ఐరాసలో పాక్‌కు భారత్‌ కౌంటర్‌

22 Sep, 2017 11:52 IST|Sakshi
ఐరాసలో పాక్‌కు భారత్‌ కౌంటర్‌
సాక్షి, న్యూయార్క్‌ : ఉగ్రవాదాన్ని నియంత్రించటంలో విఫలమైన పాకిస్థాన్‌ ప్రపంచదేశాలకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పటం విడ్డూరంగా ఉందని ఐక్యరాజ్య సమితిలో భారత్ కార్యదర్శి ఈనామ్‌ గంభీర్‌ తెలిపారు. శుక్రవారం జనరల్‌ అసెంబ్లీలో ప్రసగించిన ఆమె పాక్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ ఇప్పుడు టెర్రరిస్థాన్‌ గా మారిపోయిందని, అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని ఆమె చెప్పారు.
 
‘పాకిస్థాన్ ఇప్పుడు టెర్రరిస్థాన్ గా మారిపోయింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ.. ఇతర దేశాలపైకి ఉసిగొల్పుతోంది. పాక్ తో ప్రపంచ దేశాలకు పెను ప్రమాదం పొంచివుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను పంపుతూ విధ్వంసాలకు దిగుతోంది. భారత్‌ ఎంతో సంయమనంగా వ్యవహరిస్తున్నా.. మౌలిక వసతులు, సంక్షేమ పథకాల పేరిట అమెరికా వంటి అగ్రరాజ్యాల నుంచి సేకరించి, ఉగ్రవాద సంస్థలకు సాయం అందజేస్తోంది’ అని గంభీర్‌ పేర్కొన్నారు. 
 
అమెరికాను దాడులతో వణికించిన ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలోనే తలదాచుకున్నాడన్న విషయం పాక్‌కి తెలీదా? అమెరికా దళాలు ఒసామాను పాక్ పట్టణం అబోటాబాద్‌లోనే హతమార్చాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన నేత హఫీజ్ సయీద్ ను ఐరాస గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అయినప్పటికీ, పాక్ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎన్నో కుట్రల సూత్రధారి అయిన హఫీజ్ ఇప్పుడు ఆ దేశంలోనే ఉన్నాడు. ఇవి అన్నీ నిజం కావని పాక్‌ ఒప్పుకుంటుందా? అని గంభీర్‌ ప్రశ్నించారు.
 
అక్కడి వీధుల్లో ఉగ్రవాదులు తుపాకులతో ప్రజల మధ్యే సంచరిస్తుంటారని, అలాంటిది మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే పాక్‌ ప్రజాస్వామ్య పాఠాలు చెప్పటం విడ్డూరంగా ఉందని ఆమె తెలిపింది. తన తొలి ఐరాస ప్రసంగంలో భారత్ పై పాక్‌ ప్రధానమంత్రి షాహిద్ ఖాకాన్ అబ్బాసీ తీవ్ర విమర్శలు చేయటంతో.. దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత్ తరపున గట్టి కౌంటర్ ఇచ్చారు ఈనామ్‌ గంభీర్‌.