భాగ్యనగరిలో సంగీత ఝరి!

11 Jan, 2016 02:38 IST|Sakshi
భాగ్యనగరిలో సంగీత ఝరి!

► హైదరాబాద్ వేదికగా ‘సెన్సేషన్’ డ్యాన్స్ షో

సాక్షి, హైదరాబాద్: ఆకాశం నుంచి అగ్నిపూలు జాలువారుతున్నాయా అన్నట్లు బాణసంచా కాల్పులు.. కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. లయబద్ధంగా వినిపిస్తూ ఉర్రూతలూగించే సంగీత ఝరి.. అందులో తడిసి ముద్దవుతూ కుర్రకారు డ్యాన్స్‌లు.. కళ్లకు కనువిందు చేసే లేజర్ షోలు.. ఇవన్నీ నెదర్లాండ్స్ కేంద్రంగా పుట్టి ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద డ్యాన్స్ షో ‘సెన్సేషన్’ విశేషాలు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో పుట్టి ప్రపంచ యువతను ఓలలాడిస్తున్న సెన్సేషన్ డ్యాన్స్ షోకు ఇప్పుడు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.

ఓ తరంగంలా సాగనున్న ఈ కార్యక్రమాన్ని సెన్సేషన్ నిర్వాహకులు ఏటా ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లోని ప్రముఖ స్టేడియాల్లో నిర్వహిస్తూ.. తొలిసారిగా భారత్‌లో.. అది కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. దాదాపు 50 వేలకు పైగా ప్రేక్షకులు ఈ డ్యాన్స్ షోలో పాల్గొంటారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్’ భారీ ప్రదర్శన ఇవ్వనుంది. ఇక్కడి యువతను కొంగొత్త లోకాల్లో విహరింపజేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్‌లో పాల్గొనదలచుకునేవారు తప్పని సరిగా తెలుపు రంగు దుస్తులు ధరించాలని నిబంధన ఉంది. అందుకే ఈ షో సెన్సేషన్ వైట్‌గా పేరొందింది. ఈ డ్రెస్ కోడ్‌ను అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ షోలో ప్రేక్షకులను ఓలలాడించేందుకు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారుల బృందం ఇక్కడికి రానుంది. వీరితో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ డీజేలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు.
 
ప్రభుత్వానికి అందివచ్చిన అవకాశం!

ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సెన్సేషన్ మంచి అవకాశం కానుంది. భిన్న సంస్కృతులతో అలరారుతున్న హైదరాబాద్‌ను ఈ డ్యాన్స్ షోకు వేదికగా మార్చుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిర్వాహకులు కోరారు. దీన్ని మంచి అవకాశంగా భావించిన ప్రభుత్వం దీనికి అనుమతులు జారీ చేసింది. వెంటనే గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేసేందుకు పర్యాటక శాఖ సంసిద్ధత ప్రకటించింది.
 

>
మరిన్ని వార్తలు