‘తియానన్మెన్‌’ మృతులు 10 వేల పైనే!

24 Dec, 2017 01:35 IST|Sakshi

బ్రిటన్‌ రహస్య పత్రాల్లో వెల్లడి

బీజింగ్‌: చైనా చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన, సుమారు మూడు దశాబ్దాల నాటి తియానన్మెన్‌ ఘటనలో మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రశాంతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు, విద్యార్థులపై చైనా సాయుధ బలగాలు ఉక్కుపాదం మోపడంతో మృతిచెందిన వారి సంఖ్య 10 వేలకు పైనే ఉంటుందని బ్రిటన్‌ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల్లో వెల్లడైంది. అప్పటి బ్రిటన్‌ రాయబారి అలన్‌ డొనాల్డ్‌ టెలిగ్రామ్‌ ద్వారా ఈ సమాచారాన్ని స్వదేశానికి చేరవేశారు. 1989 జూన్‌ 3, 4 మధ్య రాత్రి ఈ ఘటన జరగ్గా డొనాల్డ్‌ ఒక్కరోజు తరువాత అంటే జూన్‌ 5న ఈ టెలిగ్రామ్‌ పంపినట్లు తెలిసింది. ఉద్యమకారులపై సాయుధ బలగాలు పాల్పడిన హింసను డొనాల్డ్‌ తన టెలిగ్రామ్‌లో క్లుప్తంగా వివరించారు. ఈ ఘటనలో సుమారు వేయి మంది దాకా చనిపోయి ఉంటారని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు.

షూట్‌ చేసి ట్యాంకులతో తొక్కించి..
‘తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద అప్పటికే వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేయడానికి చైనా సాయుధ బలగాలు బీజింగ్‌ చేరుకున్నాయి. ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి తమకు గంట సమయం ఇస్తారని ఆందోళనకారులు భావించారు. కానీ ఐదు నిమిషాల్లోనే  పౌరులు, విధులు నిర్వర్తిస్తున్న సైనికులు అనే తేడా లేకుండా సాయుధ దళాలు ఏపీసీ(ఆర్మర్డ్‌ పర్సనల్‌ క్యారియర్‌) నుంచే కాల్పులు జరిపాయి. తరువాత మృతదేహాల మీదుగా పోనిచ్చి ఛిద్రం చేశారు. వారి శరీర అవశేషాలను ఆ తరువాత బుల్డోజర్లతో తరలించి కాల్చివేశారు’ అని డొనాల్డ్‌ నాటి భయానక విషయాలను కళ్లకు కట్టారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడి ద్వారా ఈ సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. దీంతో చైనా ఇంతకాలం ఈ చీకటి ఘటనపై చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయింది. ఆందోళనకారుల అణచివేత సందర్భంగా సుమారు 200 మంది పౌరులు, పోలీసులు, సైనికులు చనిపోయారని ఆ ఏడాది జూన్‌ చివరన చైనా ప్రకటించింది. డొనాల్డ్‌ వెల్లడించిన సమాచారం విశ్వసించదగినదేనని, ఇటీవల అమెరికా బహిర్గతం చేసిన పత్రాల్లోనూ ఇలాంటి అంశాలున్నాయని హాంకాంగ్‌ బాప్టిస్టు వర్సిటీ ప్రొఫెసర్‌ పియరీ కాబెస్టాన అన్నారు.

మరిన్ని వార్తలు