‘డాలర్‌ డ్రీమ్స్‌’ పగటి కలేనా..!

26 Dec, 2017 01:12 IST|Sakshi

హెచ్‌–1బీ వీసా జారీ నిబంధనలు కఠినతరం చేస్తున్న అమెరికా

ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చే అవకాశం

భారత ఐటీ కంపెనీలకు దెబ్బ!

అమెరికాలో పనిచేసే విదేశీయులకు అవసరమైన హెచ్‌–1బీ వీసా పొందేందుకు నిబంధనలు కఠినతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) వీసా జారీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసే దిశగా నిబంధనలను రూపొందిస్తోంది. అదే జరిగితే అమెరికా వెళ్లాలనుకునే విదేశీయులకు, మరీ ప్రధానంగా భారత ఐటీ నిపుణులకు అవకాశాలు తగ్గిపోతాయి. హెచ్‌–1బీ వీసాలు అత్యధికంగా భారత ఐటీ కంపెనీలకు దక్కుతుండటమే ఇందుకు కారణం. కొత్త నిబంధనలు వస్తే భారత ఐటీ సేవల కంపెనీలకూ గట్టి దెబ్బ తగులుతుంది. హెచ్‌–1బీ వీసాల జారీకి అనుసరిస్తున్న విధానాల్లో మార్పులకు 2011లోనే ఈ ప్రతిపాదన వచ్చింది.

ఇప్పుడు మళ్లీ దీన్ని తెరపైకి తెచ్చిన డీహెచ్‌ఎస్‌ వచ్చే ఏడాది నుంచి అమలుచేయాలని యోచిస్తోందని అంతర్జాతీయ వలసల సంస్థ ఫ్రాగోమన్‌ వరల్డ్‌వైడ్‌ తెలిపింది. ఈ ఆరేళ్లనాటి ప్రతిపాదన ప్రకారం లాటరీలో పాల్గొనడానికి ముందుగానే కంపెనీలు హెచ్‌–1బీ క్యాప్‌ లాటరీ కోసం రిజిస్టర్‌ చేసుకుని క్యాప్‌ నంబరు పొందాల్సి ఉంటుంది. క్యాప్‌ నంబర్‌ ఉన్నవారినే లాటరీలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. అత్యధిక జీతం, గరిష్ట స్థాయి నైపుణ్యం ఉన్న నిపుణులకు అమెరికాలో పనిచేసే అవకాశం కల్పించడానికి అనువుగానే హెచ్‌–1బీ వీసాలు జారీచేసే ప్రాధాన్యతా పద్ధతిని డీహెచ్‌ఎస్‌ ప్రవేశపెడుతుందని ఈ సంస్థ తెలిపింది. హెచ్‌–1బీ పొందేందుకు అవసరమైన కనీస వేతనాన్ని మార్చాలని హోంలాండ్‌ విభాగం భావిస్తోందంది.

వచ్చే ఏడాదే మార్పులు అమలవుతాయా?
ఒకవేళ నిబంధనలను మార్చే ప్రక్రియను డీహెచ్‌ఎస్‌ ఇప్పుడు మొదలుపెట్టినా సాధారణ పద్ధతిలో అయితే అవి వచ్చే ఏడాది అమలయ్యే పరిస్థితి లేదు. ఏప్రిల్‌ నుంచి వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవనుండగా, మార్పులు అమల్లోకి రావడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ మార్పులను అత్యవసర నిబంధన కింద ప్రవేశపెడితే మాత్రం వచ్చే ఏడాది అనేక కంపెనీలు హెచ్‌–1బీ వీసా దరఖాస్తుల దాఖలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఫ్రాగొమన్‌ అంటోంది.

గత కొన్ని నెలలుగా అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) ఈ ఎంపిక ప్రక్రియలో అనేక మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసిందనీ, ఈ మార్పులన్నీ అమలైతే హెచ్‌–1బీ వీసా పొందడం చాలా కష్టమౌతుందని అమెరికాలోని కార్నెల్‌ లా స్కూల్‌ ప్రొఫెసర్‌ స్టీవెన్‌ యేల్‌ లీహర్‌ చెప్పారు. వీసా దరఖాస్తుదారులు తమ అర్హతకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాలు సమర్పించాలని అధికారులు అడగడం 41 శాతం పెరిగిందని ఆయన వివరించారు. నైపుణ్యమున్నా లేకున్నా మొత్తంగా అమెరికాలోకి వలసదారుల ప్రవేశాన్ని అడ్డుకోవాలనే పట్టుదలతో ట్రంప్‌ ఉన్నారని కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్‌ వివేక్‌ వాధ్వాన్‌ వాపోయారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు