ఏటా 10 వేల గల్ఫ్ ఉద్యోగాలు

1 Apr, 2016 06:54 IST|Sakshi
ఏటా 10 వేల గల్ఫ్ ఉద్యోగాలు

♦ టామ్‌కామ్ బలోపేతం దిశగా కార్మికశాఖ అడుగులు
♦ మూడు దుబాయ్ కంపెనీలతో 1,050 ఉద్యోగాలకు ఒప్పందం
♦ గల్ఫ్ కంపెనీలతో మరిన్ని ఒప్పందాలు చేసుకునే యోచన
♦ అవకతవకలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక
 
 సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఏటా పదివేల మంది రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదికూడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రభుత్వ ఆధీనంలోనే జరిగేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీస్ (టామ్ కామ్)’ను బలోపేతం చేసేందుకు కార్మికశాఖ కృషి చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశం కల్పించే అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది.

అభ్యర్థులు నేరుగా టామ్‌కామ్ వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లోని మూడు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 1,050 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. అల్‌జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ 250 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ విధంగానే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని టామ్‌కామ్ యోచిస్తోంది.

 డేటాబేస్ ఏర్పాటు చేసే యోచన
 గల్ఫ్ దేశాల్లో పనిచేయాలనుకుంటున్న వారి వివరాలన్నింటినీ ఒక డేటాబేస్ రూపంలో ఏర్పాటు చేయాలని టామ్‌కామ్ భావిస్తోంది. గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రైవర్లు, భవన నిర్మాణం తదితర రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉంచాలనే యోచనతో ఒక డాటాబేస్ తయారు చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా త్వరలోనే టామ్‌కామ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తులు ఆహ్వానించనున్నారు. విద్యార్హత, అనుభవం తది తర వివరాలను విడిగా రూపొం దించి కంపెనీలకు అందజేస్తారు. అలాగే దరఖాస్తుదారులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని... ముఖ్యంగా గల్ఫ్ చట్టాలు, అక్కడి విధానాలపై అవగాహన కల్పించాలని యోచిస్తున్నారు.
 
 దళారీ వ్యవస్థకు చెక్
 తెలంగాణ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాల కోసం భారీ సంఖ్యలో వెళుతుంటారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన వారు దాదాపు ఆరు లక్షల మంది ఉంటారని ప్రభుత్వ వర్గాల అంచనా. ఒక్క 2015లోనే 50 వేల మంది రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వెళ్లినట్లు భావిస్తున్నారు. ఇలా గల్ఫ్‌కు డిమాండ్ ఉండడంతో మధ్య దళారులు, నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. దళారుల మాయమాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా, దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్ ప్రణాళికలు రూపొందించారు. టామ్‌కామ్ ద్వారా గల్ఫ్‌లో ఉద్యోగాలు పొందిన వారికి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక సమన్వయకర్తను కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు