింది).

తాజాగా ప్రభుత్వం ప్రకటించిన బెయిలవుట్‌ పథకాన్ని ప్రశంసించిన నేనే, దాన్ని క్యాచ్‌–23 అంటూ ఇలా ఎద్దేవా చేయడం ఎలా సమంజసమని ప్రశ్నించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైన పని అది ఒక్కటే. రోగి తీవ్రమైన ఉబ్బసపు పోటుకు గురై ఊపిరిసలపక మరణించే స్థితిలో ఉంటే, మీరే డాక్టరైతే ఏం చేస్తారు? స్టెరాయిడ్‌ల వల్ల కలిగే దుష్ప్రభావాలను పట్టిం చుకోకుండా, రోగి శరీరంలోకి వాటిని ఎక్కించడం తప్ప ఏం చెయ్యగలరు?  దేశ బ్యాంకింగ్‌ పరిశ్రమలో 70 శాతం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉన్న పరిస్థితిలో, అవి దాదాపుగా దివాలా తీసే స్థితిలో అవి కుప్పకూలడం అనివార్యంగా కనిపిస్తున్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? బ్యాంకింగ్‌ వ్యవస్థను కుప్పకూలిపోనిచ్చి, ఆ శిథిలాలను ఏరుకుంటారా? ఏదైనా చేయక తప్పని పరిస్థితిలో బెయిలవుట్‌ నిర్మయాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయం. అంతేకాదు, కొంత సృజనాత్మకమైనది అని కూడా జోడించనివ్వండి. భారీ ఎత్తున నిధులను సమకూర్చుకోడానికి బాండ్లను జారీ చేయాలనేది తెలివైన యోచనే. కానీ, భారీ నగదు నిల్వలున్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ బాండ్లను కొనాలని సంకేతం ఇవ్వాలనే సూచనే ఆందోళనకరమైనది.

సంస్కర్తగా గుర్తుండిపోవాలని అనుకుంటున్నారా?
ఇంతకంటే సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన, సంస్కరణవాద చర్యలు కూడా ఎంచుకోడానికి ఉన్నాయి. గొప్ప నాయకులు సంక్షోభాన్ని ఎప్పుడూ వృథా చేసుకోరు. కానీ మోదీ అలాంటి అవకాశాన్ని చేజార్చు కున్నారు. ఇందిరా గాంధీ నుంచి సంక్రమించిన ఆర్థిక వారసత్వంలోకెల్లా అత్యంత అధ్వానమైన ది బ్యాంకుల జాతీయకరణ. దాన్ని పూర్తిగా వెనక్కు మరల్చాలనడం అసమంజసం. అయినా, ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిన చిన్న ప్రభుత్వరంగ సంస్థలను, కేవలం రెండింటిని అమ్మేయడం ద్వారా ఆయన ఆ ప్రక్రియకు నాంది పలకాల్సింది.

ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి  అధ్వానంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ఏడాదికి ఒకటిగా అమ్మేస్తామని ప్రకటించాల్సింది. అది మార్కెట్లను మెరుపు వేగంతో స్పందించేలా ప్రభావితం చేసేది. ఇతర బ్యాంకులకు, అవి మెరుగ్గా నడుచుకునేలా చేసే, ఓట్లను కొనుక్కోవడానికి ప్రభుత్వ ఖజానా చెక్కులను రాసే రాజకీయ వర్గం నిగ్రహం చూపేలా చేసే పెద్ద కుదుపై ఉండేది. మోదీ పేరు గొప్ప సంస్కర్తల సరసన నిలిచే లా చేసేది. కానీ మోదీ, తాను ఆర్థిక సంస్కర్తగా గుర్తుండిపోవాలని నిజంగానే కోరు కుంటున్నారా? ప్రభుత్వరంగ సంస్థలను సక్రమంగా నడపడానికి కట్టుబ డటం లేదా ప్రభుత్వం వ్యాపార లావాదేవీలను జరపడం సంస్కరణలకు ఒక ముఖ్యమైన గీటురాయే తప్ప, ఏకైక గీటురాయి కాదు. మన్మోహన్‌సింగ్, పీవీ నరసింహారావు, పీ చిదంబరం సహా ఏ జాతీయ నేతా ప్రభుత్వరంగ సంస్థ లను, ప్రత్యేకించి లాభాలను ఆర్జిస్తున్న వాటిని అమ్మే సాహసానికి ఒడిగట్ట లేదు. 

స్వాభావికంగానే అలాంటి నిబద్ధత ఉన్న ఏకైక నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి. రెండు భారీ చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన ప్రయత్నించారు. కానీ ఒక సుప్రీం కోర్టు ఆదేశం.. పార్లమెంటు ఆమోదం లేనిదే ఆ పని చేయరాదని అడ్డుకుంది. మోదీ, వాజపేయి చూపిన మార్గాన వెళతారని ఆశించి ఉండొచ్చు. కానీ, ఆయన చేస్తున్నది ఏమిటి? హెచ్‌పీసీఎల్‌ను అమ్ముతున్నారు. కానీ దాన్ని అమ్ముతున్నది సొంత ఓఎన్‌జీసీకే. మరోసారి ఇప్పుడు ప్రభుత్వ ధనంతో... మిలో, మిలోతేనే వ్యాపారం చేయడం జరుగుతుంది. అదే క్యాచ్‌–23. పొసగని వైరుధ్యంతోనే తంటా

1991 నుంచి చాలా వరకు సంస్కరణలు దొడ్డిదారిన అమలుచేస్తూ వచ్చారు, కానీ నేడు ప్రతిదీ ప్రజల కళ్ల ముందే జరుగుతోందని, వాటి రాజకీయ పర్యవసానాలు ఉంటాయని మోదీ మద్దతుదార్లు అనవచ్చు. ప్రజాభిప్రా యాన్ని సానుకూలంగా మల^èడానికి మోదీని మించిన శక్తిసామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? అందువలన, ఆయన ఎందుకు చేయడం లేదు? అసలు ఆయన అలా చేయాలనుకుంటున్నారా? లేకపోతే, ఆయన చేయాలనుకుంటు న్నది సరిగ్గా ఏమిటి? వాటికి సమాధానాలు రాజకీయాల్లో ఉన్నాయి. వాజ్‌ పేయికి భిన్నంగా, మోదీ నిబద్ధతగల స్వయంసేవకుడు, ఆయనలా పాత ఆర్‌ఎస్‌ఎస్‌ సామా జిక–ఆర్థిక నీతి బాల్యావస్థను చూసి నవ్విపారేసేవారూ కారు. ఆ భావజా లంలో నిజమైన విశ్వాసం ఉన్నవారు. తాను మోహన్‌ భాగవత్‌ వంటి స్వయం సేవకుడిననే భావన జీర్ణించుకుపోయిన వారు. 

వాజ్‌ పేయిలాగా ఆధునిక సంస్కర్తగా గుర్తుండిపోవాలని కూడా అనుకుంటు న్నారు. ఈ రెండింటి మధ్యా ఆయన చివరకు మరో ఇందిరా గాంధీగా, మరో గొప్ప ప్రభుత్వ నిర్ణాయకవాదిగా మిగిలిపోతారు. గొప్ప ఆర్థిక జాతీయవాది మోదీ.. నియంత్రణల పట్ల వ్యామోçహం విస్తరిస్తున్న, పెరుగుతున్న ప్రభు త్వానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన మదిలోని రాజకీయ–ఆర్థిక చింతన ఇది కావచ్చు: మనం ప్రభుత్వాన్ని  వివేకవంతంగా, నిజాయితీగా నడుపుతు న్నంత కాలమూ... అది ఆర్థిక వ్యవస్థను నడపడంలో ఎలాంటి తప్పూ లేదు. లోపరహితమైన రాజ్యం కోసం జరిపే అన్వేషణ ఎన్నడూ సఫలం కాలేదు. ఇప్పుడూ జరగపోవచ్చు.

మోదీ యువకునిగా ఉన్నప్పటి నుంచి స్వయంసేవకునిగా పనిచేశారు. ఆ మితవాద పెంపకం ప్రభావం ఆవిరి అయిపోయేది కాదు. కానీ, ఆయన నేడు ప్రపంచాన్ని చూస్తున్నారు, ప్రపంచ నేతలను కలుస్తున్నారు, ఎక్కువ విజయవంతమైన ఆర్థిక వ్యవస్థలు పనిచేసే తీరు కూడా ఆయనలో నయా ఉదారవాద ఆదర్శాన్ని స్వీకరించాలనే కోరికను రేపుతోంది. కానీ, సామా జిక–మతపరమైన మితవాదం, నయా ఉదారవాదం అనే ఈ రెండు శక్తులూ పరస్పర విరుద్ధమైనవి. అవి సహజీవనం చేయలేవు. మోదీ ఆర్థికచింతన చిక్కుబడిపోయింది ఆ రాజకీయాల్లోనే. ఆయన సందిగ్ధాన్ని ఏమని పిల వాలి? క్యాచ్‌–24 రాజకీయాలు అని పిలవాలని నా సూచన.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు