బహిరంగ చర్చకు భయమెందుకు: రేవంత్‌

6 Mar, 2017 01:08 IST|Sakshi
బహిరంగ చర్చకు భయమెందుకు: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి, అక్రమాలకు పాల్పడకుంటే బహి రంగ చర్చకు రావడానికి మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ప్రాజెక్టుల్లో పేదల కడుపులు కొట్టినందుకు ప్రైవేటు సంస్థల నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కనీసం రూ.150 కోట్లు ముడుపులు అందాయని ఒక ప్రకటనలో ఆరోపించారు. జేవీ ప్రాజెక్టులో మంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వస్తుందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖలో చక్కెర, కందిపప్పు, బియ్యం కొనుగోలులో మంత్రి ఈటల రాజేందర్‌కు రూ.వందల కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు.

బహిరంగంగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉన్న ధర కంటే ఎక్కువ ధరను చెల్లించి మూడేళ్లుగా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు సప్లయర్లకు కట్టబెట్టారని ఆరోపించారు. నిజాయితీకి మారుపేరని, నిప్పు అని చెప్పుకుంటున్న ఈటలకు ముడుపులు అందకుంటే చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ చేశారు. కళాధర్‌రావు అనే రిటైర్డు అధికారితో ఈటల కమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, చర్చకు వస్తే అన్నింటినీ నిరూపిస్తానని సవాల్‌ చేశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పించుకునే చిల్లరమల్లర ప్రయత్నాలు చేయకుండా, బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు.

మరిన్ని వార్తలు