ఫిరాయింపుల చట్ట సవరణకు సుముఖంగా ఉన్నాం

26 May, 2016 01:52 IST|Sakshi

కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు సుముఖంగా ఉన్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. లా కమిషన్ ఈ దిశగా కొన్ని సిఫారసులు చేసిందని, వీటిని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదికను బట్టి ఫిరాయింపుల వ్యతిరేక చట్ట సవరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

తన శాఖ రెండేళ్ల పనితీరుపై ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు పెరుగుతున్నాయని, దీనిపై కేంద్రం వైఖరి ఏంటని ప్రశ్నించినప్పుడు న్యాయ మంత్రి ఈ సమాధానమిచ్చారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుందని, ఏపీలో మౌలిక సదుపాయాల ఏర్పాటు జరిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ అంశంలో తాను ఇంతకుమించి సమాధానం చెప్పలేనని స్పష్టంచేశారు.

>
మరిన్ని వార్తలు