-

‘జీరో బడ్జెట్’ సేద్యంతోనే స్వావలంబన!

20 Mar, 2016 04:22 IST|Sakshi
‘జీరో బడ్జెట్’ సేద్యంతోనే స్వావలంబన!

♦ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ వెల్లడి
♦ రసాయనిక వ్యవసాయం అన్నివిధాలా వినాశకరం
♦ జీరోబడ్జెట్ సేద్యంతోనే అధికోత్పత్తి.. ఆరోగ్యం కూడా
 
 సాక్షి, హైదరాబాద్: రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయం భారత జాతికి వినాశకరమని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ అన్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల పంట భూములు నిస్సారమవడంతోపాటు, ప్రజలు కేన్సర్ వంటి భయంకర వ్యాధుల పాలవుతున్నారన్నారు. గో ఆధారితంగా సాగే జీరో బడ్జెట్ వ్యవసాయంతోనే గ్రామస్వరాజ్యం, స్వావలంబన, రైతు సౌభాగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ‘సేంద్రియ వ్యవసాయంతో రైతు సౌభాగ్యం’ అనే అంశంపై ఏకలవ్య ఫౌండేషన్, జాతీయ మెట్టపంటల పరిశోధనా సంస్థ(క్రీడా), ఎన్‌ఐఆర్‌డీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం ఆచార్య దేవ్ వ్రత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రసాయనిక అవశేషాలున్న ఆహారం స్లోపాయిజన్‌గా మారి జాతిని రోగగ్రస్తంగా మారుస్తోందని అంటూ.. నానాటికీ ఆసుపత్రులు, వైద్యుల సంఖ్యకన్నా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సేద్యం ఆధారమైతే, సేద్యానికి అవే మూలాధారమన్నారు. తాను 27 ఏళ్లుగా స్వయంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ, రసాయనిక వ్యవసాయదారులకన్నా అధికంగా దిగుబడి పొందుతున్నాన న్నారు. కురుక్షేత్ర (హర్యానా)లోని గురుకులంలో 150 ఎకరాల్లో పండించిన పంటలతో 1,700 మంది విద్యార్థులకు ఏ లోటూ లేకుండా ఆరోగ్యవంతమైన దేశీ ఆవు పాలను, ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఉప్పు, లోహాలు తప్ప మరేమీ బయటి నుంచి కొనాల్సిన అవసరం లేని జీరోబడ్జెట్ వ్యవసాయంతోనే రైతు సౌభాగ్యం సాధ్యమవుతుందని ఆచార్య దేవ్ వ్రత్ స్పష్టం చేశారు.

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయడంలో ఎదురవుతున్న సమస్యలపై రైతులు, వ్యాపారులు, స్వచ్ఛంద కార్యకర్తలు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో చర్చించి రానున్న మూడేళ్లలో చేపట్టే కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తారని ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ పి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సేంద్రియ సేద్యాన్ని దేశవ్యాప్తం చేయడంతోపాటు, ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి భాగయ్య అన్నారు. ‘క్రీడా’ డెరైక్టర్ శ్రీనివాసరావు, ఎన్‌ఐఆర్‌డీ డెరైక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, మహారాష్ట్రకు చెందిన కన్హెరి స్వామి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు