ఆంగ్లంతో తగ్గనున్న అంతరాలు

27 Nov, 2019 00:54 IST|Sakshi

అభిప్రాయం

పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు వినూత్న రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020–21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన జరగాలని ఇచ్చిన ఆదేశాలపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం పరాకాష్టకు చేరింది. వీరి లక్ష్యం ఒక్కటే.. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మేలుకోసం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని గుడ్డిగా వ్యతిరేకించడమే.  

ప్రతిపక్షనేతగా జగన్‌ చేపట్టిన చారిత్రక ప్రజాసంకల్ప పాదయాత్రలో అన్ని జిల్లాలకు చెందిన అత్యంత సామాన్య ప్రజలు తమ ఈతిబాధలు చెప్పుకొన్నారు. అందులో ప్రధానమైనది ప్రభుత్వబడుల దీనావస్థ ఒకటి. ప్రభుత్వబడుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్య కాగా.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని డిగ్రీ, పీజీ వరకూ చదువుకొన్నా.. ఇంగ్లిష్‌ భాషాపరంగా తగిన నైపుణ్యాలు లేక, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడలేక ఉద్యోగాలు పొందలేకపోతున్న వాస్తవాన్ని గ్రామీణ యువత ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగడానికి రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు, విద్యుత్, విద్యార్థులకు బల్లలు లాంటి 9 రకాలైన మౌలిక సదుపాయాలను కలుగజేయాలని నిశ్చయించుకున్నారు.   

సీఎం నిర్ణయంలోని హేతుబద్ధతను గుర్తించకుండా కొందరు ‘భాషాభిమానులం’ అనే పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వబడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే.. మత మార్పిడికి దారితీస్తుందనే అనాగరిక, అసమంజసమైన దుష్ప్రచారానికి కూడా ఒడిగడుతున్నారు.  నిజానికి, దేశానికి స్వాతంత్య్రం లభించిన గత 7 దశాబ్దాలలో తెలుగునాట విద్యారంగానికి పట్టిన దుర్గతి ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులకు అనుభవమే. దేశంలోని చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగా బడుగు, బలహీనవర్గాలు, దళితులు ఏవిధంగానైతే అవమానాలు పడి అన్ని రంగాలో అవకాశాలు కోల్పోయారో.. విద్యారంగంలో ఏర్పడిన ఓ నయా చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల పేదలు, అణగారిన వర్గాలు తీవ్రంగా నష్టపోయారు.. పోతున్నారు కూడా! మరింత విపులంగా చెప్పాలంటే.. ఇప్పటి విద్యావ్యవస్థ 4 రకాల విద్యార్థులను తయారు చేస్తోంది.  

సంపన్నుల పిల్లలు లక్షల రూపాయల ఫీజులు చెల్లించి.. ఉన్నత బాహ్యప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదువుకొంటున్నారు. ఎగువ, మధ్యతరగతి వర్గాల వారు తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను బోధించే ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఫీజుల భారం తలకుమించిందే అయినా.. తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ లభిస్తుందనే ఆశతోనే ప్రైవేటు కాన్వెంట్లకు పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వారుసైతం తమ పిల్లల్ని 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాసరే ప్రైవేటు స్కూళ్లకే పంపుతున్నారు. ఇక మూడవ వర్గానికి చెందిన పేదలు, సాధారణ ఆర్థిక పరిస్థితి గలిగిన వారు తమ పిల్లల్ని.. అరకొర మౌలిక సదుపాయాలు గలిగిన తెలుగు మీడియం బోధించే ప్రభుత్వ స్కూళ్లకు పంపుతున్నారు.

ఇక 4వ వర్గానికి చెందిన అత్యంత నిరుపేదలు, రోజువారీ కూలీపై ఆధారపడిన వారు, స్థిరనివాసం అనేది  లేకుండా సంచార జీవితం గడిపేవారు తమ పిల్లల్ని ఏ పాఠశాలకూ పంపలేకపోతున్నారన్నది ఓ చేదు వాస్తవం.  ఈ విధంగా మన విద్యా వ్యవస్థ నాలుగు రకాలైన భావిభారత పౌరుల్ని తయారు చేస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పోటీ పడినప్పుడు ఈ వర్గాల వారిలో ఎవరు ముందుం టారో.. ఎవరు అవకాశాలను దక్కించుకుంటారో ప్రత్యే కంగా చెప్పాల్సిన అవసరం లేదు.  

ప్రైవేటు విద్యను మొత్తం గంపగుత్తగా ఒకట్రెండు విద్యాసంస్థలకు దఖలు పర్చడానికి లోపాయికారీగా ఉపయోగపడిన వారే ఇంగ్లిష్‌ మీడియంను ప్రభుత్వం బడుల్లో ప్రవేశపెట్టడం ఓ ఘోరమైన అపరాధంగా చిత్రీకరిస్తున్నారు. నిజానికి, విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరిగాక కార్పొరేట్‌ స్కూళ్లలో, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ బడుల్లో చదివేవారికంటే ఎక్కువగా ఉంది. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతున్నప్పటికీ.. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో, ఇంటిలో మాతృభాషలోనే మాట్లాడతారు. పైగా వారికి తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుంది. తెలుగు భాషను నేర్పించే ఓరియంటల్‌ కాలేజీలు ఉన్నాయి. తెలుగు పండిట్‌ కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి. కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలుగు భాషకు ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేదు. పైగా, ఆంగ్లభాష ప్రవేశపెట్టడంతో మాతృభాష నేర్చుకోకూడదనే ఆంక్షలు ఎక్కడా ఉండవు. 

మారిన పరిస్థితుల నేపథ్యంలో.. బహుభాషలను నేర్చుకోవడం ఓ అనివార్యత. మాతృభాషలో విద్యా బోధన జరిగితేనే పిల్లల్లో మనోవికాసం కలుగుతుందని, ఒకప్పటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల్లో రాణించిన ప్రముఖులందరూ తెలుగులో చదువుకోవడం వల్లనే ఆ స్థాయికి చేరుకొన్నారని వాదిస్తున్నారు. వారి వాదన నిజమే అయితే, విద్యావ్యాపారాన్ని ప్రోత్స హించడంలో భాగంగా మారుమూల పల్లెల్లో సైతం కాన్వెంట్‌ బడుల ఏర్పాటునకు ప్రభుత్వాలు అనుమతించినపుడు... ఈ భాషాభిమానులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలుగు రాష్ట్రంలో బోధన తెలుగులోనే జరగాలని ఎందుకు ఉద్యమించలేకపోయారు? 

ద్వంద్వ ప్రమాణాలకు ప్రతీకగా తమ పిల్లల్ని ఎల్‌కేజీ స్థాయి నుండే ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఎందుకు చదివించినట్లు? మాతృభాషలో చదివించి గొప్ప వారిని చేయాలన్న తపన వారిలో లేదా? ఆంగ్ల మాధ్యమంలో చదివించి చవటల్ని చేద్దామనుకొన్నారా? ప్రాథమిక స్థాయిలోనే పిల్లలు పలు భాషలను తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. పునాది  స్థాయిలో ఇంగ్లిష్‌ను తగిన విధంగా నేర్చుకోలేని విద్యార్థులు  డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చివరకు డాక్టరేట్‌ పూర్తి చేసినా.. ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ కోర్సుల్లో చేరడం కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వ బడుల్లో చదివే పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకే ప్రభుత్వబడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారన్నది నిర్వివాదాంశం. ఎన్నికలలో ప్రజలు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలకు, ముఖ్యంగా నవరత్నాలకు పట్టం కట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సీఎం బాధ్యత. ఇప్పుడు జరుగుతున్నది అదే!

వ్యాసకర్త: డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి, చీఫ్‌ విప్, ఏపీ శాసనమండలి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా