ఇక కశ్మీర్‌లో కారం బాంబులు!

30 Aug, 2016 02:20 IST|Sakshi
ఇక కశ్మీర్‌లో కారం బాంబులు!

నిపుణుల కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా కారం నింపిన గ్రెనేడ్లు (కారం బాంబులు), స్టన్ లాక్ షెల్స్ వాడాలని దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచించింది. అరుదైన సందర్భాల్లో పెల్లెట్ గన్లను వాడాలంది.  కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మంగళవారం హోంశాఖ కార్యదర్శికి సమర్పించిందని అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించలేదు.

అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం.. నోనివామైడ్ అని పిలిచే పెలార్గానిక్ యాసిడ్ వానిలైల్ అమైడ్ (పావా)తో పాటు.. స్టన్ లాక్ షెల్స్, లాంగ్ రేంజ్ అకోస్టిక్ డివైజ్ (లార్డ్) వంటి ప్రాణాంతకం కాని మందుగుండును పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చునని కమిటీ సూచించింది.
 
కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

శ్రీనగర్: కశ్మీర్‌లో 51 రోజుల క ర్ఫ్యూకు తెరపడింది. 3 పోలీస్ స్టేషన్ల పరిధిని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో సోమవారం నుంచి కర్ఫ్యూను ఎత్తివేశారు. శ్రీనగర్‌లో పలుచోట్ల, బుద్గామ్ జిల్లాలోనూ సోమవారం పలు గొడవలు జరిగినా ఎవరూ గాయపడలేదు. పుల్వామా, శ్రీనగర్‌లోని ఎంఆర్ గంజ్, నౌహాట్టా పోలీసు స్టేషన్ల పరిధిలోనే  కర్ఫ్యూ కొనసాగించారు.
 
4న కశ్మీర్‌కు అఖిలపక్షం
హోం మంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం సెప్టెంబర్ 4న కశ్మీర్ పర్యటించనుంది. అఖిలపక్షం ప్రజలు, సంస్థల్ని కలసి పరిస్థితిపై వివరాలు సేకరిస్తుంది. వేర్పాటువాద నేతల్ని కలిసేందుకు అఖిలపక్ష నేతలకు స్వేచ్ఛ ఉండడంతో వారితో చర్చించే అవకాశముంది. రాజ్‌నాథ్ ఆ చర్చల్లో పాల్గొనరు. అఖిలపక్ష బృందం పర్యటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ... బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌లతో ఆదివారం గంట పాటు చర్చించింది.

>
మరిన్ని వార్తలు