ఎలా చెప్పం ‘తల్లీ’... నీ బిడ్డను తిరిగివ్వలేమని!!

21 Nov, 2014 00:20 IST|Sakshi
ఎలా చెప్పం ‘తల్లీ’... నీ బిడ్డను తిరిగివ్వలేమని!!

చిక్కడపల్లి డీడీ కాలనీలో కారు ఢీకొనడంతో గురువారం ఓ కోతి పిల్ల మృతి చెందింది. తన బిడ్డ చనిపోయిందని తెలియని తల్లి దాని కోసం ఎంతో తపించింది. బిడ్డను భుజాన వేసుకొని వాడంతా తిరిగింది.
 
మాతృత్వపు మమకారం... అమ్మతనంలోని కమ్మదనం...ఈ మాటలకు అచ్చమైన అర్థమై నిలుస్తోందీ మర్కటం. తన బిడ్డలో జీవం లేదని...ఓ వాహనం దానిని పొట్టన పెట్టుకుందని... ఎంత లేపినా ఇక లేవలేదని తెలియని ఆ మాతృ హృదయం... బిడ్డ విశ్రమిస్తుందని అనుకుందేమో... తనను నిద్ర లేపాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఆర్తిగా గుండెలకు హత్తుకుంటోంది. తలలో పేలు చూస్తోంది. కాళ్లూ చేతులూ లాగుతూ... కదిలించే ప్రయత్నం చేస్తోంది. తట్టి లేపుతోంది. చలనం లేని ఆ కూనను పట్టుకొనే చెట్ల పైకి...భవంతుల పైకి చేరుతోంది. ఏ క్షణమైనా లేచి...తనతో ఆడుకుంటుందని అనుకుంటుందేమో...గంటల తరబడి ఆశగా కూనవైపే చూస్తూ గడుపుతోంది. దీనంగా చుట్టూ చూస్తోంది.

తన జాతి ప్రాణులకు దూరంగా ఉంటోంది. ఎవరైనా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తే...కలబడుతోంది. ఆ మూగప్రాణిలోని తల్లి మనసును చూసి.. జనం సైతం కంటనీరు పెట్టుకుంటున్నారంటే... ఆ దృశ్యం అక్కడి వారిని ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. తన పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే అవే తల్లిని పొదివి పట్టుకోవాలని మన పెద్దలు చెప్పే ‘మర్కట న్యాయం’ అనే పదం ‘అమ్మ’ ప్రేమ ముందు తలవంచుకుంది. గుండెలను పిండేసే ఈ దృశ్యం గురువారం  చిక్కడపల్లి డీడీ కాలనీలో కనిపించింది.
  - చిక్కడపల్లి
 

మరిన్ని వార్తలు