రంగంలోకి దిగుతున్న అమిత్ షా

19 Feb, 2016 09:37 IST|Sakshi
రంగంలోకి దిగుతున్న అమిత్ షా

‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ప్రణాళిక
జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో 3 ప్రాంతాల్లో సభలు

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు రాష్ట్రానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ఒక భారీ ప్రచార ప్రణాళికను ఆయన రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు.
 
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ప్రతి పైసా, ప్రతి అనుమతీ ప్రజల ముందు పెట్టడమే ఈ ప్రచార ప్రణాళిక లక్ష్యం. మార్చి ఆరో తేదీన రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో జరిగే పార్టీ బహిరంగ సభ నుంచే అమిత్‌షా ఈ ప్రణాళికను అమలులో పెట్టబోతున్నారు. ఈ సభ తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో జరిగే పార్టీ బహిరంగ సభల్లోనూ అమిత్‌షా పాల్గొంటారు.
 
 వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తోన్న అర్థిక సహాయం నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ‘నీరు- చెట్టు’ కార్యక్రమానికి కేంద్ర నిధులు ఎంత అందుతున్నాయన్న వంటి వివరాలను అమిత్‌షా బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించి చెబుతారు. 2016 సంవత్సరంలోనే అమిత్‌షా రాష్ట్రంలో మూడు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 ఈ ఏడాది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 37 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. వారందరి మొబైల్ ఫోన్లకు రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం వివరాలు నిత్యం ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడానికి వీలుగా రాష్ట్ర పార్టీ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమిత్‌షా సూచించారు.
 

మరిన్ని వార్తలు