అమ్మో.. అమెరికా..!

21 Jan, 2019 03:26 IST|Sakshi

విదేశీ విద్యార్థుల్ని భయపెడుతున్న ట్రంప్‌ సర్కారు

అమెరికా వర్సిటీల్లో తగ్గుతున్న విదేశీ విద్యార్థులు

లూయిస్‌ కార్లోస్‌ సోల్డ్‌విల్లా మెక్సికో సిటీ హైస్కూల్‌లో మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. తర్వాత బోస్టన్‌ యూనివర్సిటీలో కాని, వాషింగ్టన్‌ యూనివర్సిటీలోకాని చేరాలనుకున్నాడు. ఆ రెండు వర్సిటీలు కార్లోస్‌కు సీటు కూడా ఆఫర్‌ చేశాయి. అయితే, చివరికి కార్లోస్‌ ఈ రెండింటిలోనూ కాకుండా కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో చేరాడు. అమెరికా వర్సిటీలు సీటివ్వడానికి ముందుకొచ్చినా కూడా కెనడాకెందుకు వెళ్లావని ప్రశ్నిస్తే 19 ఏళ్ల కార్లోస్‌ చెప్పిన సమాధానం ‘అక్కడ ట్రంప్‌ లేడుగా’ అని. ప్రస్తుతం ‘అమెరికా చదువుల’ పరిస్థితికి నిదర్శనమిది.  

సురక్షితం కాదా!
కొన్ని దశాబ్దాలుగా అమెరికా ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. విదేశీ విద్యార్ధుల వల్ల అమెరికాకు ఏటా కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తోంది. వేల ఉద్యోగాల కల్పన జరుగుతోంది. అయితే, ట్రంప్‌ సర్కారు విధానాలు వారిని భయపెడుతున్నాయి. దాంతో చదువుకోసం ఇక్కడికి వచ్చే బదులు ఇతర దేశాలకు వెళుతున్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, తీసుకుంటున్న చర్యల కారణంగా విదేశీ విద్యార్ధుల రాక తగ్గుతోంది.

2017–18లో అమెరికా విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థుల నమోదు 6.6 శాతం తగ్గిందని ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ (అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేటర్స్‌) డైరెక్టర్‌ రాచెల్‌ బ్యాంక్స్‌ చెప్పారు. వీసా మంజూరులో జాప్యం, వీసాల తిరస్కరణ, దేశంలో సామాజిక, రాజకీయ వాతావరణం, చదువుకయ్యే ఖర్చు పెరగడం వంటి కారణాల వల్ల విదేశీ విద్యార్ధుల రాక తగ్గుతోందన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేయడం అంటే ముస్లిం దేశాల ప్రజలను అనుమతించకపోవడం, అక్రమంగా వచ్చిన వాళ్లలో తలిదండ్రులను, పిల్లలను వేరువేరుగా బంధించడం వంటి వాటివల్ల విదేశీ విద్యార్ధులు వారి తల్లిదండ్రుల్లో అమెరికా సురక్షితం కాదన్న భావన పెరుగుతోందన్నారు.

విదేశీ విద్యార్థులే ఆధారం
విదేశీ విద్యార్థుల వల్ల కాలిఫోర్నియా, న్యూయార్క్, మసాచుసెట్స్, టెక్సాస్, పెన్సిల్వేనియాలు ఎక్కువ లాభపడ్డాయి. విద్య, ముఖ్యంగా ఉన్నత విద్య అమెరికా అందించే ప్రధాన సేవ. మనం ఈ సేవను అందించడం వల్ల విదేశీయులు దేశంలోకి డబ్బు పంపుతున్నారు. మనం సోయా లేదా బొగ్గును విదేశాలకు పంపితే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో అలాంటిదే వీరివల్ల కలుగుతోంది’ అని కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్‌ డిక్‌ స్టార్ట్‌జ్‌ 2017లో బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూషన్‌ బ్లాగ్‌లో రాశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దగ్గర డాలర్లు నిండుకున్నప్పుడు విద్యాసంస్థలు విదేశీ విద్యార్థులను ట్యూషన్లకు ఉపయోగించుకుంటాయన్నారు.

కీలక రంగాల్లో వెనకే!
సైన్స్, ఇంజనీరింగ్‌ వంటి కీలక రంగాలకు సంబంధించిన ఉన్నత విద్యలో అమెరికా ఇతర దేశాల కంటే వెనకబడి ఉంది. ఈ రంగాల్లో విదేశీ విద్యార్థులు లేకుండా అమెరికా పని చేయలేదని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ 2017 నాటి నివేదిక హెచ్చరించింది. దాదాపు 90శాతం అమెరికా వర్సిటీల్లో కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మాస్టర్‌ డిగ్రీ ,పీహెచ్‌డీలు చేసే వారిలో అత్యధికులు విదేశీ విద్యార్థులే. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు విదేశీ మేధావుల్ని ఆకట్టుకుంటున్నాయని నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ రవి శంకర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు