మా వ్యూహాల్ని భారత్‌ అమలు చేసింది: పాక్‌ మంత్రి

23 May, 2018 11:50 IST|Sakshi
పాకిస్తాన్‌ మంత్రి అసన్‌ ఇక్బాల్‌ (ఫైల్‌ ఫొటో)

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఆర్థికవేత్త, మాజీ మంత్రి సత్రాజ్‌ అజీజ్‌ వ్యూహాల్ని చక్కగా అమలు చేయడం వల్లే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని పాక్‌ మంత్రి అసన్‌ ఇక్బాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌, బంగ్లాదేశ్‌ వంటి పొరుగు దేశాలు తమ వ్యూహాల్ని అమలు చేయడం ద్వారా ప్రస్తుతం తమ కంటే ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. 90వ దశకంలో భారత్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని.. ఆ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ సత్రాజ్‌ అజీజ్‌ సలహా కోరారని వ్యాఖ్యానించారు. సత్రాజ్‌ అజీజ్‌ వ్యూహాల్ని చక్కగా అమలు చేసిన మన్మోహన్‌.. భారత్‌లో పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు.

యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే సరిపోవు..
పాకిస్తాన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీని ప్రారంభించిన అసన్‌ ఇక్బాల్‌.. 2013లో 2జీ వైర్‌లెస్‌ టెక్నాలజీని వినియోగించిన పాక్‌ ప్రస్తుతం 5జీ టెక్నాలజీని వినియోగిస్తున్న దేశాల్లో ముందుందని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి దేశంలో తలెత్తిన రాజకీయ అస్థిరతే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే దేశాన్ని కాపాడలేవని, ఆర్థికంగా బలోపేతమైనపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే శాంతి స్థిరీకరణ, కొనసాగింపు అవసరమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు