ఫిడేల్‌ నాయుడు గారు

2 Nov, 2019 01:28 IST|Sakshi

అక్షర తూణీరం

1914 ప్రాంతంలో విశాఖపట్నం ‘మై ఫ్రెండ్స్‌’ సంఘంలో ఓ ఇరవైయేళ్ల కుర్రాడు సుశ్రావ్యమైన గోష్ఠి చేస్తే, అతడి వాయులీన వైదుష్యాన్ని మెచ్చుకొని మారేపల్లి రామచంద్ర శాస్త్రి బంగారపు ఉంగరం వేలికి తొడుగుతూ ఆ విద్వాంసుడికి ‘ఫిడేలు నాయుడు’ అని నామకరణం చేశారు. తదాది ఆ వేలికి ఉంగరం, ఆ వ్యక్తికా పేరు స్థిరంగా ఉండిపోయాయి. తర్వాత ద్వారం వేంకట స్వామి నాయుడుగారు విజయనగరం కోటలో కచేరి చేసినపుడు, ఆస్థాన విద్వాంసుడు ఆదిభట్ల నారాయణ దాసు విని వివశుడై ‘జీనియస్‌’ అంటూ ఆరున్నర శృతిలో అన్నారట. చివరిదాకా ఆదిభట్ల ఆ మాట మీదే ఉన్నారు. అంతకుముందు సంగీతంలో మెలకువలు, పైసంగతులు నేర్వాలని ద్వారం విజయనగర సంగీత పాఠశాల ద్వారంలో నిలబడితే– ఆయన వేదనని, వాదనని విని ‘నువ్వు గురు స్థానంలో ఉండాల్సిన వాడివి’ అంటూ విజయనగరం సంగీత కళాశాల ఉచితాసనమిచ్చి కూర్చోబెట్టింది. వజ్రం వెతకదు, వెతకబడుతుంది. ఆధార షడ్జమంలోనే నాయుడు ‘రవ’ళిం పుని జాతి పసిగట్టింది. ఇక తర్వాతిదంతా చరిత్ర. 

‘ఈ చిన్న కర్రముక్కని చేతికిచ్చి ఈ సంగీత సముద్రం ఈదమన్నాడు దేవుడు. నావల్ల ఏమవుతుంది?’ అని భయపడుతూనే సంగీత సాగరంలో లక్షలాదిమందిని ఓలలాడించి ధన్యులయ్యారు ఫిడేలు నాయుడుగారు. ఆయన సిద్ధుడు. అనితర సాధ్యమైన సాధనతో వాయులీనాన్ని పూర్తిగా వశపరచుకుని గుండెలకు హత్తుకుని వాయులీన అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. రాగ ప్రస్తా రాన్నిబట్టి మొహమల్‌ వస్త్రంమీద ముత్యాలు జారినంత మృదువుగా ఉక్కుతీగెలను పలికించగలరు. కొన్ని సందర్భాలలో పున్నాగ పరిమళం శ్రోతల్ని కమ్ముకుంటుంది. ఆయన ఉన్న రోజుల్లో దక్షిణాది ప్రజ హారతులు పట్టింది. దేశం ఫిడేలు నాయుడు గారిని గుర్తించింది.

1957లో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. అప్పటికే ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాలు అందుకున్నారు. పౌర సన్మానాలు, దర్బారు ఆహ్వానాలు లెక్కకుమించి జరిగాయి. గాంధర్వ విద్యాభూషణ, గానకళా విశారద, సంగీత కళానిధి, డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం) నాయుడుగారిని అలంకరించాయి. 1950లో ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణతో గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన సంగీత విద్వాంసునిగా నియమించి రాష్ట్రం సత్కీర్తి పొందింది. ద్వారం వారికి శాస్త్రీయ కృతుల నుంచి జానపదాల వరకు అన్నీ ఇష్టమే. వయొలిన్‌పై ఎంకి పాటలకు శాశ్వతత్వం తెచ్చారు. అన్నిటికన్నా మిన్నగా ‘రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ’ అన్న కృతిని కదన కుతూహల రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యరుగారు వ్యాప్తిలోకి తెచ్చారు. మహాకవి శ్రీరంగం నారాయణ బాబు ద్వారంకి హితులు, సన్నిహితులు. నారాయణ బాబు ద్వారంపై రాసిన కవితలో– ‘నాయుడుగారూ/ మీ వేళ్లు/ ఘన రాగ పంచకం/ మీ శరీర/ మాకాశం/ మీ హస్తం/ హరివిల్లు/ చిత్ర చిత్ర వర్ణాలు/ శ్రీవారి వేళ్లు/’ అంటూ కొనసాగించారు. ఆనాటి మహా కవులలో విశ్వనాథ, జాషువా, తుమ్మల ఫిడేలు నాయుడుగారిని ప్రస్తుతిస్తూ పద్యాలు చెప్పారు. 

చమత్కారంగా మాట్లాడుతూ, మధ్య మధ్య చుట్ట పొగ సుతారంగా పీలుస్తూ చూడవచ్చిన వారిని పాటలతోనే కాక మాటలతో కూడా ముగ్ధులను చేసే నైజం నాయుడు గారిది. మీ కచేరీ వేళ రెండు పాములు ఆడాయని చెబితే అది నేల మహత్యం అన్నారు. మీరు దీపక రాగం వాయిస్తే అక్కడ వస్త్రాలు అంటుకున్నాయండీ అంటే పాపం ఎవరో బీడీయో చుట్టో కాలుస్తూ ఏమరుపాటున ఉండి ఉంటారు అన్నది ఆయన తీర్మానం. ఆయనొకసారి వయొలిన్‌ని శృతి చేసుకుని, కమాన్‌ని కూడా పరిక్షించుకుని పక్కన పెట్టారట. వెంటనే నిండు సభ కరతాళ ధ్వనులతో మార్మోగిందట. నమ్మకం కుదిరితే అలాగ ఉంటుందన్నారు నాయుడుగారు. 

‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్‌/ దేవతా స్త్రీ కంఠ దీప్తరావమ్ములో/ పారిజాతామోద భావమ్ములో/ సురనీద్‌ జీవమ్ములో/ ఈ వాయులీన సాహిత్య సాహిత్యముల్‌/ పలుకరించిన తొట్రుపాటెరుంగని యట్టి/ పలుకులో కలకండ పలుకులో/ చిరునవ్వు మొలకలో...’ – విశ్వనాథ 
మనకి కూడా ఫిడేలు నాయుడుగారి స్మృతి చిహ్నం విధిగా ఉండాలి. ఈ నెల 8న ద్వారం వారి జయంతి. ఆరోజున నాయుడుగారి జ్ఞాపకాలతో ఒక విశేష సంచిక ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి చేతులమీదుగా విడుదల అవుతుంది. ఉదయం 11 గంటలకు వీవీఐటీ ప్రాంగణం, నంబూరు (గుంటూ రు)లో జరిగే ఈ సభకు అందరూ ఆహ్వానితులే.


- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు