బతుకు ‘బస్టాండే’ | Sakshi
Sakshi News home page

బతుకు ‘బస్టాండే’

Published Mon, Jan 11 2016 5:14 PM

బతుకు ‘బస్టాండే’ - Sakshi

బస్టాండ్లలో వినియోగ చార్జీలు  బెజవాడతో మొదలు
 
 సాక్షి, హైదరాబాద్: బస్సు ఎక్కితేనే కాదు.. బస్టాండ్‌లో అడుగుపెట్టినా ప్రయాణికులపై చార్జీల భారం మోపేలా ఏపీఎస్ ఆర్టీసీ వ్యూహా లురచిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని బస్టాండ్లలో యూజర్ చార్జీల మోత మోగించడానికి రంగం సిద్ధం చేసింది. దశల వారీగా బస్టాండ్లలో యూజర్ చార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లను అభివృద్ధి చేసి, వాటిల్లో ఉండే మూత్రశాలల్లో చార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే ఇంకా ఆదాయ మార్గాలు ఏవేం ఉన్నాయో.. పరిశీలించి కన్సల్టెంట్లతో ప్రణాళికలు రూపొందించాలని యోచిస్తున్నారు. మార్చి 1 నాటికి అందిన ప్రతిపాదనలపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనున్నారు.

 మూత్ర విసర్జనకు రూ. 5 : ఇప్పటికే విజయవాడ బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు రూ. 5 వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణీకులు నిరసన వ్యక్తం చేస్తున్నా.. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం తమ వసూళ్లను సమర్థించుకుంటోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రైల్వే స్టేషన్‌లో మాదిరి తాము ఫ్లాట్ ఫాం టికెట్ వసూలు చేయడం లేదు కదా అంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రూ. 5 వసూలు విధానం రాష్ర్టంలోని అన్ని బస్టాండ్ల లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

 నష్టాల్ని తగ్గించుకోవడానికే..: ఆర్టీసీ గతేడాది నాటికి రూ. 330 కోట్ల నష్టాల్లో ఉందని, సంస్థలో అంతర్గత చర్యలు చేపట్టి (డీజిల్ భారం తగ్గడం, బస్ చార్జీలు పెంచడం) రూ.160 కోట్ల నష్టాన్ని తగ్గించగలిగామని ఆర్టీసీ పేర్కొంటోంది. యూజర్ చార్జీలు విధించి నష్టాల్ని కొంత మేరైనా తగ్గించేయోచనలో ఉన్నామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement