ఏటీఎంలలో చోరీ: రూ.43లక్షలు ఖాళీ

15 Dec, 2015 19:08 IST|Sakshi
ఏటీఎంలలో చోరీ: రూ.43లక్షలు ఖాళీ

బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) : వర్ని, కోటగిరి మండలాల్లోని ఏటీఎంలపై మహారాష్ట్రకు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. నాలుగు ఏటీఎంలపై గురిపెట్టి ఏకంగా రూ.43,32,000లను ఎత్తుకెళ్లారు. వర్ని మండలం రుద్రూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎస్‌బీఐకు చెందిన ఏటీఎంలో చొరబడిన దొంగలు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌లతో షట్టర్‌ను తొలగించి లోపలికి చొరబడ్డారు. ఏటీఎంకు ఇరువైపుల గ్యాస్‌కట్టర్‌తోనే తొలగించి, క్యాష్ ట్రేను ఎలా ఉంటే అలా ఎత్తుకెళ్ళారు.ఆ క్యాష్ ట్రేలో సుమారు రూ.31.48లక్షల నగదు ఉంది.

అనంతరం పక్కనే బస్టాండ్ వద్ద ఉన్న ఇండియన్ ఏటీఎంలో చొరబడిన వీరు అందులో ఏటీఎం ధ్వంసానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడి నుంచి నేరుగా కోటగిరి మండల కేంద్రానికి వెళ్ళి, అక్కడ ఉన్న ఎస్‌బీహెచ్ ఏటీఎంలోకి చొరబడి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్‌తోనే తమ పని పూర్తి చేశారు. దానిలో రూ.9.50లక్షల రూపాయలను ఎత్తుకెళ్ళారు. అనంతరం పక్కనే ఉన్న ఇండియన్ ఏటీఎంలోకి చొరబడి, అందులోని రూ. 2.34లక్షల నగదును దోచుకెళ్ళారు. ఇలా మొత్తం 43.32లక్షల సొత్తుతో ముఠా పారిపోయింది.

ఏటీఎంలలో చోరీ జరిగిన విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియరాలేదు. చోరీ జరిగిన విషయం తెలుసుకొన్న పోలీసులు ఖంగుతిన్నారు. ఈ చోరీలు మొత్తం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటలలోపే జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా తెలిసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలుసుకొన్న నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పనేనని, మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు మేరకు వర్నీ, కోటగిరి ఎస్సైలు కేసులను నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు