అనగనగా నీలిరంగు బైకు..

21 Jul, 2017 11:05 IST|Sakshi
అనగనగా నీలిరంగు బైకు..

అతడో దొంగ. పోలీసులకు చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా పట్టుబడి ఊచలు లెక్కిస్తున్నాడు. అతడు కొత్తగా కొన్న నీలం రంగు హోండా లివో బైకే పట్టించింది. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ బైకులు నగరంలో 148 అమ్ముడైనట్లు గుర్తించారు. వీటిలో నీలం రంగువి 19 మాత్రమేనని గుర్తించారు. దీంతో దొంగ దొరికాడు.

చిలకలగూడ : నీలం రంగు లీవో బైక్‌ అతని లైఫ్‌ మార్చేసింది. స్నాచింగ్‌ చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అతను వినియోగించిన నూతన వాహనమే తనని పట్టిస్తుందని ఊహించలేక జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. సీసీ కెమెరాల పుటేజీ సహాయంతో స్నాచింగ్‌ కేసును చేధించారు చిలకలగూడ పోలీసులు.. వివరాల్లోకి వెళితే.. ఈనెల 17న సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న మహిళ నీరజ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని వాహనంపై వెనుకనుంచి వచ్చిన అగంతకుడు తెంపుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఆర్ట్స్‌కాలేజీ వైపు నుంచి నీలంరంగు బైక్‌పై వచ్చిన స్నాచర్‌ దృశ్యాలు నమోదు అయ్యాయి. ముఖానికి హెల్మెట్, వీపుకు స్కూల్‌ బ్యాగు, వాహనానికి నంబర్‌ లేకపోవడంతో అతడి ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు బైక్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉపయోగించిన నీలంరంగు వాహనం నూతనంగా మార్కెట్‌లోకి వచ్చిన హోండా లివోగా గుర్తించారు.  దీంతో హోండా లివో ప్రతినిధులను సంప్రదించగా, రాష్ట్ర వ్యాప్తంగా 556, నగరంలో 148 బైక్‌లు అమ్ముడైనట్లు తెలిపారు, నగరంలో అమ్మిన బైకుల్లో నీలంరంగువి కేవలం 19 మాత్రమేనని గుర్తించారు. డీఐ కావేటి శ్రీనివాసులు, డీఎస్‌ఐ వెంకటాద్రిల నేతృత్వంలో రెండు బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ క్రమంలో మాణికేశ్వర్‌నగర్‌ వద్ద నీలంరంగు హోండా లివోపై వస్తున్న యువకుడిని ఆపి తనిఖీ చేయగా జేబులో స్నాచింగ్‌ చేసిన  బంగారు ఆభరణాలు దొరికాయి. నల్గొండజిల్లా పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రాజేష్‌ కొద్దినెలల క్రితం ప్రేమవివాహం చేసుకుని, మాణికేశ్వర్‌నగర్‌లో భార్యతో కలిసి ఉంటున్నాడు. వాయిదాల పద్ధతిలో హోండా లివో బైక్‌ తీసుకున్న అతడు పనిచేస్తున్న సంస్థ మూసివేయడంతో ఉద్యోగం పోయింది. ఇంటి కిరాయితోపాటు వాయిదాలు చెల్లించలేని స్థితిలో స్నాచింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. బౌద్ధనగర్‌తోపాటు మైలార్‌దేవ్‌పల్లిలో స్నాచింగ్‌లు చేసి తిరిగి వస్తూ బైక్‌ ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

మరిన్ని వార్తలు