ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి

18 Feb, 2018 08:05 IST|Sakshi

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎంపీ వినోద్‌

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ప్రస్తుత కాలంలో మానవునికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, మనశ్శాంతి కోరుకునే వారు ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు వినోద్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చుకులు, పాలకవర్గం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తీరును చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. 

తొమ్మిది రోజుల పాటు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. 23, 24, 25 తేదీల్లో జరుగనున్న కళ్యాణం, శోభాయాత్ర కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గంగులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ళపు రమేశ్, కార్పొరేటర్లు వై. సునీల్‌రావు, ఏవీ రమణ, పిట్టల శ్రీనివాస్, శ్రీకాంత్, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

అలరించిన సాంసృతిక కార్యక్రమాలు..
శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. భక్తీ రసాన్ని పండించే విధంగా విద్యార్థులు, చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కట్ట సిస్టర్స్‌ మంజుల, సంగీత, పెందోట బాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భక్తీ సంగీతం, జవహర్‌ బాల కేంద్రం ఆధ్వర్యంలో సాంసృతిక  కార్యక్రమాలు, కనపర్తి శ్రీనివాస్, సౌజన్య, రాసమల్ల రవి, రాధిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు