చనిపోయాడనుకొని రెండు రోజులు మార్చురీలో..

14 Dec, 2016 08:49 IST|Sakshi
చనిపోయాడనుకొని రెండు రోజులు మార్చురీలో..

డర‍్బన్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని సరిగా పరీక్షించకుండానే చనిపోయినట్లు నిర్ధారించి మార్చరీ ఫ్రీజర్‌లో ఉంచారు. అలా ఉంచిన రెండు రోజుల తరువాత మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులు తమ కొడుకు బతికే ఉన్నాడని గుర్తించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది.

డర‍్బన్‌ సమీపంలోని క్వామషు ప్రాంతంలో సిజి కిజే(28) అనే వ్యక్తి గతవారం రాత్రి వేళలో రోడ్డుపై నడిచి వెళుతుండగా ఓ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని.. పారామెడికల్‌ సిబ్బంది పరిశీలించి చనిపోయినట్లు భావించి నేరుగా మార్చురీకి తరలించారు. ఆ రాత్రితో పాటు మరునాడు కూడా సిజి కిజే మార్చురీ ఫ్రీజర్‌లోనే ఉన్నాడు. అనంతరం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటూ.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన సిజి కిజే తండ్రి.. కొడుకు బతికే ఉన్నాడని గుర్తించాడు. వెంటనే అక్కడి మహాత్మా గాంధీ హాస్పిటల్‌కు సిజి కిజేను తరలించారు. వైద్యులు సుమారు 5 గంటల పాటు సిజీ కిజేను బతికించడానికి ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు. రోడ్డు ప్రమాద గాయాలకు తోడు రెండు రోజులుగా మార్చురీ ఫ్రీజర్‌లో ఉన్న ఫలితంగా అతడు మృతి చెందాడు.

తన కొడుకు విషయంలో ఆరోగ్య సిబ్బంది చేసిన పొరపాటుపై స్పందించడానికి మాటలు రావడం లేదని సిజి కిజే తండ్రి పీటర్‌ కిజే వెల్లడించారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన అనంతరం గోల్డెన్‌ అవర్‌గా భావించే సమయంలో అతడికి సరైన చికిత్స అందలేదని డాక్టర్‌ రిషిజన్ విరానా వెల్లడించారు.

మరిన్ని వార్తలు