ఆ విద్యార్థుల ఉద్యమం ‘ఫేస్‌బుక్‌’ పుణ్యమా!

11 Aug, 2018 16:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ప్రజ్వరిల్లిన విద్యార్థి ఉద్యమం సహాయ నిరాకరణోద్యమంగా మారి దేశంలోని ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరిస్తుండడంతో బెంబేలెత్తిన ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం అన్యాయంగా అణచివేత చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీలతో విన్యాసం చేస్తూ భాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగిస్తూ, రబ్బర్‌ బుల్లెట్లను పేలుస్తూ వీర విహారం చేయడం మొదలు పెట్టారు. మరోపక్క మొబైల్‌ నెట్‌ సర్వీసులను స్తంభింప చేసిన అధికార యంత్రాంగం ‘ఫేస్‌బుక్‌’ను ఆడిపోసుకుంటోంది. విద్యార్థులను ఫేస్‌బుక్‌ చెడకొడుతుందని ప్రధాని స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పాలకపక్షానికి చెందిన అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగి విద్యార్థులపై దాడులు చేస్తూ ఉడతా భక్తిగా ప్రభుత్వానికి తాము ఉన్నామని చాటుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా చేతగాని దద్దమ్మల్లా తాము ఎలా కూర్చుంటామంటూ ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ జమాత్‌ ఏ ఇస్లామీ సంకీర్ణ కూటమి కార్యకర్తలు కూడా విద్యార్థుల గెటప్‌లో రంగంలోకి దిగి ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలోని పలు నగరాలు, ముఖ్యంగా ఢాకా నగరం రాజకీయ రణ రంగంగా మారిపోయింది. ఫేస్‌బుక్‌ కారణంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్న అసహనంతోనో, మరే కారణమోగానీ ‘ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌’లోని అత్యంత కఠినమైన 57వ సెక్షన్‌ కింద ఆందోళనాకారులపై బంగ్లా పోలీసులు దేశ ద్రోహం కేసులను బనాయిస్తున్నారు. ఈ సెక్షన్‌ కింద విద్యార్థుల ఉద్యమానికి ప్రాచుర్యం కల్పించిన జర్నలిస్టులను, మద్దతిచ్చిన సామాజిక కార్యకర్తలను అరెస్ట్‌ చేసి జైల్లో పెడుతున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తూ సోషల్‌ మీడియాలో హైలెట్‌ చేసిన సామాజిక ఔత్సాహిక జర్నలిస్టులను కూడా అరెస్ట్‌ చేస్తున్నారు.

ఈ సెక్షన్‌ కింద విద్యార్థులు కూడా అరెస్ట్‌ అయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గ్రహించిన సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పిలుపు మేరకు విద్యార్థులు తమ ఉద్యమాన్ని విరమించి ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి పాఠశాలలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వారి పేరుతో రోడ్డెక్కిన బంగ్లా నేషనలిస్ట్‌ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య రణరంగం కొనసాగుతోంది. అరెస్టయిన వారిలో అంతర్జాతీయంగా పలు పురస్కారాలు అందుకున్న ప్రముఖ బంగ్లాదేశ్‌ ఫొటోగ్రాఫర్, సామాజిక కార్యకర్త షాహిదుల్‌ ఆలమ్‌ కూడా ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆయన్ని నిర్బంధించి తీసుకెళ్లడం గమనార్హం. ఈ చట్టం ఎంత భయంకరమైనదంటే భారత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని 66 ఏ సెక్షన్‌ అంత. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, అస్పష్టంగా ఉండడంతో అమాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్న కారణంగా 2015లో భారత సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. బంగ్లాలో మాత్రం 2006లో అప్పటి నేషనలిస్ట్‌ పార్టీ తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజల అణచివేతకు బాగా ఉపయోగపడుతోంది.

జూలై 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో రోడ్డు భద్రతా సూత్రాలను పాటించాలని ఇటు ప్రజలకు, మరింత పటిష్టం చేయాలని అటు అధికారులకు పిలుపునిస్తూ విద్యార్థుల నుంచి వినూత్న ఉద్యమం పుట్టించుకొచ్చిన విషయం తెల్సిందే. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా విద్యార్థులు ఎంతో సహనంతో ప్రశాంతంగా ఉద్యమం నిర్వహించడం ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించింది. ఉద్యమం కాస్త పౌర సహాయ నిరాకరణ ఉద్యమంగా మారుతుండడంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాలకపక్ష అణచివేతకు దిగింది. అదే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష కూటమి కూడా రంగంలోకి దిగింది. దీంతో పౌర ఆందోళన కాస్త రాజకీయ రణ క్షేత్రంగా మారిపోయింది. 2019, జనవరిలోగా బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాల్సి ఉంది.

2001 సంవత్సరం నుంచి వివిధ పౌర అంశాలపై బంగ్లాలో యువకులు, విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, వాటిని అణచివేయడం బంగ్లా ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అణచివేత ధోరణినే అనుసరించింది. ప్రజాస్వామ్యం పేరిట నిరంకుశంగానే వ్యవహరించింది. గత అయిదేళ్లుగా షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్న భారత ప్రభుత్వం ప్రస్తుత అణచివేత పర్వంపై మౌనమే పాటిస్తోంది. ‘నాయకులనే వారు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. ప్రజలెవరికీ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉండకూడదనే. కిరాయి గూండాలతో ప్రజల డిమాండ్లను అణచివేయవచ్చని అనుకుంటారు. అలాంటి చర్యలు ఎప్పటికీ విజయవంతం కావు’ అని బంగ్లాదేశ్‌ జాతిపిత, అవామీ లీగ్‌ మూలపురుషుడు షేక్‌ ముజిబూర్‌ రహమాన్‌ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల విశ్వాసం ఉంటే ఆయన కూతురైన షేక్‌ హసీనా ఈ అణచివేత చర్యలకు దిగేవారు కాదమో!

చదవండి:
విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’

మరిన్ని వార్తలు