భారత్‌లోని పరీక్షతో బ్రిటన్‌లో చదవొచ్చు

24 Jun, 2019 05:38 IST|Sakshi

స్పష్టం చేసిన క్వీన్‌ యూనివర్సిటీ

న్యూఢిల్లీ: భారత్‌లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షల ద్వారా కూడా విద్యార్ధులను ఎంపిక చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌లోని క్వీన్‌ యూనివర్సిటీ తెలిపింది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో వారికి అవకాశం కల్పిస్తామని వైస్‌ చాన్స్‌లర్‌ ఇయాన్‌ గ్రీర్‌ స్పష్టంచేశారు. సాధారణంగా యూకే యూనివర్సిటీలు లెవెల్‌–ఏ పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే ప్రవేశ పరీక్షలకు వివిధ దేశాల్లో విభిన్న ప్రామాణికతలు ఉంటాయని, భారత్‌లోని పరీక్షలు తాము నిర్దేశించుకున్న స్థాయిలోనే ఉన్నాయని ఇయాన్‌ అన్నారు.

చాలా మంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా సీట్ల కొరతతో ఐఐటీల్లో చేరలేకపోతున్నారన్నారు. మరో అవకాశం లేక తక్కువ స్థాయి ఉన్న కాలేజీల్లో చేరతారన్నారు. ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ కాలేజీల్లో చదివే అవకాశం కల్పిస్తామన్నారు. జేఈఈలాగే ఇతర జాతీయ స్థాయి పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా 200 మందికి పైగా భారత విద్యార్థులను చేర్చుకున్నామని, రానున్న అయిదేళ్లలో  మరింత మందిని చేర్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. 

మరిన్ని వార్తలు