రిపబ్లికన్లా? డెమొక్రాట్లా?

5 Nov, 2018 03:18 IST|Sakshi

అమెరికా కాంగ్రెస్‌పై పట్టు సాధించేదెవరు

రేపే మధ్యంతర ఎన్నికలు

అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ నెల 6న మధ్యంతర ఎన్నికలు (మిడ్‌ టర్మ్‌ ఎలక్షన్స్‌) జరగనున్నాయి. అధ్యక్షుడి పాలనా కాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రతినిధుల సభ, సెనేట్‌తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లు ఎవరికి వారు తామే మెజారీటీ సీట్లు దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 22 నెలల పాలనపై రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీ (రిపబ్లికన్లు)గెలిస్తే ఆయన వివాదాస్పద నిర్ణయాలు, అమెరికా ఆధిపత్య చర్యలు పెరుగుతాయనీ, ఆయనకు అడ్డూ అదుపూ ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే డెమొక్రాట్లు గెలిస్తే ట్రంప్‌ దూకుడుకు ముకుతాడు పడుతుందని, ఆయన తీరు ప్రజలకు నచ్చలేదన్న సంగతి స్పష్టమవుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్‌లలో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌లకు 241 స్థానాలు, డెమొక్రాట్లకు 194 సీట్లు ఉన్నాయి. సెనెట్‌లో 52 రిపబ్లికన్లవయితే, 48 డెమొక్రాట్లవి. అయితే దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అచ్చిరావడం లేదని గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 1934 నుంచి ఇంత వరకు 21 సార్లు మధ్యంతర ఎన్నికలు జరగ్గా కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలిచింది.

ట్రంప్‌ పాలనపై రెఫరెండం
అమెరికా అధ్యక్ష పదవి చేపటాక ట్రంప్‌ తీసుకున్న పలు నిర్ణయాలు ఆ దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ వివాదాస్పదమయ్యాయి. అమెరికన్లకు ఉద్యోగ ప్రయోజనాలు కలిగేలా వలస నిబంధనలను కఠినతరం చేస్తుండటం, ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించడం, చైనాతో వాణిజ్య యుద్ధం, గత ప్రభుత్వం ఇరాన్‌తో  కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించడం తదితర తీవ్ర, వివాదస్పద నిర్ణయాలను ట్రంప్‌ తీసుకున్నారు. వీటిని ట్రంప్‌ పార్టీలోనే చాలా మంది తప్పుబడుతున్నారు.

ఇప్పటికి ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టి 22 నెలలు అవుతోంది. దీంతో మధ్యంతర ఎన్నికలను ట్రంప్‌ పాలనపై రెఫరెండంగా భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్‌ పార్టీ ఒబామా కేర్‌గా పేరొందిన ఆరోగ్య బీమా చట్టం కొనసాగింపును ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ట్రంప్‌ ప్రకటించిన పన్నుల కోతనూ తమకనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తోంది. అటు రిపబ్లికన్లు వీసాలు, అక్రమ వలసలపై దృష్టి పెట్టడంతో పాటు ఆర్థిక పునరుజ్జీవానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసిన వారిలో 51శాతం మంది ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారనీ, ఇది డెమొక్రాట్లకు లాభం కలిగిస్తుందని సర్వేలో వెల్లడయింది.

విదేశీ జోక్యం
2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, దాని ప్రమేయం వల్ల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో కూడా రష్యా, చైనాలు జోక్యం చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎన్నికలను రష్యా నియంత్రిస్తోందని ఆరు అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఉమ్మడి నివేదికలో స్పష్టం చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రష్యా అమెరికన్లను ప్రభావితం చేస్తోందని ఆ సంస్థలు ఆరోపించాయి. మధ్యంతర ఎన్నికల్లో రష్యా చురుకుగా జోక్యం చేసుకుంటుండటం వాస్తవమేనని, అదింకా కొనసాగుతోందని గత ఆగస్టులో నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ డాన్‌ కోట్స్‌ అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

అధికంగా ముందస్తు పోలింగ్‌
మధ్యంతర ఎన్నికలకు పోలింగ్‌ మంగళవారం జరగనున్నప్పటికీ ముందుగానే ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. పోలింగ్‌ రోజు రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ ముందస్తు పోలింగ్‌ను గతంలో కన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారనీ, ముఖ్యంగా యువత ముందున్నారని అధికారులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతే డాది కన్నా ఈ ఏడాది రెట్టింపు ముందస్తు ఓటిం గ్‌ నమోదైందన్నారు. అమెరికా వ్యాప్తంగా  3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటేశారు.

మరిన్ని వార్తలు